16 Feb 2025
[21-02-2003] స్వామి సమాధానము:- కాలము గడుచుచున్న కొలదీ ధర్మదేవత మరియు జ్ఞానదేవత యొక్క బలము రోజు రోజుకూ తగ్గుచున్నది. కావున జీవుల యొక్క అజ్ఞానము పెరుగుచున్నది. ఈ అజ్ఞానముతో పాటు విజ్ఞానము కూడా పెరుగుచున్నది. అజ్ఞాని అనగా పూర్తిగా తెలియని వాడు. ప్రజ్ఞాని అనగా బాగుగా తెలిసినవాడు. వెనుక కాలములో జీవులు అజ్ఞానులుగా కానీ ప్రజ్ఞానులుగా కానీ వుండెడివారు. అనగా బాగుగా తెలిసినవారు మరియు ఏమీ తెలియనివారు అను రెండు రకములుగా వుండెడివారు. ప్రజ్ఞానులు సులభముగా అర్థము చేసుకుని సాధన చక్కగా చేసెడివారు. అజ్ఞానులు తెలియని సమయము వరకు సాధన చేసెడివారు కాదు. అజ్ఞాని తెలుసుకొనిన ప్రజ్ఞానిగా మారెడివాడు. ఈ విధముగా సాధన చేయుట లేక సాధన చేయకపోవుట అను రెండు విధములుగా ఉండెడిది. కానీ కలియుగమున రాను రాను విజ్ఞానము పెరిగి జీవులు ఎక్కువగా విజ్ఞానులగుచున్నారు. అయితే, విజ్ఞానశబ్దమునకు అర్థమేమి?
విజ్ఞాన శబ్దమునకు రెండు అర్థములున్నవి. i) ‘వ్యస్తం జ్ఞానం విజ్ఞానమ్’ అనగా జ్ఞానము లేకపోవుట, అజ్ఞానము. మరియొక అర్థము ii) ‘విశేష జ్ఞానం విజ్ఞానమ్’ అనగా వృద్ధిచెందిన మంచి జ్ఞానము, అనగా ప్రజ్ఞానము. కావున విజ్ఞానము అనగా అజ్ఞానము మరియు ప్రజ్ఞానముల యొక్క మిశ్రమము. అనగా కొంత తెలియుట కొంత తెలియకపోవుట. ఇది చాలా ప్రమాదకరమైన దశ. ఇది నడకయు కాదు. నడకనాపి కూర్చునుటయూ కాదు. ఇది వ్యతిరేక దిశలో నడచుట. సరియైన దిశలో సాధన నడచుట ప్రజ్ఞానము. అసలు సాధనచేయక ఆగిపోవుట అజ్ఞానము. ప్రజ్ఞానము వలన లాభము కలదు. అజ్ఞానము వలన లాభమూ లేదు అలా అని నష్టమూ లేదు. విజ్ఞానము వలన నష్టమున్నది, మరియు విజ్ఞానికి బోధించుట చాలా కష్టము. ‘తెలిసీ తెలియని నరుదెల్ప బ్రహ్మదేవుని వశమే’ అన్నారు. దీనినే భర్తృహరి ‘జ్ఞానలవ దుర్విదగ్ధం బ్రహ్మాపి నరం న రఞ్జయతి’ అన్నాడు. ఇట్టి జీవుడు ‘చాదస్తపు మొగుడు చెపితే వినడు గిల్లితే ఏడుస్తాడు’ అన్న రీతిగా ఉంటాడు. ‘నడవమంటే నడవడు, ఎత్తుకుందామా అంటే బరువు’ అన్న మాట ఇటువంటి వారి కొరకే వచ్చినది. ఇట్టి సాధకుడు వేదశాస్త్రములను నేర్చియుండును. కానీ వాటి యొక్క సరియైన అర్థమును గ్రహించలేడు. కారణము వానికి బ్రహ్మానుభూతి లేకపోవుటయే.
