13 Mar 2025
Updated with Part-3 on 15 Mar 2025
Part-1
[05-06-2000]
ఈ విశ్వములో మూడు ప్రధాన మతములు కలవు.
1) హిందూ మతము: ఇది బ్రహ్మస్వరూపము. జ్ఞానాత్మకము. వేదాంతశాస్త్ర విచారముతో కూడినది. బుద్ధి యొక్క ప్రతిభ ఉండును. రజోగుణము ప్రధానముగా ఉండును.
2) క్రైస్తవ మతము: ఇది విష్ణుస్వరూపము. దయా-దాక్షిణ్యము, ప్రేమ, త్యాగము మొదలగు సత్త్వగుణ సంబంధముతో ఉండును.
3) ముస్లిం మతము: ఇది రుద్రస్వరూపము. నిర్మలత్వము, నిజాయితీ, సత్యము, కపటము లేకుండుట ఉండును. ఇది తమోగుణము. కొంత ఉద్రేక స్వభావము ఎక్కువగ నుండును. మిగిలిన మతములన్నియును ఈ మూడు మతములలోని అంతర్భాగములే.
మనము మన పురాణములలో కథలలోని నీతిని గ్రహించవలెను కానీ వాటిలోని పాత్రల యొక్క ప్రవర్తనము కాదు. ఉదాహరణకు, రుద్రుడు త్రిపురాసుర సంహారమును చేసినపుడు బ్రహ్మ, విష్ణువులలో తామిద్దరిలో ఒకరు సారథిగా, మరియొకరు బాణముగా నున్నామన్న అహంకారము ప్రవేశించగా, శివుడు వారి అహంకారమును పోగొట్ట, కేవలము తన అట్టహాసముతోనే త్రిపురములను భస్మము కావించినాడు, అన్నారు. ఇందులో త్రిమూర్తులు ముగ్గురును స్వామియే కదా! మరి త్రిమూర్తులలోని ఇద్దరిలో అహంకారము ఎట్లు ప్రవేశించినది? అనగా దీనిలో నీతి: ఎవరికినీ అహంకారము పనికి రాదు, స్వామిసేవను నేను చేసితినను అహంకారమును జీవుడు కలిగియుండరాదనియే. ఈ నీతిని బోధించుటకే స్వామి త్రిమూర్తుల పాత్రలలో నటించి, ఈ నీతిని బోధించినాడు. ఇచట జీవుల అహంకార గుణమును స్వామియే స్వయముగా బ్రహ్మ, విష్ణు పాత్రలలో ప్రదర్శించినాడు. అది స్వామి సహజగుణము కాదు. ఇక, స్వామి సహజగుణము అగు, జీవుల అహంకారమును పోగొట్టు సామర్ధ్యమును, శివపాత్రలో నటించి చూపినారు. ఈ మూడు పాత్రలలోనూ నటుడు స్వామియే. అయితే శివపాత్రలో స్వామి తన సహజగుణమును ప్రదర్శించినారు.
ఇట్లే, శరభావతారమున, నరసింహస్వామి వారి ఆవేశమును అణచుట, రాముడు పరశురాముని గర్వమును అణచుట, మరొకచోట, శివుడు భక్తుడై విష్ణువును ధ్యానించుట వంటి వాటిని కూడా సమన్వయించుకొనవలెను. బ్రహ్మము అనగా అది ‘చాలా గొప్పది’ అను అర్థము కల శబ్దము. ఇద్దరు వ్యక్తులు బ్రహ్మములుగా పిలువబడినపుడు ఆ గొప్పతనమును ఇద్దరునూ పంచుకొనగా, దాని ఫలితముగా గొప్పతనము ఇరువురికినీ తగ్గుచున్నది. కాని, గొప్పతనము అనంతముగా గలది పరబ్రహ్మము మాత్రమే. కావున, అనంతమగు గొప్పతనము సార్థకమగుటకు పరబ్రహ్మము ఒక్కటే మిగులును.
త్రేతాయుగారంభమున, అత్రిమహర్షికి స్వామి దర్శనమిచ్చుటకు ముందు స్వామి స్వరూపమును ఎవరును చూడలేదు. అయితే, ఋషులు, వేదనిర్వచనము ఆధారముగా అన్ని దేవతాస్వరూపములను పరమాత్మ మూలస్వరూపము ఇది కాదు, ఇది కాదు అనిరి. ఇదే ‘నేతి నేతీ త్యాచక్షతే తద్విదః’ అను శ్రుతికి అర్థము. ‘తద్విదః’ అనగా బ్రహ్మమును తెలిసినవారు అని అర్థము. ఇట్లు అన్ని రూపములను కాదని, చివరకు తపస్సు చేసి, వారు పరమాత్మను దర్శించినారు.
