నిష్కామ కర్మ జనా ద్వివిధమ్,
జాతాయ దధతి న తే తు దత్త ॥ (పల్లవి)
ఆచరణాత్మకమైన ప్రేమయే నిష్కామ కర్మయోగము కావున, అట్టి నిష్కామ కర్మయోగము ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించదు. ఈ కర్మయోగము, సేవ (కర్మ సంన్యాసము) మరియు త్యాగము (కర్మ ఫల త్యాగము) అని రెండు భాగములుగా ఉండును. ఓ దత్తప్రభో! ఈ రెండు విధములైన నిష్కామకర్మను, జీవులు తమ సంతానము కొరకు, వారి వలన ఎటువంటి ప్రయోజనము కలగకపోయినా కూడ, ఇష్ట పూర్వకంగా చేస్తారు తప్ప పరమాత్మవైన నీ కొరకు మాత్రం పొరపాటున కూడ చేయరు.
అసాధ్యమితి చేత్ సర్వత్రాఽస్తు,
ఏకత్ర సాధ్య మయుక్త మేవ ॥
నరావతారంలో వచ్చిన నీకు (పరమాత్మకు) ప్రతిఫలాన్ని ఆశించకుండా నిష్కామకర్మ రూపమైన అట్టి సేవ మరియు త్యాగము చేయడం అసంభవమని కొందరు జీవులు అంటే, ఒక్క పరమాత్మ సందర్భములోనే కాక అటువంటి అన్ని సందర్భాలలోను ఆ విధమైన నిష్కామకర్మ చేయడం అసంభవమని వారు అనాలి కద? తమ సంతానం విషయంలో శక్తికి మించిన నిష్కామకర్మను చేసి ఓ వైపు సంభవమని నిరూపిస్తూ, మరోవైపు పరమాత్మ విషయంలో మాత్రం అది అసంభవమంటే అది తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడమే. ఏ క్రియనైతే చేయడం అసంభవమని తీర్మానించామో, అట్టి క్రియ ఒకచోట సంభవమని మరియొక చోట అసంభవమని చెప్పడం ఎలా యుక్తమవుతుంది? కావున కర్మ సంన్యాసము, కర్మఫల త్యాగ రూపమైన నిష్కామకర్మను జీవులకు తమ సంతాన విషయంలో చేయడం సంభవమైతే, పరమాత్మ విషయంలో కూడ చేయడం సంభవమే!
దయాపి వాచ్యా న తత్త్వవిదా,
సర్వం యయాఽఽకర్షణమేవ ॥
ఓ దత్త! కావున అట్టి నిష్కామతత్త్వమును గ్రహించిన జ్ఞానియైన భక్తుడు కనీసం నీ దయను పొందవలెనని కూడ ప్రార్థించరాదు. ఎందువలనంటే, నీ దయను పొందినవానికి నీ సృష్టిలో పొందలేని వస్తువేదీ ఉండదు. కావున నీ కళ్యాణగుణముల ద్వారా, నీపై భక్తునికి కలిగే అతి బలమైన ఆకర్షణయే, నీపట్ల ఏర్పడే భక్తికి ఏకైక కారణమై ఉండాలి తప్ప, పై విధముగా కాకూడదు. కర్మ సంన్యాసము, కర్మఫల త్యాగములు చేయడం ద్వారా నిన్ను సేవిస్తూ, ‘నాకదిస్తే, నీకిదిస్తా’ అని పరస్పరం ఇచ్చి పుచ్చుకునే ధోరణితో, సాటి మానవుల నుండి ఆశించిన విధముగ, నీ దగ్గరనుండి ఏదో స్వార్థ ప్రయోజనం తిరిగి ఆశిస్తే అది భక్తి అనబడదు.
ఏక దిగ్గతి సత్య ప్రేమ,
దాతుం శక్యం కిం న తే తు ॥
నిజమైన ప్రేమ, ఎపుడూ ఒకవైపు మాత్రమే ప్రయాణం చేయగలిగే వాహనముల మార్గము వంటిది. అయితే, వాహనములు రెండు వైపులా ప్రయాణం చేయగలిగే మార్గము వంటి ప్రేమ, అసత్యమైన ‘వైశ్యభక్తి’గా పిలువబడుతుంది. నిజానికి, నీపట్ల (స్వామి పట్ల) జీవుడు సత్యమైన ప్రేమను చూపించినట్లయితే సర్వశక్తిమంతుడవయిన నీకు, అనుగ్రహించడానికి అసంభవమైనదేమున్నది?