అత్రిజం శంకరం బ్రహ్మనారాయణం |
సర్వదేవాత్మకం దత్తదేవం గురుమ్ || (పల్లవి)
అత్రి పుత్రుడై ఆత్రేయునిగా పిలువబడేటటువంటి, బ్రహ్మ-విష్ణు-మహేశ్వరుల మూల స్వరూపమైనటువంటి, మానవులు పూజించే సమస్త దేవతా స్వరూపములకే మూల స్వరూపమైనటువంటి, సత్యమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించే సద్గురువు అయినటువంటి పరబ్రహ్మ స్వరూపమైన శ్రీదత్తభగవానుని శిరసా నమస్కరిస్తున్నాను.
1. ఇందిరా మందిరం పార్వతీ నాయకం - భారతీ వల్లభం ధర్మధేన్వాశ్రయమ్ |
శంఖ చక్రాన్వితం శూల ఢక్కాధరం - పాత్రమాలాకరం ప్రాణనాధం భజే ||
త్రిజగన్మాతలైన శ్రీమహాలక్ష్మి, పార్వతీదేవి, శ్రీసరస్వతులకు భర్తయైనటువంటి, అందరినీ రక్షించే ధర్మదేవతయే గోరూపమును ధరించి తనను ఆశ్రయించినటువంటి, ఆరు చేతులలో దివ్యాయుధములైన శంఖము, చక్రము, త్రిశూలము, ఢమరుకము, కమండలపాత్ర మరియు జపమాలను ధరించినటువంటి, నా ప్రాణనాథుడైనటువంటి శ్రీ దత్తస్వామిని ప్రార్థిస్తున్నాను.
2. పావనై రాగమై స్సారమేయాయితైః - పాదపద్మావృతై ర్మంత్ర మంద్రస్వరైః |
సంచలధ్భిశ్చనైః సంచలతం ప్రభుం - త్ర్యాననం షట్కరం యోగిరాజం భజే ||
పరమ పవిత్రమైన వేదములు శునకరూపములను ధరించి తన పాదపద్మముల దగ్గర ఆశ్రయము పొందినటువంటి, ఉద్వేగము లేకుండా తక్కువ స్వరములో వేద మంత్రములను పెదవులపై ఉచ్చరిస్తూ నెమ్మదిగా భూమిపై సంచరించేటటువంటి, ముల్లోకములకు విభుడైనటువంటి, మూడు ముఖములు ఆరు భుజములతో ప్రకాశిస్తూ యోగులకే రాజైనటువంటి శ్రీ దత్తస్వామిని ప్రార్థిస్తున్నాను.
3. కేవలం నిర్గుణం మూర్తిభూతం జగత్ - సృష్టి రక్ష్యాలయా ధారహేతోస్త్రిధా |
అత్రిణా ప్రార్ధితం యుక్తమూర్తి త్రయం - ద్రుష్టమేకం పున స్తం త్రిమూర్త్యాననమ్ ||
పరబ్రహ్మమునకు ఎట్టి గుణములు ఉండవు – అది కేవలము నిర్గుణము. అయినా, పదార్థరూపంగా ఏర్పడిన ఈ సమస్త జడ ప్రపంచమునకు యథార్థసత్యాన్ని కల్పించి, ఆ పరబ్రహ్మము తను కూడ త్రిగుణ స్వరూపుడై (దత్తుడై), జగత్తు యొక్క సృష్టి, స్థితి మరియు విలయములకు ఆధారమైన త్రిమూర్తులుగా కనపడిననూ, అత్రి మహర్షి ప్రార్థించడం చేత మరల మూడు ముఖములతో కూడి దత్తాత్రేయునిగా దర్శనమిచ్చిన శ్రీ దత్తస్వామిని ప్రార్థిస్తున్నాను.
4. మాతృ భావానసూయాకృతే గర్భజం - దృష్ట బాల త్రయం యుక్త మేకం సకృత్ |
బ్రహ్మచర్య వ్రతం దండ పాణిం వటుం - తాపసైః ప్రస్ధితం వృద్ధ శిష్యైర్భజే ||
గర్భము ధరించి బిడ్డను కనడం ద్వారా మాతృత్వాన్ని అనుగ్రహించమని ప్రార్థించిన అనసూయామాతకు ఆవిడ కడుపున పుట్టి దత్తాత్రేయుడైనటువంటి, త్రిమూర్తులకే తల్లియై పోషించిన అనసూయామాతను తన తల్లిగా పొందినటువంటి, ఎల్లపుడూ బ్రహ్మచర్యవ్రతమనే బ్రహ్మజ్ఞానమందు సంచరించేటటువంటి, చేతిలో ఏకదండమును ధరించినటువంటి, వటువు (కుర్రవాడు) అయినటువంటి, తపస్సులో నిత్యమూ నిమగ్నులైనటువంటి వృద్ధులైన శిష్యులు తనను అనుసరించి వస్తున్నటువంటి శ్రీ దత్తస్వామిని ప్రార్థిస్తున్నాను.
5. హంసవాహం క్వచిత్ పక్షిరాడ్వాహనం - నందిన వా క్వచిత్ సంచరంతం విభుమ్ |
నాస్తికానాం మతం నాశయంతం సదా - పండితా ఖండలం స్తౌమి యోగీశ్వరమ్ ||
ఒకసారి హంస వాహనంపై, మరొకసారి గరుడవాహనంపై, ఇంకొకసారి నంది వాహనంపై విహరించే విభుడైనటువంటి, వివిధములైన దత్తావతారముల ద్వారా భూమిపై అవతరించి భగవంతుడు లేడు అనే నాస్తికుల మతములను తన అద్భుతమైన మహిమల ద్వారా సదా నాశనం చేసేటటువంటి, పండితలోకంలో ఇంద్రునివలె జ్ఞాన ప్రకాశంతో వెలుగొందుతున్నటువంటి, యోగులకే రాజైనటువంటి శ్రీ దత్తస్వామిని ప్రార్థిస్తున్నాను.