23 Sep 2024
సరే! దత్తుడు ఏల నిత్యము మనుష్యరూపమున ఉన్నాడు? దీనికి కారణము - దత్తుడనగా దానము. అనగా త్యాగము. దత్తుడు ఎల్లప్పుడును తన భక్తుల దుష్కర్మఫలములను అనుభవించి వారలకు నిత్యసుఖమును కలుగచేయుచున్నాడు. అయితే భక్తులచేత వారి దుష్కర్మఫలమును నూటిలో ఒక్కపాలు మాత్రమే అనుభవింపచేయుచున్నాడు. ఏలననగా కర్మ చేసినవాడు ఆ మాత్రమైననూ అనుభవించకపోవుట పరమదారుణమైన అన్యాయము. ఐతే భక్తులు ఆ ఒక్క పాలును కూడా అనుభవించు ఓర్పులేక నా వంద రూపాయల జరిమానాలో 99 రూపాయిలు కట్టి ఒక్క రూపాయిని మాత్రము ఏల కట్టవు అని దత్తుని నిలదీయుచున్నారు. అట్టి వారు కృతఘ్నులు. స్వార్థ దుర్గంధముతో కూడిన మురికిగుంటలు. అట్టి వారి మాయరోగమును దత్తుడు బాగుగనే కుదుర్చుచున్నాడు. ఎట్లు అనగా వాడు కోరినట్లే వారి దుష్కర్మ ఫలమును 100 పాళ్ళు తీయుచున్నాడు. కాని ఆ వందరూకల జరిమానాను మరుజన్మకు త్రోయుచున్నాడు. మరుజన్మలో వడ్డీ పెరిగి అట్టివాడు రెండువందల రూకల జరిమానాను కట్టుచున్నాడు. ఇది అంతయు వానికి తెలియక తన దుష్కర్మఫలమును తాను మహాభక్తుడు కావున దత్తుడే అనుభవించినాడనియు లేక తన దుష్కర్మఫలము నిశ్శేషముగా దత్తుడు రద్దుచేసినాడనియు తలచుచున్నాడు.
ఈ విధముగా వారి జ్ఞానము అజ్ఞానముచే ఆవృతమైనందున భ్రమ మోహములో పడుచున్నారని ‘అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః’ అని గీత చెప్పుచున్నది. కాని సాధువులైన సద్భక్తులు లేకపోలేదు. అట్టివారు వారి కష్టనివృత్తిని ఎప్పుడును యాచింపరు. వారికి కష్టనివృత్తి ఎట్లు జరుగునో తెలియును. దానిని దత్తుడు అనుభవించి బాధపడునని వారికి తెలియును. కావున ఇప్పటి కష్టమునే కాక రాబోవు జన్మలలోని కష్టములను కూడా ఇప్పుడే ఇమ్ము, త్వరగా అనుభవింతుమని దత్తుని ప్రార్థింతురు. వారి ఉద్దేశ్యమేమనగా అన్ని దుష్కర్మ ఫలములను ఇప్పుడే అనుభవించినచో దత్తుడు గ్రహించి బాధపడు అవకాశము ఎప్పటికిని ఉండదు గదా అని. ఇంత నిర్మలప్రేమస్వరూపులైన సద్భక్తుల రాబోవు దుష్కర్మఫలములను కూడ వారు కోరినట్లే ఇప్పడే దత్తుడు ధ్వంసము చేయును. కాని ఎట్లు? వారి యొక్క ఇప్పటి రాబోవు జన్మల దుష్కర్మ ఫలములన్నింటిని ఇప్పుడే తాను అనుభవించి వారిని శాశ్వతముగా పాపవిముక్తులను చేయుచున్నాడు. కావున నీలో అణుమాత్రమైననూ స్వార్థము లేనిచో నీ సర్వదుష్కర్మల ఫలములను ఇప్పుడే అనుభవించి నిన్ను నిత్యవిముక్తునిగా చేయుటకు నీ సర్వదుష్కర్మఫలములకు ఆత్మను అర్పణము చేసుకొని – అనగా దానము చేసుకున్నందున దత్తుడనబడుచున్నాడు. అయితే దత్తుడు సర్వశక్తిమంతుడు గదా.
