దత్తాత్రేయా దన్యత్ తుచ్ఛమ్,
దత్తాత్రేయా దన్యదసత్యమ్ ॥ (పల్లవి)
దత్తాత్రేయుని కంటె భిన్నమైన ఏ వస్తువైననూ అతి నీచమైనది గానే గ్రహించాలి. దత్తాత్రేయుని కంటె భిన్నమైన ఏ వస్తువూ కూడ నిత్య, సత్య, జ్ఞాన, శుద్ధ, బుద్ధమై పరబ్రహ్మ రూపమైనటువంటి తత్త్వము ఎన్నటికీ కానేరదు.
జాటజూట ముఖ లోచన షట్కమ్,
తర్క జటిల షట్ శాస్త్ర జ్ఞానమ్ ॥
సంక్లిష్టమై, జడలు కట్టినటువంటి కేశముల కల మూడు ముఖములందు ప్రకాశించే శ్రీ దత్తాత్రేయుని ఆరు కన్నులు ఆధ్యాత్మిక జ్ఞానము యొక్క సంక్లిష్టము, జటిలమైన తర్కమును బోధించే ఆరు దర్శనములుగా తెలుసుకోవాలి. తల మరియు ముఖము బుద్ధికి లేక జ్ఞానయోగమునకు ప్రతీక. ఇదే జ్ఞానయోగము. (దత్తాత్రేయ స్వరూప వర్ణన).
కాషాయాంబర రాగో వర్ణః,
పక్వభక్తి రనురాగో హృదయమ్ ॥
పైన చెప్పిన దాని తరువాత, దత్తాత్రేయుని దివ్య శరీర మధ్యమందు ధరించే కాషాయ వర్ణ వస్త్రము హృదయము లేక మనస్సును సూచిస్తుంది. ఎందుకంటే, ఎఱ్ఱని వర్ణము కలిగినట్టి హృదయము లేక మనస్సుయందే ప్రేమ, భక్తి నెలకొని ఉంటాయి. ఇదే భక్తియోగము.
పాదుకే చ తవ వదతః కర్మ చ,
ఫలిత త్యాగం కర్మ యోగమ్ ॥
పైన చెప్పిన రెండిటి తరువాత పాదములందు నీవు (దత్తాత్రేయుడు) ధరించే రెండు పాదుకలు క్రియాత్మకమైన సేవము సూచించే కర్మయోగము. అందులో ఒక పాదుక సద్గురు సేవ లేక ‘కర్మ సంన్యాసము’ను సూచిస్తుంది. మరియొక పాదుక మేము (జీవులు) చేసిన పని ద్వారా ఆర్జించిన ధనము యొక్క త్యాగము లేక ‘కర్మ ఫల త్యాగము’ను సూచిస్తుంది. పైనుండి క్రిందివరకు వరసగా సమన్వయం చేసుకున్నట్లయితే, జ్ఞానయోగము లేక బుద్ధి, భక్తియోగము లేక హృదయము (మనస్సు) మరియు ఆచరణాత్మకమైన కర్మయోగములే భగవంతుడైన శ్రీ దత్తాత్రేయుని స్వరూపముగా తెలుసుకోవాలి. శ్రీ శంకరాచార్యులు, శ్రీ రామానుజాచార్యులు, శ్రీ మధ్వాచార్యుల క్రమమువలె జ్ఞానయోగము, భక్తియోగము, కర్మయోగము క్రమముగా సంభవిస్తాయి. ఈ మువ్వురును ఈ మూడు యోగములకు ప్రతీకలుగా స్వీకరించాలి.