Part-2
శంకరాచార్యులు అవతరించినపుడు ఉన్న బౌద్ధులు నాస్తికులై “అంతా శూన్యము” అని అనుచుండిరి. అట్టివారి చేత ‘అస్తి’ అనగా భగవంతుడు ఉన్నాడు అని అనిపించుటయే చాలా కష్టమై యుండెను. వారు ఒక్కసారిగా సాకారమును అంగీకరించరు. నిరాకారతత్త్వము శూన్యమునకు దగ్గరగా ఉండును. కావున శంకరులు నిరాకారమైన బ్రహ్మమును ‘అస్తి’ (ఉన్నది) అని బౌద్ధుల చేత అంగీకరింపచేసినారు. అయితే, ‘శూన్యమును గ్రహించు చైతన్యము ఉండవలెను గదా. అది లేనిచో శూన్యమున్నదనియే తెలియకపోవును. కావున నిరాకారమైన బ్రహ్మమును గ్రహించు చైతన్యము ఉండవలెను’ అని శంకరులు తరువాత అన్నారు. ‘నిరాకార బ్రహ్మము’ అన్న శబ్దమునకు ‘పరమాత్మ యొక్క మనస్సు’ అని శంకరులు అర్థమును చెప్పిరి. మనస్సే చైతన్యము. ‘తదైక్షత ఇమాన్’ అను శ్రుతి ప్రకారము, స్వామి యొక్క మనస్సే జగత్సృష్టి సంకల్పమును చేసి, జగత్తుగా తానే మారి, మరల జగత్తును తనలో లయింపచేయుచున్నది. ఈ మనస్సు కూడ చాల గొప్పది కావున దీనిని బ్రహ్మమన్నారు. సంకల్పము (wish) చేసినది కావున ఇది కుమ్మరి వలె నిమిత్త కారణము (intelligent cause), తానే జగత్తుగా పరిణమించినది కావున ఇదే మట్టివలె ఉపాదాన కారణము (material cause). కుండయే జగత్తు. ఇట్టి చైతన్యమునే అభిన్న నిమిత్తోపాదన కారణము అని అన్నారు.
అయితే ఈ మనస్సు (చైతన్యము) నకు ఆశ్రయమగు వ్యక్తి లోకములో కనిపించుచున్నాడు. వ్యక్తిలేని మనస్సు విడిగా లోకములో కనిపించుటలేదు. కావున ఇట్టి చైతన్యాధారమైన స్వామి యున్నారని శంకరులకు తెలియును. అందువల్లనే వారు, సాకారముపై అనేక స్తోత్రములను రచించినారు. అయితే బౌద్ధులను ఒక్కసారిగా శ్రీరంగమునకో, వారణాసికో కొనిపోయి ఇదిగో స్వామియని మూర్తిని చూపించినచో వారు అంగీకరించరు. ఒక మదించిన ఎద్దును నిగ్రహించవలసినపుడు, ఆ ఎద్దును పట్టుకొని, 4-5 అడుగులు దానితో కలసివేసి, 6వ లేక 7వ అడుగులో దానిని నిగ్రహించవలెను. అట్లే బౌద్ధులను నిగ్రహించవలసినపుడు వారి వాదములతో కొంతవరకు ఏకీభవించి, తరువాత క్రమముగా ఆస్తికత్వమును అంగీకరింపచేయవలెను. అందువలన, శంకరులు బౌద్ధులవలె జగత్తును శూన్యమే అన్నట్లు కనిపించినారు. నిజముగా జగత్తును ‘మిథ్య’ అన్నారు. మిథ్య అనగా సత్యాసత్య విలక్షణము. ఉన్నది అనలేము, లేదు అనలేము. దీనిని అనూహ్యముగా (unimaginable) అద్వైతులు భావించినారు కాని ఇది సరి కాదు.
