home
Shri Datta Swami

Jump to Bhakti Ganga contents in — English  Telugu  Hindi

స్వామి దివ్య వాణి


"జ్ఞానమే దీపము, భక్తియె మార్గము నీ దయ నడవగ ఊపన్నా, దీపహీనుడును మార్గము నందున లక్ష్యము చేరును వెంకన్నా."

జ్ఞానము మూల కారణము. భక్తి ప్రాప్తి కారణము. సేవ (కర్మ) ఫల స్వరూపము. ఈ మూడింటిని క్రమముగా శంకర-రామానుజ-మధ్వ రూపాలలో దత్త భగవానుడు యీ లోకములో ఉపదేశించినారు. కృష్ణుని గుణములను విని, కృష్ణుని గురించిన జ్ఞానము వలన రుక్మిణి కృష్ణుని యందు ఆకర్షిత అయ్యెను. కావున బ్రహ్మజ్ఞానము అనగా జ్ఞాన యోగము భక్తికి మూల కారణము. ఈ ఆకర్షణ రూపమైన, భగవంతుని పొందాలనే తపనయే భక్తి. ఇట్టి తపన ద్వారా కృష్ణుని రుక్మిణి పొందగలిగినది కావున భక్తియే ప్రాప్తి కారణము. "భక్త్యా త్వనన్యయా లభ్య:" అని గీత. "అనన్య భక్తికి నేను లభిస్తాను", అని దీని అర్ధము. శంకరులు సైతము "మోక్షసాధన సామగ్య్రాం, భక్తి రేవ గరీయసీ" "భక్తి:కింనకరోత్యహో!" అని భక్తియే అత్యుత్తమ సాధనమనియు, భక్తి దేనినైనా సాధించగలదనియు ప్రస్తుతించినారు. భక్తి ద్వారా పరమాత్మను పొందిన తరువాత, స్వామిని సేవించే భాగ్యమే (సేవా) కర్మ యోగము. సేవ భక్తికి నిరూపణము. ప్రాప్తి తరువాత రుక్మిణి పరమాత్మ యొక్క సేవ చేసినది.

శబరి, తిన్నడు మొదలగు భక్తులు జ్ఞానము లేకపోయినా భక్తి ద్వారా పరమాత్మను పొందినారు. వారికి పూర్వ జన్మలలో యీ జ్ఞానయోగము లభ్యమైనదని అర్ధము. కావున భక్తియున్నచో జ్ఞానమున్నట్లే. జ్ఞానమున్నచోట భక్తి జనింపక తప్పదు కావున భక్తి ఉన్నట్లే. జ్ఞాన పరాకాష్ఠయగు శంకరులను, భక్తి పరాకాష్ఠయగు మీరను పరమాత్మ సశీరరంగా ఐక్యము చేసుకున్నారని ప్రసిద్ధి.

"యాన: ప్రీతిర్విరూపాక్ష" అను శ్లోకము లౌకిక విషయములందున్న ప్రేమయే భగవంతునియందున్న భక్తి యనబడునని చెప్పుచున్నది. ఈ భక్తియే పరాకాష్ఠకు చేరినచో పరాభక్తి యనబడును. ఈ స్ధితిలో స్వామిపై పరిపూర్ణ ప్రేమయుండి, ఎట్టి విమర్శయు తర్కము స్వామియందు సహించజాలని విపరీత వ్యామోహము ఏర్పడును. ఈ దశలో స్వామి ఆగ్రహము కూడ మహాప్రసాదముగా భావించు పరిస్ధితి ఇది. ఇదే నవవిధ భక్తులలోని చివరిదియగు ఆత్మనివేదనము. మనోవాక్కాయములే (కర్మ కాయము చేతనే సంభవించును కావున మనోవాక్కర్మలే త్రికరణములు) ఆత్మయనబడును. ఇదే త్రికరణార్పణము. ప్రతి వ్యక్తితోను ప్రతి వస్తువుతోనుగల బంధములన్నియు తెగిన పూర్ణముక్తి ఇదే. స్వామి బంధము ఒక్కటే మిగిలిన కైవల్యమిదే. ఇదే భక్తి యొక్క దశావస్థలలోని "ఉన్మాదము" అనగా బ్రహ్మపిచ్చి. ఈ ఉన్మాదములో స్వామి తప్ప, లౌకిక వస్తువుగానీ, లౌకిక వ్యక్తిగానీ, ధర్మా ధర్మ విచికిత్స గానీ, నరకాది భయములు కానీ ఉండవు. ఇదే అవధూతావస్థ. ఇది గోపికలకు కలిగెను.

జ్ఞానయోగమునకు సద్గ్రంధములు ఎట్లు సాధనములో, భక్తి యోగమునకు భజన పాటలు అట్టి సాధనములు. భక్తి సూత్రకర్తయగు నారదుడు వీటిని సదా కీర్తించుట చేత దేవాసురులకు పూజ్యుడయ్యెను. అసురులు అనగా దుష్టులు సైతము వీటి వలన ప్రభావితులగుదురని అర్ధము. నారదుడు భక్తి అనిర్వచనీయమన్నాడు. "జారవచ్చ", "యధావ్రజగోపికానాం" అను సూత్రములలో జారుని యెక్క లోలత్వము (నిష్ఠ) తో సమానమైనది భక్తియని, భక్తులకు ఉదాహరణముగా గోపికలను పేర్కొన్నాడు. "తన్మయాహితే" అను సూత్రములో భక్తులలో భగవంతుడు ఆవేశించి కైవల్య భావము అనగా తానే వారు, వారే తాను అనునట్లు ఉండునని చెప్పినాడు.

సంసార బంధములను ఆరు కొండలను దాటి, కేవల భగవద్బంధమనే ఏడవ కొండనెక్కి అచటనున్న భక్తి యను కోనేరు గంగలో ఒక్కసారియైన మునక వేయని జీవుని జీవితము వ్యర్ధము. "ఒకసారి మునకేతునా - నా ప్రాణనాధా" అనే భజనతో భక్తి గంగలో ఒక్కసారి అయినా మునగండి.

శ్రీ దత్తస్వామి
జన్నాభట్ల వేణుగోపాల కృష్ణమూర్తి

ఈ భజనల ఆడియో డౌన్ లోడ్ చేయటానికి ఇక్కడ క్లిక్ చేయండి మరియు పుస్తకమును డౌన్ లోడ్ చేయటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

 
 whatsnewContactSearch