(Sung by Smt. Devi)
గురురాజ రాజ రాజం – స్తౌమి శ్రీదత్త మహారాజమ్ । (పల్లవి)
లోకంలో ఆధ్యాత్మికతను బోధించే గురువులు ఉంటారు. అటువంటి గురువులను మించి ఆధ్యాత్మికతను బోధించడంలో గురురాజు వంటి వారు ఉంటారు. అటువంటి గురురాజులకే గురురాజులు కూడ ఉన్నారు. అటువంటి గురురాజరాజ గణములకే అధిరాజైనటువంటి శ్రీదత్త మహారాజును ప్రార్థిస్తున్నాను.
వేదాంత విషయ జగతీ సమ్రాజమ్ ।
పాపిభ్యోపి దయా సుధార్ణవ భాజమ్ ।।1।।
వేదాంతమే ప్రధాన విషయముగాగల ఆధ్యాత్మిక ప్రపంచానికి సామ్రాట్టైన, తనను ఆరాధించే భక్తులనే కాక అనేక పాపకర్మలు చేసిన పాపులను కూడ దయయే సముద్రరూపం ధరించినదా అనిపిస్తూ, ఆ పాపులను కూడ సమభావముతో కాపాడేటటువంటి అధిరాజైన శ్రీదత్త మహారాజును ప్రార్థిస్తున్నాను.
మందార మకరంద మధుర మందహాసమ్ ।
కుందారవింద కుముద బృందాంశు భాసమ్ ।।2।।
ఎర్రని మందార పుష్పముల యొక్క మకరందము వంటి మాధుర్యముతో కూడిన చిరునవ్వులను చిందించే ఆ దత్తప్రభువును, తెల్లని మల్లెలు, ఎర్రని తామరపూవులు మరియు నీలి కలువల వర్ణముల మిశ్రమ శరీరవర్ణముతో (బ్రహ్మదత్తుడు ఎర్రని, విష్ణుదత్తుడు నీలి, శివదత్తుడు తెల్లని శరీరవర్ణముతో ప్రకాశిస్తారు) ప్రకాశించేటటువంటి అధిరాజైన శ్రీదత్త మహారాజును ప్రార్థిస్తున్నాను.
తిల కుసుమ సమాయత మనోహర నాసమ్ ।
స్కంద భార్గవ పింగళనాగాది దాసమ్ ।।3।।
అందమైన నూగుపూవు వంటి ఆకృతితో కూడిన మనోహరమైన ముక్కును కలిగినటువంటి, సుబ్రహ్మణ్యస్వామి, పరశురాముడు, పింగళనాగుడు మొదలైన అతి శ్రేష్ఠ భక్తులచే సేవింపబడేటటువంటి అధిరాజైన శ్రీదత్త మహారాజును ప్రార్థిస్తున్నాను.