ఒక చీమ ఇంటిలో ఉన్నది. అది అత్యల్పము కావున ఉన్ననూ లేనిదానిగా పరిగణించవచ్చును. ‘మీ ఇంటిలో నేను, చీమ-మేమిరువురము ఉన్నాము’ అని ఎవరూ చెప్పరు. ‘పాదోఽస్య విశ్వా’ అను శ్రుతి ప్రకారముగా ‘పాదః’ అనగా కిరణము. సూర్యుని కోటి కిరణములలో ఒక కిరణము మాత్రమే ఈ జగత్తు. స్వామి ముందు ఈ జగత్తు తన సంకల్ప స్వరూపమే తప్ప మరొకటి కాదు. ‘నేను నల్లగా ఉన్నాను’ అని ఒకడు తలచిన మాత్రమున, ఎర్రగ నున్నవాడు నల్లగా మారునా? కావున విశిష్టాద్వైతులు చేయు ఆక్షేపణము సరి గాదు. జీవుడే బ్రహ్మమైతే జగత్తు యొక్క దోషములు బ్రహ్మమునకు సంక్రమించును. కావున బ్రహ్మము జగత్తుగా మారుట ఎట్లు అని భావించి, ద్వైతులు, మట్టి వేరు, కుమ్మరి వేరు అన్నారు. ఇది సరి కాదు. బ్రహ్మము అనగా స్వామి యొక్క మనస్సే. ఆ మనస్సు యొక్క భావరూపమే ఈ జగత్తు (universe). భావముల చేత నిరాకార బ్రహ్మమనబడు మనస్సే వికారమును చెందదు. ఇక దానికి ఆధారమైన స్వామి వికారము చెందునా? ఒక స్థితప్రజ్ఞుడగు వాడు తన ఊహలచేత తన మనస్సును వికారము చెందకుండ ఉంచుకొనగలడు. అట్టి వానిని ఇచట ఉదాహరణముగా తీసుకొనవలెను. మనో వికారమును చెందు సామాన్య మానవుని ఇచట ఉదాహరణముగా తీసుకొనరాదు. ఈ మనస్సును బౌద్ధులలో దిఙ్నాగుడు ‘ప్రజ్ఞా’వాదమును పేరుతో అంగీకరించినాడు.
Part-3
చీమయగు జగత్తు ఉన్నది అన్నారు రామానుజ, మధ్వులు. ఉన్నా లేనట్లుగా పరిగణించవచ్చునన్నారు శంకరులు. కావున ఆచార్యులు పలికినది ఒక్కటే. శిష్యులే భేదములకు గురియైనారు. ఆచార్యులు వజ్రములు. శిష్యులు బొగ్గులు. వజ్రము-బొగ్గు ఒకే కార్బనమూలక పదార్థమని నవీన విజ్ఞానమతము. నిర్మాణ భేదము చేత వజ్రము–బొగ్గుగా కనిపించుచున్నది. అట్లే సంస్కార భేదము (బుద్ధి భేదము) చేత ఆచార్యులు, శిష్యులు వేరు వేరుగా ఉందురు.
బౌద్ధులు ఆనాడు అసలు నాస్తి అని ఉన్నారు. వారికి జగత్తు అంతా శూన్యము. బ్రహ్మమూ శూన్యమే. శంకరులు నా అవతారము గురుస్వరూపము. వారిని దిద్దుట లక్ష్యము కాని ఖండించుట లక్ష్యము కాదు. సోదరులలో ఒకడు మరియొకని ఖండించును. కానీ తండ్రి అట్లు కాదు. కుమారులను దిద్దును. మిథ్యయగు ఈ జగత్తు దాదాపు లేనిది. ఇక దీనిలో జీవుడు ఒక అణువు. అట్టి అణువైన ప్రపంచములో జీవుడు ఇంకా చిన్నఅణువు కావున పూర్తిగా లేనట్లే. ఉన్నది చైతన్యమగు బ్రహ్మమే కాబట్టి ‘జీవో బ్రహ్మైవ’ అని అన్నారు. అనగా జీవుడు అను శబ్దమునకు అర్థము బ్రహ్మమే. జీవించుచు జీవింపచేయువాడు జీవుడని అర్థము (జీవతి-జీవయతి). బ్రహ్మమే స్వయముగ జీవించుచు జీవుడనబడు ఈ పరాప్రకృతినీ జీవింప చేయుచున్నది. జీవుడు ఈ దేహమును స్వయముగా జీవింపచేయుట లేదు.