కావున సర్వదుష్కర్మఫలములను ఒక్కసారిగా అనుభవించు గల శక్తిని కలిగియున్నాడు అనుకొనుట పొరపాటు. స్వామి ధర్మదేవునితో చేసుకున్న ఒప్పందము ఏమి అనగా ‘నా భక్తుల దుష్కర్మ ఫలములను నేను సామాన్య మానవశరీరము ద్వారా నరుడెంత బాధపడునో అంత బాధను అనుభవించుచు నా దివ్యశక్తిని ఉపయోగించక నేను అనుభవించెదనని స్వామి ప్రమాణము చేసియున్నాడు. కర్మఫలమును అనుభవించియే తీరవలయును’. ‘అవశ్యమ్ అనుభోక్తవ్యం కృతం కర్మ’ అనునదే ధర్మదేవుని మూల సూత్రము – తన సేవకుడు భక్తుడు అగు ధర్మదేవుని శాససమునకు భంగము కలుగకుండా స్వామి ఇట్లు నిరంతరము శాశ్వతముగా తనను తాను బలిపశువుగా చేసుకున్నాడు. ఇదే ‘అబధ్నన్ పురుషం పశుమ్’ అను శ్రుతికి అర్థము. అనగా పురుషుడగు పరమాత్మను బలిపశువుగా బంధించిరి అని అర్థము.
కావున నీ సర్వదుష్కర్మలఫలములను ఒకేసారి ఇప్పుడే అనుభవించగల శక్తి దత్తావతార నరశరీరమునకు లేదు. కావున ఒక్కొక్కటి ఒకటి తరువాత మరియొకటిగా అనుభవించవలెను. ఇట్లు ఎందరో సద్భక్తులను విముక్తులను చేయవలయును. అందుచేతనే శ్రీ దత్తపరబ్రహ్మము నిరంతరము శాశ్వతముగా నరరూపములతో ఈ లోకముననే అవతరించి సంచరించవలసియున్నది. కావున పరోక్షముగ ఏదియును లేదనియు అంతయు ప్రత్యక్షముగా ఇచ్చటనే ఉన్నదనియు పరబ్రహ్మము జీవునిగా ఇచ్చటనే ఉన్నదని శంకరులు చెప్పినారు. ఆ జీవుడు ఎవరో కాదు. అప్పుడు అవతరించిన శంకరులే. కావుననే ‘అహం బ్రహ్మాస్మి’ అని చెప్పియున్నారు. కరిగిన సీసము త్రాగి ప్రతిజీవుడు బ్రహ్మము కాదని నిరూపించియూయున్నాడు.
కావున ‘పరిత్రాణాయ సాధూనాం’ అనగా సద్భక్తుల రక్షణము కొరకు నేను ప్రతియుగమున అవతరించుచున్నాను అని చెప్పినప్పుడు ప్రతి మనుష్యతరమున అవతరించుచున్నానని అర్థము. యుగము అనగా సంవత్సరము. చాలా ఎక్కువ సంవత్సరముల సమూహము కృతయుగము మొదలగునవి. తక్కువ సంవత్సరముల సమూహము మనుష్యతరము. ఒక్కొక్క సారి ప్రతి సంవత్సరము అవతరించుచున్నానని కూడ అర్థము చెప్పవచ్చును. ఆ మనుష్యతరమున ఎందరి సద్భక్తుల దుష్కర్మ ఫలముల ననుభవింపవలయునో బాధను ఓర్చుకొను మనుష్యశక్తి పరిమితముగా ఎన్ని మానవ శరీరములు తీసుకొనవలయునో స్వామి నిర్ణయించి అవతరించును.
ఒకే సమయమున అనేక దత్తావతారము లుండవచ్చును. ఒకే సమయమున శిరిడిసాయి, అక్కలకోట మహరాజ్ ఉన్నారు. నేను దత్తుడను అనుటయే అవివేకము. ఏలననగా తీగెలో ప్రవహించు విద్యుత్ పంఖాను త్రిప్పుచుండగా తీగె నేను విద్యుత్తును నేనే ఫ్యానును త్రిప్పుచున్నాను అనుటయే అజ్ఞానము. ఇక ఒకేసారి నాలుగు తీగెలలో ఒకే విద్యుత్తు ప్రవహించుచు ఒక తీగె ద్వారా ఫ్యానును త్రిప్పుచు, ఒక తీగె ద్వారా లైటును వెలిగించుచు, ఒక తీగె ద్వారా రెడియోను మ్రోగించుచు మరియొక తీగె ద్వారా ఉష్ణయానకమును వేడెక్కించుచూ ఉండగా, ఫ్యానుకు అమరియున్న తీగె నేను మాత్రమే విద్యుత్తుననియు మిగిలిన తీగెలు మామూలు తీగెలేననియు వాగినట్లు నేను ఒక్కడనే దత్తావతారుడను అని చెప్పు పౌండ్రక వాసుదేవుని అజ్ఞానము పరాకాష్ఠకు చెందినట్లుండును.
★ ★ ★ ★ ★