తప్తాస్స్మః మాతః! తప్తాస్స్మః మధుసూదన సతి, మంగళవతి! (పల్లవి)
శుష్కించిపోయి ఉన్నాము తల్లీ, మేము దరిద్రం ప్రాప్తించిన కారణంగా శుష్కించిపోయి ఉన్నాము,
మధువనే పేరుగల రాక్షసుని సంహరించిన మధుసూదనుని ప్రియ భార్యవైన ఓ రుక్మిణి మాతా! మాకు సమస్త శుభాలను కలిగించే తల్లీ!
{ఎవరికైతే సమస్త ఐశ్వర్యాలను అనుగ్రహించే శ్రీలక్ష్మీ మాత అనుగ్రహం వలన పుష్కలంగా ధన, ధాన్యాదాలు ఉన్నవో వారు ఈ పల్లవిని వేరే విధంగా పాడాలి. డబ్బు పుష్కలంగా ఉన్నపుడు మనకు సమస్యలు, మానసిక వ్యాకులత వంటివి వద్దన్నా వస్తాయి. సమస్యలను తెచ్చే అధిక ధనమునుండి దూరంగా ఉండి, కోల్పోయిన మనశ్శాంతిని మరల పొందాలనుకున్నవారు క్రింది విధంగా పల్లవిని మార్చి పాడాలి:
తృప్తాస్స్మః మాతః! తృప్తాస్స్మః మధుసూదన సతి, మంగళవతి!
అపుడు ప్రతి చరణం చివర పల్లవిని కూడ అదే విధంగా పునరావృతం చేయాలి.}
వాత్సల్యామృత హర్ష వర్షిణి రుక్మిణి, వనమాలి మనోవాసిని!
వందే విదర్భ నందిని శ్రీ వాసుదేవానంద సుందరి ।।తప్తాస్స్మః।।
వాత్సల్యమనే అమృతమును అతి ఆనందముతో మాపై వర్షించే ఓ రుక్మిణి మాతా! వనమాలలను ధరించిన భగవంతుని హృదయమునందు శాశ్వతంగా కొలువైనదానా! వాసుదేవుడైన శ్రీకృష్ణ పరమాత్మకు ఎల్లపుడు ఆనందమును కలిగించే అత్యంత సౌందర్యవతియైన, విదర్భరాజ పుత్రికయైన నీకు నా సవినయ నమస్కారములు.
{సంసారమునకు సంబంధించిన వివిధ అవసరాలను తీర్చుకొనడం కోసం నరావతారమైన శ్రీకృష్ణుని భక్తులు ప్రార్థిస్తారు. అంటే, విష్ణువు యొక్క నరావతారమును భక్తులు ప్రార్థిస్తున్నారని అర్థము. దారిద్ర్యంనుండి బయటపడి ఐశ్వర్యాన్ని పొందుట కొరకు భక్తులు రుక్మిణీమాతను ప్రార్థించాలి. అంటే, శ్రీమహాలక్ష్మి యొక్క నరావతారమును భక్తులు ప్రార్థించాలని అర్థము. నిజానికి, తేజోవతారమైన శ్రీమహావిష్ణువు కంటె నరావతారమైన శ్రీకృష్ణుడు భక్తులకు దగ్గరగా ఉంటాడు. అలానే, తేజోవతారమైన శ్రీమహాలక్ష్మి కంటె నరావతారమైన రుక్మిణీమాత భక్తులకు దగ్గరగా ఉంటుంది. కనుక జీవులకు రుక్మిణీ-శ్రీకృష్ణులను సేవించడమే శ్రేయస్కరము.}
అస్మాకం సదనే చరతి – తవ చంచల కింకిణికా చరణే,
సంతత చింతామణి గణ – సంతాన దాయిని కా చింతా? ।।తప్తాస్స్మః।।
కదలుతూ అందమైన ధ్వనిని చేస్తున్న కాలిమువ్వలతో కూడిన చక్కటి బంగారు గజ్జెలను ధరించిన నీ పాదములు మా ఇంటిలో సంచరిస్తున్నంతవరకు, ఆ పాదములు నిరంతరమూ, అడుగు అడుగుకూ మణుగుల కొద్దీ చింతామణులను మాకు అనుగ్రహిస్తున్నంతవరకు మాకు ధన విషయంలో లోటు అని అనుకొనే అవకాశమెక్కడిది?