శబ్దమేకం కథయ, కథమపి చ దత్త!
ఓ దత్తప్రభో! ప్రయత్న పూర్వకంగానో లేక అప్రయత్నంగానో, ఏదో నీకు నచ్చిన విధంగా, మాయందు కరుణతో ఒక్క మాటనైనా మాట్లాడరాదా!
కణ్ఠ శఙ్ఖ తీర్థం, జ్ఞాన గఙ్గాఙ్గ!
ఓ దత్తా! పరమ పవిత్ర గంగానది వంటి ఆధ్యాత్మిక జ్ఞానమునే దేహముగా కలిగిన వాడా! నీవు మాట్లాడే ఆ ఒక్క మాట నీ కంఠమనే శంఖము నుండి బయల్వెడలే పరమ పవిత్ర గంగా జల తీర్థము వంటిది.
[గంగా జలము పరమ పవిత్రమైనది. అటువంటి గంగాజలాన్ని శుద్ధమైన శంఖంలో పోసినపుడు మరింత పరమ పవిత్రంగా మారుతోంది. సామాన్యంగా కంఠమును శంఖంతో పోలుస్తారు. ]
తత్త్వసార కరకాం, వేదాన్త వర్ష!
వేదాంతమనే ఆధ్యాత్మిక జ్ఞానమును వర్షధారలుగా కురిపించువాడా! నీవు మాట్లాడే ఆ ఒక్క మాట ఆధ్యాత్మిక జ్ఞానము యొక్క సారమే ఘనీభవించగా వర్షంలో ఆకాశంనుండి పడే వడగళ్లవంటిది.
[పెద్ద పెద్ద వర్షాలు పడినపుడు ఆ వర్షధారలలో నీరు ఘనీభవించగా ఏర్పడిన వడగళ్లు పడడం మనకు సర్వ సాధారణ అనుభవము.]
మోహాద్రి భేదకం, విజ్ఞాన వజ్ర!
జ్ఞానమనే అఖండమైన తర్కాన్నే వజ్రాయుధంగా ధరించినవాడా! నీవు మాట్లాడే ఆ ఒక్క మాట ప్రాపంచిక మోహమనే పెద్ద పర్వతాలనే బ్రద్దలు కొడుతుంది.
[పౌరాణికంగా ఇలా చెప్తారు. ప్రాచీనకాలంలో పర్వతాలకు రెక్కలుండేవట. అ రెక్కలతో అవి ఎగురుతూ అటూ ఇటూ తిరుగుతూ ఉండేవి. అవి ఎప్పుడు ఎవరి నెత్తిన వచ్చి పడతాయోనని అందరూ తీవ్ర భయభ్రాంతులకు గురయేవారు. దేవతలకు రాజైన ఇంద్రుడు ఆ ప్రమాదంనుండి అందరినీ కాపాడడానికి తన వజ్రాయుధాన్ని ఉపయోగించి ఎగిరే పర్వతాల రెక్కలను కత్తిరించాడు. అలానే, దత్తప్రభువు మాట్లాడే ఆ ఆ ఒక్క మాట ప్రపంచంలో మనం పెంచుకున్న మోహమనే పెద్ద పర్వతాలను, ఇంద్రుడు వజ్రాయుధంతో పర్వతాల రెక్కలు బ్రద్దలు కొట్టినట్లుగా, బ్రద్దలు కొడుతుందని ఇక్కడ తాత్పర్యంగా గ్రహించాలి.]