భజ భజ భాస్కరకుల సంజాతం
రామం శార్ఙ్గ ధనుర్ధర మేతమ్ (పల్లవి)
ఓ భక్తా! సూర్యవంశములో పుట్టిన, దివ్యమైన శార్ఙ్గమనే కోదండాన్ని చేతిలో ధరించిన, భగవంతుడైన శ్రీరాముడిని పదే పదే ప్రార్థించు.
నిష్కామ భక్తి తపసాక్రీతం | జ్ఞానాగ్ని వచన తేజశ్శాతమ్ |
ధర్మస్ధాపనలోక విభాతం | సాక్షాన్నారాయణ మాయాతమ్ ||
తపస్సుతో కూడిన నిస్స్వార్థమైన భక్తితోనే ఆయన పొందబడతాడు. దివ్యమైన తేజస్సుతో వెలిగిపోయే ఆయన పలికిన సత్య జ్ఞాన వచనములు అగ్నితో కూడిన బాణముల వంటివి. అద్భుతమైన ప్రాతఃసంధ్యవంటి ప్రకాశంతో వెలిగిపోయే ఆయన చేత లోకంలో ధర్మము వ్యవస్థాపించబడుతుంది. శ్రీమన్నారాయణుడే శ్రీరాముని రూపంలో అవతరించాడు.
వాల్మీకి సుకవి కవితాగీతం | స్వాదర్శ కధా గంగాపూతమ్ |
హనుమద్భుజ పీఠాసననీతం | కేవలసాయక దశముఖ పాతమ్ ||
ఆదికవియైన వాల్మీకి శ్రీరాముని ఎంత ఘనంగా స్తుతించాడంటే, శ్రీరాముని చరితము పవిత్రమైన గంగానదిని కూడ మరింత పవిత్రంగా మారుస్తుందట. మహా యోధుడైన శ్రీరాముడు హనుమంతుని భుజాలను అధిరోహించి పదితలల రావణుని ఒక్క బాణంతో వధించాడు.
పట్టభిషేక సుర సమవేతం | వామాంకాసన సీతాప్రీతమ్ |
స్వచరిత గాయక కుశలవతాతం | సకల చరాచర సూత్ర ప్రోతమ్ ||
పట్టాభిషేక సమయంలో చుట్టూ దేవతలందరూ కూడి ఉండగా, బంగారు సింహాసనమును శ్రీరాముడు అధిరోహించాడు. తనకై అన్నీ త్యజించిన సీతామాతను, ఎడమ ఊరువుపై కూర్చోపెట్టుకుని చాలా సంతోషించాడు. రామకథా గానం చేసిన కుశ, లవులనే బాలకులకు తండ్రియైన శ్రీరామచంద్రమూర్తియే బ్రహ్మాండములోని సమస్త సృష్టులను కలిపే అంతఃసూత్రము.