వందనీయం విష్ణుచక్రం
వందనీయం విష్ణుచక్రం – వారణార్థం చిన్న నక్రం ।
ఖండితాసుర వృత్తి వక్రం – రక్షితామరలోక శక్రమ్ ।।వందనీయం।।
మొసలిపట్టులో చిక్కుకున్న గజేంద్రుడు ఆర్తితో ప్రార్థింపగా ఆ మొసలిని సంహరించి గజేంద్రుని రక్షించినటువంటి, తామస ప్రవృత్తితో వక్రమైన పనులు చేస్తున్న లోకకంటకులైన రాక్షసులను వధించి, దేవతలకు రాజైన ఇంద్రుని, వారి స్వర్గమును కాపాడినటువంటి, విష్ణుదత్తుని విష్ణుచక్రమునకు నమస్కారములు.
ఆశ్రితామర భాగధేయం – విక్రమోజ్జ్వల మప్రమేయం ।
ఆగమాంతర మంత్రగేయం – శ్రీ సుదర్శన నామధేయమ్ ।।వందనీయం।।
తనను ఆశ్రయించిన దేవతలకు అదృష్టమైన (భాగ్యమైన)టువంటి, శౌర్య-వీర్యములతో అద్వితీయంగా ప్రజ్వరిల్లేటటువంటి, పవిత్రములైన వేదములచే స్తుతింపబడేటటువంటి, శ్రీసుదర్శనమనే పేరును కలిగినటువంటి, విష్ణుదత్తుని విష్ణుచక్రమునకు నమస్కారములు.
కార్తవీర్య మహావతారం – చోర దండన లోకచారం ।
ధారయా హృత భూమి భారం – విద్యుదుజ్జ్వల వల్లిహారమ్ ।।వందనీయం।।
కార్తవీర్యునిగా అవతరించినటువంటి, లోకములో సంచరిస్తూ దొంగలను శిక్షించేటటువంటి, భూమాతకు భారంగా మారి రాక్షసప్రవృత్తితో లోకములను దుఃఖపెట్టే దుష్టులను సంహరించి భూభారం తగ్గించేటటువంటి, అద్భుతమైన విద్యుత్కాంతులే తీగలుగా మారి హారముగా అలంకరింపబడినటువంటి, విష్ణుదత్తుని విష్ణుచక్రమునకు నమస్కారములు.
మాధవాంగుళి నాభిసారం – దత్తభక్తి విపత్తి పారమ్ ।
అష్టసిద్ధి మహత్త్వహారం – శత్రుకర్తన కోటి హీరమ్ ।।వందనీయం।।
లక్ష్మీపతియైన మాధవుని చూపుడువేలే ఆధారముగా కలిగి శోభించేటటువంటి, దత్త భగవానుని భక్తితో ఆశ్రయించిన భక్తులను ఆపదలనుండి దాటించేటటువంటి, అతి గొప్పవైన అష్టసిద్ధులకు నెలవైనటువంటి, వజ్రము వంటి పదునైన చక్రపు అంచులతో శత్రువులను సంహరించేటటువంటి, విష్ణుదత్తుని విష్ణుచక్రమునకు నమస్కారములు.