సూర్యతేజస్సు, మణి ద్వారా పత్తిని తగులపెట్టినపుడు అక్కడ మణి పత్తి యొక్క దాహకము కాదు. సూర్యుడే దాహకుడు. ప్రత్యక్షవాదులకు ఈ లోకములో కనపడుచున్న చైతన్యమును ప్రాణులలో కనపడునది చూపి ఇదే బ్రహ్మమన్నారు శంకరులు. దీనినే ‘ఉపమాన ప్రమాణ’మంటారు. అరణ్యములోనున్న గవయమృగమును చూడలేని వానికి గోవును చూపించి ‘ఇదే గవయ మృగము’ అంటారు. ఇదే ఉపమాన ప్రమాణము. అయితే బ్రహ్మము అప్రత్యక్షమా? కాదు, కాదు. ‘ప్రత్యాగాత్మన మైక్షత్’, ‘అపరోక్షాత్’ అను శ్రుతుల ద్వారా బ్రహ్మము ప్రత్యక్షమగును అని తెలియుచున్నది. అయితే, తపస్సు ద్వారా కాని బ్రహ్మము ప్రత్యక్షము కాదు. ‘తపసా బ్రహ్మ’, ‘యమేవైష వృణుతే’ అని గదా శ్రుతి. నాస్తికులగు బౌద్ధులు తపమును చేతురా? కావున వారికి ప్రత్యక్షముగ కనిపించు జీవ చైతన్యమును చూపి ఇదే బ్రహ్మమన్నారు.
శంకరులు శంకరావతారము అనగా అది నేనే. శంకరులు బౌద్ధులను ఖండించి స్వమతస్థాపనకు రాలేదు. తండ్రి బిడ్డలను ఖండించునా? ఆయన బౌద్ధులను దిద్ది మార్గములో పెట్టు గురుస్వరూపము. గురువు మార్గమును నిర్దేశించును. లక్ష్యమును బోధించును. కాశీ నగరము గురించి చెప్పి, కాశీకి ఈ మార్గమున పోవలయునని చెప్పువాడే గురువు. లక్ష్య, మార్గములు సరిగానున్నచో, మెల్లగ నడచిపోవువాడును లక్ష్యమును చేరును. శక్తిమంతుడై పరుగెత్తువాడును లక్ష్య మార్గములు సరిగాలేనిచో దుర్గతిని పొందును. కావున గురుస్వరూపమే అత్యంత ప్రధానమైనది.
గోవును చూపి గవయము అన్నపుడు రెండిటిలో ఏదో ఒక్క సమాన లక్షణము ఉండవలెను. భిన్నలక్షణములు అనేకములుండును. మానవుని (జీవుని) చూపి బ్రహ్మమన్నపుడు కొన్ని సమాన లక్షణము లుండును. అందుకే, శంకరులు మానవులలో గల చైతన్యమును మాత్రమే సమాన లక్షణముగా చూపినారు. ఏలనన, బౌద్ధులు నాస్తికులు. నిరాకార శూన్యవాద ప్రియులు. వారికి నిరాకారమునే చూపవలయును. సాకారమన్న వారు దూరముగ పోవుదురు. సృష్టి సంకల్పమును చేయు బ్రహ్మములోను, లౌకిక సంకల్పములను చేయుచున్న జీవ చైతన్యమునకును ‘సంకల్పక్రియ’ అను సామ్యలక్షణమును ఆధారముగ చేసుకొని జీవచైతన్యమే బ్రహ్మమన్నారు. చైతన్యాధారమగు వ్యక్తిని చూపి బ్రహ్మమిట్లే ఉండునన్నారు రామానుజులు. బ్రహ్మమునకు ఇట్లు సేవ చేయవలయునన్నారు మధ్వులు. మధ్వుడు బ్రహ్మ. రామానుజుడు విష్ణువు. ఆ ముగ్గురును నేనే.
కేవల సంకల్పక్రియ సామ్యముగా నున్నను బ్రహ్మమునకు మరియు జీవునకు విభిన్న లక్షణమువలెన్నో కలవు. అవి సాక్షాత్తు పరమాత్మ దర్శనము (జ్ఞానము) చేతకాని గోచరించవు. గోవుకు ఉండు భిన్నలక్షణములును గవయమృగ దర్శనము చేతనే లభించును. కావున అనేకములైన భిన్నలక్షణములను బోధించుట అనవసరమని శంకరులు కేవలము జీవ-ఈశ్వర సామ్యలక్షణమునే ప్రతిపాదించినారు.
★ ★ ★ ★ ★