home
Shri Datta Swami

Jump to Bhakti Ganga contents in — English  Telugu  Hindi

కొండక్కవె అనఘ కొండెక్కవె


కొండక్కవె అనఘ కొండెక్కవె
నీ పక్కనే  ఉండి ఎక్కింతునే | (పల్లవి)

1. ఏడవ కొండను ఎక్కినచో - నీవూ నేనే మిగులుదుము |
సర్వ బంధములు తెగిపోవగ - భగవద్భంధమె మిగులునుగా ||

2. మొదటి కొండయదె తల్లి పాశము - మూలాధారం పృధివీ తత్త్వం |
జననీ స్థానం మాయా గర్భం - చక్రం బంధం - పరిభ్రమన్తం |
అతిక్రమించుము వక్ర గమనా ! ||

3. రెండవ కొండయె తండ్రిపాశము - మణిపూరాఖ్యం  చాంభస్తత్త్వం |
జనక స్థానం మాయా స్నేహం - చక్రం బంధం - పరిభ్రమన్తం |
అతిక్రమించుము వక్ర గమనా ! ||

4. మూడవ కొండయె వైవాహికంబు - స్వాధిష్టానం వహ్నేస్తత్త్వం |
కామస్థానం పరిభ్రమన్తం - చక్రం బంధం మాయా చేష్టం |
అతిక్రమించుము వక్ర గమనా ! ||

5. నాల్గవ కొండయె సంతాన ప్రేమ - అనాహతాఖ్యం వాయోస్తత్త్వం |
పుత్ర స్థానం పరిభ్రమన్తం - చక్రం బంధం మాయాలీలం |
అతిక్రమించుము వక్ర గమనా ! ||

6. ఐదవ కొండయె నరగురు సేవలు - విశుద్ధముక్తం గగనం తత్త్వం |
నరగురు భూమిం పరిభ్రమన్తం - చక్రం బంధం మాయా బోధం |
అతిక్రమించుము వక్ర గమనా ! ||

7. ఆరవ కొండయె సురలు వేషములు - ఆఙ్ఞాఖ్యాతం మానస తత్త్వం |
చక్రం బంధం మాయారూపం - దేవస్ధానం పరిభ్రమన్తం |
అతిక్రమించుము వక్ర గమనా ! ||

8. మాయాబంధముల మాయచేతనే - దాట కుండలిని వంకరగతియదె |
కుండలినియన్న  చైతన్య శక్తి - జీవతత్త్వమె నడకయె సర్పము ||

9. సహస్రారమె బుద్ధి స్ధానము - సహస్ర  దళములె  ఙ్ఞాన జ్యోతులు |
ఏడవ కొండన అదియె అనఘా - పూర్ణ పద్మమదె నీ పూర్ణ పదము ||

10. నీనా బంధము ఒక్కటియె మిగులు - చక్రాల దాట అఘమే కాదది |
అనఘా ! కొండల నారింటినెక్క - ఆరు చక్రముల దాటుట సారము ||

11. మధుర భక్తిచే మధుమతియగుదువు - తీవ్రాకర్షణ జలపాతమదే |
నా అనుగ్రహము కల్గిన గానీ - మధుమతి భావము పుట్టదు జీవికి ||

12. యోగ శాస్త్రమున చక్రములనగా - ఆరుకొండలన అంతరార్ధమిదె |
యోగి రాజుకే తెలియును యోగము - పిచ్చి గురువులే బొమ్మలనమ్మిరి ||

13. మాయ ప్రేమలివి స్వార్ధ లక్ష్యములు - తమ సుఖములకే నిను ప్రేమింతురు |
సంసార వార్ధి సుడిగుండములివి - ఈదువానినే ఆకర్షించును ||

14. పరిభ్రమింపగ చేయును చిక్కగ - వినోద సుఖమును కలిగించు కొంత |
ముంచి వేయునే తుదకు దుఃఖమే - మృత్యువుపాలై పోదురు జీవులు ||

15. సారము తెలియని పండిత మూఢులు - చక్రములనగా పద్మములందురు |
దళముల బీజాక్షరముల వ్రాయుచు - పిచ్చి బొమ్మలను ఊహించుతురచట ||

16. పంచభూతములు మనస్సు కలిసి - ఈయారు సృష్టి చక్రములివియే |
పాంచభౌతికము మానసబంధము - భ్రమ కారణమగు భ్రమించు చక్రము ||

17. పంచభూతముల జగత్తునందే - మనో బంధమే ఆరు చక్రములు |
మాయ ప్రేమతో సంతృప్తి పరచి - మనస్సునంటక ప్రవర్తించుటే
కుండలిని వక్ర గమనమందురే ||

18. కన్నులు మూయుచు చక్రాలలోన ఉన్న రీతిగా ఊహించి శిశివు |
వాటిని దాటగ యత్నించునహహ! ఏమందునే ఈ వెర్రి చేష్టలను - పిచ్చి
గురువులే ! పిచ్చి శిష్యులే ! ||

19. యోగిరాజునే దత్తాత్రేయుని - శరణము జొచ్చుము వివరించునతడు |
నరగురువు వేరు నారాయణుడగు - సద్గురువు వేరు వదలక పట్టుము ||

20. చిక్కడు దొరకడు టక్కరి దొంగయు - దత్తాత్రేయుడు మాయావేషుడు |
గుర్తించి పట్ట విదిలించు నతడు - జారిపోవునే బ్రహ్మర్షులకును ||

21. సామన్యునువలె నుండును చిక్కడు - చిక్కించుకున్న అధముని వలెనగు |
అధమాధముడై నటించు చేష్టల - పట్టు సడలగా పరుగెత్తి పోవు ||

22. స్ధిర విశ్వాసము చెదరని భక్తికి - లొంగి పోవునె శ్రీ దత్త గురువు |
బోధించునతడు సర్వ రహస్యము - యోగ్యతనుండిన పరీక్షించియే ||

23. యోగ శాస్త్రమన భగవద్యోగము - సంసారబంధ విచ్ఛేదంబే |
చక్రాలదాటి పోవుటయనగా - సహస్రారమె భగవత్సన్నిధి ||

24. ఈ రహస్యమును నీకు చెప్పితిని - నా ప్రియసతియగు అనఘవు కావున |
సురలును మునులును ఈ సారమునిటు - తెలియక నుంటిరి అనఘ ధన్యవే||

 
 whatsnewContactSearch