మహా సిద్ధిని స్తుతించు కీర్తన
ఏమున్నదే చెలీ! ఏమున్నదే
అష్ట సిద్ధులనిల దర్శించగా |
ప్రభు సృష్టియే యీ విశ్వమంతా
మహా సిద్ధియె ఇది చూడవేలా || (పల్లవి)
1. అదిగో చూడు సూర్యగోళము - తేజోమయము చాలా పెద్దది |
దాని ముందర చిన్న వస్తువు - సృష్టించుటయు ఆశ్చర్యమా ||
2. ఆద్యంతమును లేని విశ్వము - చూచిన చాలు స్వామి గొప్పను |
ఊహించుటకు మహాసిద్ధియె - దాని ముందర సిద్ధులు ఎంత ||
3. పామరులకే అష్టసిద్ధుల - ప్రదర్శనంబు చేయుచుందును |
అస్తిత్వమున విశ్వాసమును - కలిగించుటకె నీకేలనవి? ||
4. బ్రహ్మతేజమును విష్ణు చక్రమును - శివలింగమును చూపి యుంటిని |
పసి పాపలకె ఆ వింతలుగ - నీ కేలనే? పాలబొప్పివె? ||
5. ఙ్ఞానమార్గము నందున నడచి - అందుకోవె అందని ఫలము |
భక్తి రస సుధ మధురంబదియే - నా తత్త్వమని తెలియుము అనఘా ||