(Sung by Smt. Devi)
దర్శయ చరణమ్, దత్తాత్రేయ! (పల్తవి)
ఓ దత్తాత్రేయా! నీ దివ్యమైన పాద పద్మములను నను దర్శింపచేయి.
భవాబ్ధి తరణం భవ పాశహర!
ఈ ప్రాపంచిక విషయాలపట్ల జీవులకు కలిగే అమితమైన ఆకర్షణలను హరింప చేసి కేవల సత్య జ్ఞానము చేతనే నీ దివ్య పరబ్రహ్మ తత్త్వమునందు ఆకర్షణను కలిగించే ఓ దత్తాత్రేయా! ఈ సంసారమనే సాగరాన్ని దాటడానికి పడవవంటి నీ దివ్య పాద పద్మములను నను దయతో దర్శింపచేయి.
కరుణాభరణం కిరణ కారణ!
సృష్టిక్రమంలో మొట్ట మొదటి పదార్థమైన తేజస్సును సృష్టించిన దత్తాత్రేయా! కరుణనే ఆభరణముగా ధరించిన నీ దివ్య పాద పద్మములను నను దయతో దర్శింపచేయి.
జ్ఞానాచరణం ప్రజ్ఞాన ఘన!
నిత్యమైన, సత్యమైన, సంపూర్ణమైన, అద్భుతమైన ఆధ్యాత్మిక జ్ఞానమే మూర్తీభవించిన ఓ దత్తాత్రేయా! జ్ఞానయోగమును పొందడానికై మేము వేసే మొదటి అడుగుకు స్ఫూర్తిభూతములైన నీ దివ్య పాద పద్మములను దయతో దర్శింపచేయి.