శ్రీ దత్తాత్రేయం నమామ్యహమ్
హంస గరుడ నంది వాహమ్ (పల్లవి)
హంసను, గరుడుని, నందిని వాహనములుగా కలిగిన త్రిమూర్తి స్వరూపమైన శ్రీదత్తాత్రేయ స్వామిని నమస్కరిస్తున్నాను.
బ్రహ్మ విష్ణు శివ మూలాధారం, వర్షిత వేదాంతామృత ధారమ్
కుంద కుశేశయ కువలయ హారమ్, క్షణకృత జంభాసుర సంహారమ్
సృష్టి, స్థితి, లయకర్తలై త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకే మూలాధారమైనటువంటి, వేదాంత జ్ఞానమునే అమృతధారలుగా కురిపించేటటువంటి, మల్లెలు, కలువలు, పద్మములతో కూడిన సుగంధభరితమైన పూలహారమును ధరించినటువంటి, ఒక్క క్షణములోనే జంభాసురుని వంటి మహా రాక్షసుని సంహరించినటువంటి శ్రీదత్తాత్రేయ స్వామిని నమస్కరిస్తున్నాను.
వేద శాస్త్ర మథనామృత సారం, దృశైవ తారిత ఘన సంసారమ్ ।
సంకల్పాకృతి మాయాజాలం, విచిత్ర లీలా వినోద కాలమ్ ।।2।।
వేదములు, శాస్త్రములు మథించగా పుట్టిన జ్ఞానమనే అమృతము యొక్క సారమైనటువంటి, కేవలం క్రీగంటి చూపుతోనే సముద్రము వంటి ఈ సంసారమును దాటించేటటువంటి, తన సంకల్ప మాత్రము చేతనే సమస్త జీవరాశులను సృష్టించేటటువంటి, ఏ అవతారములోనున్నా తన విచిత్రములైన లీలల చేత సృష్టినుండి పూర్ణ వినోదము పొందేటటువంటి శ్రీదత్తాత్రేయ స్వామిని నమస్కరిస్తున్నాను.