యాచే శ్రీరామం, తవాఽస్మీతి, యాచే శ్రీరామమ్ (పల్లవి)
‘నేను నీవాడను’ అని ఆత్మ సమర్పణ చేసుకుంటూ, పరమ దయాళువైన, శ్రీరామచంద్ర ప్రభువుని ప్రార్థిస్తాను.
{శ్రీమద్రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి విభీషణునికి అభయం ఇచ్చే సందర్భంలో ‘సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే’ అని అంటారు.}
శ్రీరామం, రఘురామం, కళ్యాణరామం, కోదండరామం,
పట్టాభిరామం, పావనరామమ్ ॥యాచే॥
రఘువంశంలో పుట్టినటువంటి శ్రీరాముని, శుభములను కలిగించే సర్వ సద్గుణములను కలిగినటువంటి అందమైన కళ్యాణరాముని, చేతిలో కోదండమును ధరించినటువంటి, పట్టాభిషిక్తుడై అయోధ్య రాజ్య సింహాసనమును అధిష్ఠించినటువంటి, పావనులకే పరమ పావనుడైనటువంటి, పరమ దయాళువైనటువంటి, శ్రీరామచంద్ర ప్రభువుని ప్రార్థిస్తాను.
శరణం భవ, శరణం భవ, శరణం భవ శ్రీరామ,
కరుణాం కురు, కరుణాం కురు, కరుణాం కురు రఘురామ ॥యాచే॥
హే శ్రీరామచంద్రప్రభో, నీవే నాకు పరమ శరణాగతివి. ఓ రఘుకులములో జన్మించిన పరాక్రమశాలీ, నిన్ను శరణు వేడిన నాపై దయను చూపించు.
తనువిజిత కామం, హతదితిజ స్తోమం,
నవజలద శ్యామం, మైథిలీ వామమ్ ॥యాచే॥
శరీర సౌందర్యములో కూడ అతి సుందరుడైన మన్మథుని మించిన సౌందర్యమును కలిగినటువంటి, దైతేయులైన రాక్షస సమూహాలను వధించినటువంటి, కొత్తగా అప్పుడే పుట్టిన నవమేఘము యొక్క నీలవర్ణము వంటి నీలవర్ణముతో కూడిన శరీరీచ్ఛాయను కలిగినటువంటి, తన భార్యయైన సీతామాతతో కూడి ఆసీనుడైనటువంటి, పరమ దయాళువైనటువంటి, శ్రీరామచంద్ర ప్రభువుని ప్రార్థిస్తాను.
హనుమదర్చితం, భరత పూజితం,
లక్ష్మణ వందితం, శతృఘ్న సత్కృతమ్,
సీతా సేవితమ్ ॥యాచే॥
నిరంతరమూ సేవకుడిగానున్న ఆంజనేయునిచే సేవింపబడినటువంటి, తమ్ముడైన భరతునిచే పూజింపబడినటువంటి, ప్రియమైన లక్ష్మణునిచే నమస్కరింపబడినటువంటి, మరియొక తమ్ముడైన శత్రుఘ్నునిచే గౌరవింపబడినటువంటి, తల్లియైన సీతామాతచే సేవింపబడినటువంటి పరమ దయాళువైనటువంటి, శ్రీరామచంద్ర ప్రభువుని ప్రార్థిస్తాను.
దశరథాత్మజం, విపులాక్షి వారిజమ్,
ఏకశిలీముఖ హత దశముఖ భాజమ్ ॥యాచే॥
దశరథ మహారాజు ప్రియ పుత్రుడైనటువంటి, పెద్ద పెద్ద తామరపూల వంటి కన్నులతో శోభిస్తున్నటువంటి, ఒకే ఒక్క బాణంతో పదితలల రావణుని అంతమొందించినటువంటి, పరమ దయాళువైనటువంటి, శ్రీరామచంద్ర ప్రభువుని ప్రార్థిస్తాను.
అంసారోపిత దివ్య శార్ఙ్గ కోదండమ్,
ఆత్మనా వ్యాప్త చరాచర జగదండమ్ ॥యాచే॥
శార్ఙ్గమనే పేరుగల కోదండమును తన అత్యంత బలమైన భుజములపై ధరించినటువంటి, ఒక పెద్ద అండము వంటి సమస్త చరాచర జగత్తులో తన సంకల్పశక్తితో వ్యాపించియున్నటువంటి, పరమ దయాళువైనటువంటి, శ్రీరామచంద్ర ప్రభువుని ప్రార్థిస్తాను.
గౌతమ సతీ శిలా శాప విమోచనమ్,
శాంత విలోకనాంత కరుణామృత సేచనమ్ ॥యాచే॥
శాపకారణం చేత రాయిగా మారిన, గౌతమ మహర్షి భార్యయైన అహల్యకు శాపవిమోచనం గావించినటువంటి, తన అత్యంత ప్రసన్నమైన క్రీగంటి చూపులతో, కరుణ అనే అమృతమును భక్తులయందు కురిపిస్తున్నటువంటి, పరమ దయాళువైనటువంటి, శ్రీరామచంద్ర ప్రభువుని ప్రార్థిస్తాను.
బాల శరదంభో ధరాంశు రోచనమ్,
స్ఫురత్తరుణ మీనాయత విలోచనమ్ ॥యాచే॥
అత్యంత ఆహ్లాదకరమైన శరత్కాలంలో పుట్టిన కొత్త మేఘము వంటి అద్భుతమైన తేజస్సును కలిగిన, మెరిసే మదించిన చేపవంటి విశాలమైన కన్నులు కలిగినటువంటి పరమ దయాళువైనటువంటి, శ్రీరామచంద్ర ప్రభువుని ప్రార్థిస్తాను.