గాయంత మారక్ష దత్త ! ।
గాయత్రి ! తత్ ఛంద ఏవ ।। (పల్లవి)
ఓ దత్తా! నీ దివ్యమైన కళ్యాణ గుణములను తన్మయత్వముతో గానం చేసి ప్రార్థించే గాయకుడిని అన్ని విధాలుగా కాపాడుము. ఓ గాయత్రీ! నీవు కేవలం అట్టి దత్తుని గూర్చి గానం చేయబడే ప్రార్థనల యొక్క ఒక ఛందస్సువి మాత్రమే కద!
{“తత్సవితుః...” అని ఉచ్చరించబడే వైదిక మంత్రము ‘గాయత్రి’ అనే ఒక వైదిక ఛందస్సులో ఉండుట వలన లోకములో గాయత్రీ మంత్రముగా ప్రసిద్ధి చెందినది. కానీ, “గాయత్రీ ఛందః, సవితా దేవతా” అనే మంత్ర పూర్వన్యాసము ద్వారా గాయత్రి ఒక ఛందస్సు అని పేర్కొనడము, గాయత్రి దేవత అని చెప్పకపోవడము, సవితా అనబడే దత్త పరమాత్మనే ఆ మంత్రాధిష్ఠాన దేవతయని చెప్పడం వలన అట్టి వైదిక మంత్రమునకు ఛందస్సు, దేవతలు ఎవరనేది విశదమయినది.}
అనూహ్య లీనః సోపాధిశ్చ ।
సవితా బ్రహ్మా దత్త ఏవ ।।
జీవుల ఊహలకందని అనూహ్యమైన పరబ్రహ్మము సోపాధికమైన, దివ్యమైన, తేజఃశరీరములో లీనమై ‘బ్రహ్మా’ లేక ‘సవితా’ అని పిలువబడినాడు. ‘షూఙ్ (ప్రాణి ప్రసవే)’ అనే సంస్కృత ధాతువు నుండి ఏర్పడిన ‘సవితా’ అనే శబ్దమునకు ‘జీవులను ప్రసవించువాడు’ లేక ‘జీవులను సృజించువాడ’నే అర్థము. అనగా, బ్రహ్మదేవుడైన శ్రీదత్తుడే ఇక్కడ సృష్టికర్తగా చెప్పబడినాడు కాని, మనం దేవతగా తెలసికొన్న గాయత్రి కాదని స్పష్టమయినది.
సర్వ మతానాం నోహ్య సామ్యమ్ ।
కా వాఽపి భాషా కిమపి మతమ్ ।।
అనూహ్యుడై, ఉపాధి రహితుడైన భగవంతుడే అన్ని మతములలోను మొట్టమొదటి దేవునిగా చెప్పబడినాడు. ఆ భగవంతుడే వివిధములైన ఉపాధులను ధరించి, వివిధ తేజో రూపములలో అనేకమైన పేర్లతో వచ్చాడని భిన్నమైన మతములు చెబుతాయి. కాబట్టి భాష ఏదైనా, మతమేదైనా అట్టి అనూహ్య పరబ్రహ్మమే ప్రపంచంలోని అన్ని మతములకు సమానము మరియు అదే మొదటి అనూహ్య దైవము.
అనగా, ఏ మతములోనైనా, ఏ భాషలోనైనా భగవంతుని గూర్చి మధురంగా గానం చేసే ఏ ప్రార్థన అయినా గాయత్రి అనబడుతుంది. మధురమైన పాటలతో భగవంతుని అర్చించే ఓ విధమైన పూజా విధానమునకే ‘గాయత్రి’ అను పేరు తప్ప ఇక్కడ గాయత్రి శబ్దమునకు దేవత అని అర్థము కల్పించరాదు.
అలింగ కుల ముని విశ్వామిత్రమ్ ।
భగవద్గీతం మంత్ర తత్త్వమ్ ।।
ప్రతి మంత్రమునకు ప్రత్యేకమైన ‘ఋషి-దేవతా-ఛందస్సు’ అనే మూడు విషయాలు ఉంటాయి. విశ్వామిత్రుడు గాయత్రీ మంత్రమునకు ఋషిగా చెప్పబడినాడు. ‘విశ్వామిత్ర’ శబ్దమునకు ‘విశ్వ-మిత్రు’డు అని అర్థము. కావున, ఆయన విశ్వములో సమస్త మానవాళికి లింగ, కుల, మత, ప్రాంత, సంస్కృతి భేదం లేకుండా మిత్రుడు లేక స్నేహితుడని తాత్పర్యము. భగవంతుని గూర్చి భక్తితో చేసే ఏ గానమైనా గాయత్రి యనే అనబడుతుంది, ఇదే గాయత్రి మంత్రసారము. అందువలన, గాయత్రి ఏ ఒక్క మతమునకు సంబంధించక సార్వత్రికమై ఉంటుంది.