భజ రే వీణాపాణిం – వాణీ మలికుల వేణీమ్ ।
ఏణీక్షణ సుమబాణాం – శోణాధర కర కోణామ్ ।। (పల్లవి)
ఓ జీవుడా! చేతియందు వీణను ధరించినట్టి, నల్ల తుమ్మెదల గుంపు వంటి జడను కలిగిన, ఆడలేడి చూపుల వంటి చూపులనే పుష్ప బాణములుగా కలిగినట్టి, అనేక కోణముల యందు ఎర్రని తన పెదవుల కిరణాలను ప్రసరింప చేస్తున్నట్టి సరస్వతీ మాతను సేవింపుము.
కమలాసన ఘన కామాం – విధి రామా మభిరామామ్ ।
శమ దమ సుగుణ స్తోమాం – ఘుమ ఘుమ సౌరభ భామామ్ ।।
బ్రహ్మదేవుని యందు తీవ్రమైన అనురాగము కలిగినట్టి, ఆయన భార్యయు, అతి సౌందర్యవతియూ అయినట్టి, ‘శమము,’ ‘దమము’ అనే సుగుణముల సమూహముతో కూడినట్టి, చక్కని ఘుమ ఘుమలాడు కమల సౌరభమును వెదజల్లేటువంటి ఆ సరస్వతీ మాతను సేవింపుము.
శరదమలామజలోలాం – సత్కవికుల నిజ బాలామ్ ।
గలకలిత కమలమాలాం – సువిలసిత తిలక ఫాలామ్ ।।
శరత్కాలము వలె నిర్మలమైనట్టి, అజుడైన బ్రహ్మయందు మోహము కలిగినట్టి, గొప్ప కవుల సమూహాన్నే తన సంతానముగా కలిగిననట్టి, కంఠమునందు పద్మమాలను ధరించినట్టి, అందమైన నుదుటిపై ఎర్రని తిలకముతో చక్కగా ప్రకాశిస్తున్నట్టి ఆ సరస్వతీ మాతను సేవింపుము.
హంసయాన చలదంసాం – హంస వాహనోత్తంసామ్ ।
హంసీం ద్యుతి జిత హంసాం – హంసక కలపిక హింసామ్ ।।
కదలుచున్న చేతులతో హంస వలె నడచుచున్నట్టి, అందమైన హంస వాహనానికే అలంకారమైనట్టి, ఆడ హంస వంటి లేక పరమాత్మ స్వరూపిణియైనట్టి, మనోహరమైన హంస యొక్క తెల్లదనమును కూడ మించిన తెల్లదనము కలిగినట్టి, తన కాలి అందెల తియ్యని మువ్వల ధ్వనులచే, తీయగా పాడే కోకిలలను కూడ చిన్నబుచ్చినట్టి ఆ సరస్వతీ మాతను సేవింపుము.
గద్య పద్య రస విద్యాం – మద్య హృద్య మధు వాద్యామ్ ।
ఆద్యా ముద్యత్సద్యో – విద్యుద్ద్యుతి మనవద్యామ్ ।।
గద్య, పద్య ప్రక్రియలనే రసము చిందించు విద్యగా కలిగినట్టి, మద్యము వలె మత్తెక్కించే మధురమైన సంగీత వాద్యములు కలిగినట్టి, భక్తులు ఆదిశక్తిగా తెలసికొన్నట్టి, అప్పటికప్పుడే ఉదయించే విద్యుత్కాంతులు కలిగినట్టి, ముఖమందు విద్యుత్కాంతులతో ప్రకాశిస్తున్నట్టి, ఎటువంటి దోషమూ లేనట్టి ఆ సరస్వతీ మాతను సేవింపుము.
క్వణిత కచ్ఛపీం హస్తే – న్యస్త సుపుస్తక మాలామ్ ।
ప్రశస్త మస్తాభ్యస్తాం – స్తుతిభిస్తతా మనస్తామ్ ।।
‘కచ్ఛపి’ అనే వీణను హస్తములందు ధరించినట్టి, చక్కటి పుస్తకము, జపమాలలను మిగిలిన చేతులలో ధరించినట్టి, ప్రశస్తమైన బుద్ధి చేతనే అభ్యసనమైనట్టి (ఆరాధింప తగినట్టి) భక్తులు చేసే స్తోత్రములచే విస్తృతమైన కీర్తిని కలిగినట్టి, అస్తమయము లేక నిత్యమూ ప్రకాశించేటటువంటి ఆ సరస్వతీ మాతను సేవింపుము.
సంగీత మంగళాంగీం – శృంగార శృంగ రంగామ్ ।
భృంగాలక నవభంగీం – బ్రహ్మ సంగ రస గంగామ్ ।।
సంగీతమునే మంగళమయమైన శరీరముగా కలిగినట్టి, శృంగారము యొక్క శిఖరమునే రంగస్థలముగా కలిగినట్టి, నల్ల తుమ్మెదల వంటి ముంగురులను కొంగొత్త రీతిలో కలిగినట్టి, బ్రహ్మదత్తుని సాన్నిధ్యములో రసగంగయై భాసించుచున్నట్టి ఆ సరస్వతీ మాతను సేవింపుము.
ఇందీవర చందన రుచి – కుందేందు మందహాసామ్ ।
ఆనంద మరందాబ్ధిం – ఇందిరా స్నుషాం వందే ।।
తెల్ల కలువలు, తెల్ల చందనము, తెల్ల మల్లెలు, తెల్లని చంద్రుడు – సృష్టిలోని ఈ అందమైన వస్తువుల తెల్లదనము వంటి స్వచ్ఛమైన చక్కటి మందహాసమును కలిగినట్టి, ఆనందమనే మకరందమే సముద్రముగా మారినదా అనిపించేటటువంటి, శ్రీమహాలక్ష్మికి ప్రియమైన కోడలైనట్టి ఆ సరస్వతీ మాతను సేవింపుము.