home
Shri Datta Swami

 09 Apr 2025

 

నిజమైన కైవల్యమేది?

[03.03.2004] నరసరావుపేట నుండి విజయవాడ రావాలి అనుకొండి. ముందు నరసరావుపేట నుండి గుంటూరు రావాలి కదా. ఇదే ఆధ్యాత్మికసాధనలో మోక్షము చేరుట. అనగా ఇక్కడ ఈ సాధనలో భజనలు, వ్రతాలు, జపాలు మాత్రమే ఉంటాయి. వీటి ఫలము ఐహికములను మాత్రము పొందటమే. అనగా శాంతిని పొందడము. ఇదే ఆత్మశాంతి అని చెప్పబడినది. ఇక్కడ భగవంతుడు సాధకునికి ఇచ్చే ప్రత్యేక ఫలము ఏమీ ఉండదు. నీ స్వార్థము తీర్చుటకు స్వామి నీ పుణ్యఫలాలనే నీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ గొప్పదియైన చైతన్యమును (గొప్పది బ్రహ్మ అంటారు గదా) చేరటమే ఆత్మశాంతి. ఇక్కడతో ప్రయాణము ఆగలేదు కదా. గుంటూరు నుండి విజయవాడ వెళ్ళాలి గదా. ఇదే ఆధ్యాత్మికములో కైవల్యాన్ని చేరడము. అంటే మాయా సహితుడైన బ్రహ్మాన్ని అంటే ఈశ్వరుని చేరటమే కైవల్యము.

ఆత్మశాంతి పరమాత్మశాంతి కాదు. మరి పరమాత్మశాంతికి మార్గమేమి? అనగా త్యాగమే అని సమాధానము. అనగా ‘త్యాగేనైకే అమృతత్వ మానసుః, ధనేన త్యాగేనైకే, ధనమూల మిదం జగత్’ అని వేదము చెప్పినది. ఈ దారి కష్టమైనది. ఇక్కడ త్యాగమే ప్రధానము. ఇదే ముళ్ళబాట. ఈ త్యాగమార్గములో మూడు సాధనలు ఉన్నాయి. i) అహంకారము పోగొట్టుకొనుట. ii) అసూయను పోగొట్టుకొనుట. స్వామి ఒక భక్తుని ఎక్కువగా ప్రేమించినపుడు స్వామి మీద అసూయ పడరాదు. అలా అని ఆ భక్తుని పై ఈర్ష్యపడరాదు. ఆ భక్తుడు ఆ ప్రేమను సాధించుకొనుటకు ఏమి చేశాడో పరిశీలించి, తాను కూడా ఆచరించాలి. iii) మనసా, వాచా, కర్మణా ఒకే విధముగా యుండుట. ఏది సంకల్పిస్తున్నావో, అదే ఉచ్చరించు, అదే కర్మలో కూడ చేయుము. దీనినే ‘మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనః’ అని అన్నారు. విజయవాడ దగ్గర కల కృష్ణాకెనాల్ చేరటం అంటే లక్ష్యముతో సామీప్యమే. కాని, అక్కడతో ఆగరాదు. లక్ష్యమైన విజయవాడ చేరాలి. అంటే అదే పరమాత్మతో సాయుజ్యం వంటిది. అంటే కైవల్యము చెందాలి. కైవల్యమంటే పరమాత్మలో దూరటం కాదు, లేక ఐక్యమైపోవడం కాదు. ఇక్కడ మనలోకంలో స్వామి యోగ్యుడైన భక్తుని ద్వారా అష్టసిద్ధులు ప్రదర్శిస్తారు. అట్టి భక్తుడు ఇతర భక్తులకు మార్గదర్శకుడౌతాడు. ఇక్కడ ప్రపంచమంతా తన కుటుంబమౌతుంది. ఇక్కడ స్వామి మాటే తన మాటగా అవుతుంది. ఇదే చరమ కైవల్యఫలము.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch