నమో నమో బ్రహ్మాస్త్రాయ – సర్వశోక వినాశకాయ ।
సాంధ్య దీధితి భామయాయ – వేద శాస్త్ర ప్రజ్వలనాయ ।।నమో నమో।।
సమస్తములైన ప్రాపంచిక దుఃఖములను నిర్మూలనం చేసేటటువంటి, ఎర్రని సంధ్యా కిరణకాంతులతో అతి గొప్పగా ప్రకాశించేటటువంటి, వైదిక సూక్తముల శక్తితో ధగద్ధగాయమానంగా ప్రకాశించేటటువంటి, బ్రహ్మదత్తుని ఆయుధమైన బ్రహ్మాస్త్రమునకు మరల మరల నమస్కారములు.
ఇచ్ఛయైవ వ్యక్త జగతే – సర్వ సాధ్య విభూతి మహతే ।
అప్రతీపమేవ విశతే – బ్రహ్మ తేజో రాశి లసతే ।।నమో నమో।।
కేవలం ఇచ్ఛామాత్రముననే సమస్త జగత్తును సృష్టించేటటువంటి, అన్ని విధములైన దైవిక మహిమలను చేయగలిగినటువంటి, ఆటంకం లేకుండా ఏ చోటనైనా సులభంగా ప్రవేశించేటటువంటి బ్రహ్మదత్తుని తేజోరాశిగా విలసిల్లేటటువంటి, బ్రహ్మదత్తుని ఆయుధమైన బ్రహ్మాస్త్రమునకు మరల మరల నమస్కారములు.
జప కమండలు తోయజాయ – బ్రహ్మవాక్య విజృంభితాయ ।
సర్వదైవత వందితాయ – సేవకాయిత సర్వాస్త్రాయ ।।నమో నమో।।
బ్రహ్మదత్తుని దివ్య కమండలము నుండి జన్మించినటువంటి, బ్రహ్మదత్తుని వాక్కులచే విజృంభిచేటటువంటి, సమస్త దేవతలచే ఆదరముతో నమస్కరింపబడేటటువంటి, అన్ని విధములైన దివ్యాస్త్రములకు రాజైనటువంటి, బ్రహ్మదత్తుని ఆయుధమైన బ్రహ్మాస్త్రమునకు మరల మరల నమస్కారములు.
అనఘా శక్తి ప్రచోదకాయ – దత్తాత్రేయ స్వరూపకాయ ।
ఆగమ విద్యుదుజ్జ్వలాయ – జ్ఞాన మహాగ్ని జ్వాలికాయ ।।నమో నమో।।
బ్రహ్మదత్తుని అనఘాశక్తిచే అన్నివేళలా ప్రేరేపింపబడేటటువంటి, సాక్షాత్తూ దత్తాత్రేయ స్వరూపమైనటువంటి, పవిత్ర వేదములే తన విద్యుచ్ఛక్తిగా మారి ప్రకాశించేటటువంటి, ఆధ్యాత్మిక జ్ఞానమే మండుచున్న మహాగ్నిగా మారినదా అనిపించేటటువంటి, బ్రహ్మదత్తుని ఆయుధమైన బ్రహ్మాస్త్రమునకు మరల మరల నమస్కారములు.