పాండిత్యము వేరు, అనుభము వేరు. పాండిత్యము అహంకారముతో కూడియుండును. దానికి కారణము సరియైన అర్థము తెలియకపోవుట వలన కలిగిన అజ్ఞానమే. ఎచ్చట అజ్ఞానముండునో అచ్చట అహంకారము, అసూయలు దంపతులుగా కాపురము చేయుచుండును. ఎచ్చట జ్ఞానముండునో అచ్చట వినయముండును. కావున – కాలమునకు తగ్గట్లుగా ప్రజ్ఞానులకు, అజ్ఞానులకు బోధించుటకు స్వామి యొక్క సేవకులు అవతరించెడివారు. ఏలయనగా ఆ రెండుతెగల వారికే బోధించుట సులభము. తేలికయైన పనికి సేవకులు వచ్చుట కలదు. మామూలు దొంగలను పట్టుటకు కానిస్టేబుళ్ళు వచ్చెదరు. కానీ పెద్ద పెద్ద గజదొంగలను, రౌడీలను పట్టుటకు ఇనస్పెక్టరు దిగిరావలయును. అది కానిస్టేబుళ్ళకు సాధ్యము కాదు. అందుకే కలియుగమున దత్తుడు అవతారము లెత్తవలసివచ్చెను. ముందు చెప్పుకున్న ఈ విజ్ఞానులకు బోధించుటకు దత్తసేవకులు సమర్థులు కారు.
వీరు వేదశాస్త్రములను తప్పుదోవలను పట్టించి, పెడార్థములను తీసి అసలు అర్థమును తెలియక ఎవరైననూ సత్యార్థమును బోధించినచో వారిని తికమక ప్రశ్నలతో ఓడించి తమ మేధాశక్తికి మురిసిపోవుచూ అహంకరించి, విర్రవీగుచూ, శిష్యులను చేర్చుకుని వారిని కూడా తప్పుదోవలకు పట్టించి, ఒక అంధుని వందమంది అంధులు పట్టుకుని బావిలో పడ్డట్లు కాలార్ణవమున మునుగుచున్నారు. కొందరు సాధకులు సాధన పూర్తి చేయకయే కొన్ని అల్పసిద్ధులను పొందగనే అహంకరించి, గురువులుగా అవతారములుగా తమ్ము తామే ప్రకటించుకొనుచూ వారి ఆత్మలనే కాక అజ్ఞానులైన సామాన్యజీవులఆత్మలను కూడా అజ్ఞాన అంధకారముతో కూడిన అసూర్యలోకముల యందు పడవేయుచున్నారని ‘అసూర్యా నామ తే లోకాః’ అని శ్రుతి చెప్పుచున్నది.
ఇట్టి వారిని చక్కదిద్దుట స్వామి సేవకుల తరము కాదు, అందుకే సాక్షాత్తూ ఆ స్వామియే రావలయును. వీరి యొక్క తికమకలకు సమాధానము చెప్పగలిగిన, అన్ని తికమకలూ తెలిసిన సాక్షాత్తు దత్తాత్రేయునికి మాత్రమే సాధ్యము. గురువులను దిద్దినచో వారు తమ తమ శిష్యులను సత్యమార్గమునందు నడపగలరు. అసలు మార్గమేదో వారికే తెలియకున్నది. కావున కలియుగములో కాలము గడచు కొలదీ సాక్షాత్తు దత్తుడే జ్ఞానప్రచారములో నడుము కట్టవలసి వచ్చినది. కావున ఆయన ఇటీవలి కాలములో ప్రకాశమునకు వచ్చుట జరిగినది. కావున ఆయన యొక్క ప్రకాశమునకు కారణము దినదినమూ మానవులకు పెరుగుచున్న ‘అతితెలివితేటల’ను విజ్ఞానమే. అందుకే ఈ కలియుగమునకు ‘విజ్ఞానయుగము’ అని పేరు వచ్చినది. భగవద్గీతలో కూడా పార్థుడు వేసిన ప్రశ్నలను పరిశీలించినచో క్రమక్రమముగా అతడియొక్క అతితెలివి ప్రశ్నలలో పెరిగినది. అందుకే స్వామి తన స్వస్వరూపమైన యోగీశ్వరరూపమును ప్రకటించవలసి వచ్చినది. ఆ తరువాత పార్థుని ప్రశ్నలనినయుము అతి తెలివితేటలు లేని ‘పరిప్రశ్న’ లుగా వచ్చినవి. కావున స్వామి ప్రకాశములోకి వచ్చుటకు కారణము జీవుల యొక్క పెరుగుచున్న అతి తెలివితేటలే గానీ ఆయన తన్ను తాను ప్రకాశము చేసుకొనుటకు ఎప్పుడునూ ఇచ్చగించడు. అన్ని పనులూ తానే చేసి గుప్తముగా ఉండుటయే దత్తతత్త్వము.
★ ★ ★ ★ ★