సహ్యాద్రి వాసిని నేను
సాక్షాత్తు దత్తుడు నేను |
సాధన మార్గము గురువుగ చెప్పెద
స్వామిగ నమ్మిన నడిపిస్తాను || (పల్లవి)
1. ఙ్ఞానమె నా సహజ సత్య స్వరూపం - ప్రేమయే నా సహజ సత్య సౌందర్యం |
ఈ రెండె నను బట్టగా గుర్తులిచ్చట - నా అలంకారాలె ఈ అష్ట సిద్ధులు ||
2. దైత్యపుత్రులు గూడ మొండి తపములుఁజేసి - నానుండి పొందుదురు అష్టసిద్ధుల నిచట
అవె గుర్తులని తల్చు వారలఙ్ఞానులే - వాటిచే కోర్కెలను తీర్చుకొను లుబ్ధులే ||
3. నను నాస్తి యనువాడు నరకేమేగేను - నిరాకారమర్చింప దుఃఖమును పొందు |
సాకారమర్చించి సంతృప్తి చెందు - నరాకారు నర్చింప ఆనంద సిద్ధి ||
4. పెనుమాయ నన్నెపుడు ఆవరిచియెయుండు-పెను పరీక్షల బెట్టు నెట్టు జీవులనెపుడు |
కోటానుకోట్లలో ఏ ఒక్క జీవియో - మొండిగా ననుబట్టి బ్రహ్మత్వమును బొందు ||
5. వాక్కాయమనములను పరువు ధర్మముల - నా కొరకు త్యాగంబు చేయ సంన్యాసి |
కాషాయ వస్త్రములు చందాలు కీర్తి - పెద్ద సంసారములు హేమ పాశములు ||
6. ఆధ్యాత్మ మార్గమును బోధించలేరెవరు - యోగి రాజును నేను బోధించినట్లుగా |
సర్వార్పణ త్యాగ కర్మ సేవయు లేక - ఙ్ఞాన భావము భక్తి వాక్కులును వంచనలె ||