home
Shri Datta Swami

Jump to Bhakti Ganga contents in — English  Telugu  Hindi

తవ కరుణైవ హి సర్వం దత్త!


తవ కరుణైవ హి సర్వం దత్త!
తస్యాః పరమస్తి న కిఞ్చిత్తు ॥

ఓ దత్తప్రభూ! నీ కరుణయే సమస్తము. నీ కరుణను మించి పొందదగిన గొప్ప వస్తువేదీ లేదు. నీ కరుణను పొందిన జీవుడు ఈ సృష్టిలోని సమస్తమునూ పొందినట్లే.

కరోమ్యహమితి హి సోఽహంకారః ।
తవ కోపాన్తో నాశయితవ్యః ॥

ఎపుడైతే జీవుడు నాకు సంబంధించిన సమస్త కార్యములను నేనే చేస్తున్నాను, అన్నిటికినీ నేనే కర్తను అని అనుకుంటాడో, అట్టి భావనయే ‘అహంకారం అనబడుతుంది. దత్తా! అటువంటి జీవుని చూచి కోపోద్రిక్తుడవై నీవు ఆ జీవునిలోని అహంకారమును నశింపచేసెదవు. తాత్పర్యమేమంటే, జీవుడు అజ్ఞానంతో పెంపొందించుకున్న అట్టి అహంకారాన్ని చివరికి భగవంతుడే వచ్చి స్వయంగా నాశనం చేయడానికి ముందే, జ్ఞాన విచక్షణతో, నాశనం చేసుకోగలగాలి.

లౌకిక మమకారో న హి బాధ్యః ।
స ఏవ యత్ త్వయి సమర్పణీయః ॥

ప్రాపంచిక బంధాల పట్ల జీవునికి కలిగే మహా మోహమును అంతమొందించే ప్రయత్నం చేయవలసిన శ్రమ లేదు ఎందుకంటే, అదే వ్యామోహమును ప్రపంచంవైపు గాక నీవైపు (దత్తుని వైపు) త్రిప్పగలిగితే చాలును.

[తనలో కలిగే అహంకారాన్ని జీవుడు నాశనం చేయగలగాలి, లేకుంటే భగవంతునికి అది కోపాన్ని కలిగిస్తుంది. కాని, అహంకారములాగా మోహమును నాశనం చేసే అవసరం లేదు. సంపూర్ణంగా ఆ మోహాన్ని భగవంతుని వైపు మరలిస్తే చాలు. కాబట్టి వ్యామోహాన్ని నశింపచేయక దాని యొక్క లక్ష్యాన్ని మారిస్తే మాత్రం సరిపోతుందని భావము.]

త్వదయన గమ్యౌ బిల్హణతపసోః ।
విచారణీయౌ వినిమయపూర్వమ్ ॥

కవి బిల్హణుడు, తపస్వియైన ఋషి తమ తమ మార్గములను, లక్ష్యములను పరస్పరం మార్చుకున్నారు కదా, అలా మార్చుకోవడానికి ముందు అసలేం జరిగిందో ఆలోచించి సరిగా తెలుసుకోగలగితేనే నిన్ను (దత్తుణ్ణి) పొందింపచేసే  భక్తియోగం యొక్క విశిష్టత స్పష్టమవుతుంది.

[బిల్హణకవి ఒక అడవిలో నడుస్తూ తన ప్రియురాలైన ‘యామినీ పూర్ణ తిలక’ యొక్క ప్రేమ భావనలలో నిండా మునిగిపోయి ఉంటాడు. అలా నడుస్తుండగా, అక్కడ భగవత్సాక్షాత్కారం కోసం అతి కఠోరమైన తపస్సు చేస్తున్న ఒక ఋషికి, బిల్హణుని కాలు తగులుతుంది. ఈ విషయం బిల్హణుడికి తెలియదు. ఈ చర్య వలన ఆ ఋషికి మహా క్రోధం కలిగి బిల్హణుని శపించబోతాడు. అపుడు బిల్హణుడు ఇలా అడుగుతాడు – ‘స్వామీ, నేను నా ప్రియురాలి మోహంలో మునిగిపోయి నా చుట్టుప్రక్కల ఏం జరుగుతోందో కూడా తెలియని పరిస్థితిలో వెడుతున్నాను. మరి భగవత్సాక్షాత్కారం కోసం తీవ్రతపస్సులో మునిగి బాహ్యస్మృతినే కోల్పోయిన మీకు నా కాలిస్పర్శ ఎలా తెలిసింది?’ ఈ ప్రశ్నతో ఆ ఋషి దిగ్భ్రాంతి చెంది బిల్హణుని ప్రేమమార్గము సరియైనదే కాని అతని లక్ష్యము సరియైనది కాదని తెలుసుకుంటాడు. ఇంకా ఆలోచించి ఆ ఋషి తన లక్ష్యము సరైనదే కాని సాధనా మార్గము సరైనది కాదని కూడ తెలుసుకుంటాడు. అపుడు ఆ ఋషి తమ తమ లక్ష్యములను, మార్గములను పరస్పరం మార్చుకొందామని బిల్హణునికి ప్రతిపాదిస్తాడు. పర్యవసానంగా బిల్హణుడు ‘లీలాశుకుడ’నే క్రొత్త పేరుతో మహాత్ముడై  పిలువబడతాడు. ఆ లీలాశుకుడే అతి సుందరమైన, అతి భావగర్భితమైన ‘శ్రీకృష్ణ కర్ణామృతమ్’ అనే భక్తి కావ్యాన్ని తరువాత రచిస్తాడు.]

 

 
 whatsnewContactSearch