కేవల శబ్దో దేవతా కిమ్?
జ్ఞాన భక్త్యా సేవా హి దత్త! (పల్లవి)
ఓ దత్త! కేవలము శబ్దోచ్చారణ ద్వారా ఏర్పడే ధ్వనియే దైవికమా (శబ్ద ధ్వనియే దేవతయా)? కాదు! వస్తుతః, జ్ఞానము, భక్తి మరియు సేవతో కూడిన త్యాగమే దైవికము అనబడుతుంది.
{పూర్వ మీమాంసకులు ధ్వనితో కూడిన శబ్దమే దేవతా స్వరూపమని అంటారు. కాని, శబ్దము యొక్క అర్థమునకు లేక ఆ అర్థజ్ఞానమునకు ప్రాధాన్యమునివ్వక పోవడం చేత, ఆ అర్థజ్ఞానము చేతనే భగవంతుని యందు కలిగే భక్తి, తద్ద్వారా సమర్పణ బుద్ధితో చేయగలిగే సేవ (కర్మసంన్యాసము) మరియు త్యాగములు (కర్మ ఫల త్యాగము) కూడ కలుగవు. ఎందుకంటే, జ్ఞానము, భక్తి, సేవలు ఒకదాని తరువాత మరొకటి వరుసగా సంభవించును. తాము ఊహించుకున్న యజ్ఞాంగములుగా పిలిచే సేవ, త్యాగములనే సాధనగా పిలుస్తూ అట్టి సాధనకు అధిక ప్రాధాన్యాన్ని ఇస్తారు. కాని, వేదము ద్వారా బోధింపబడే సరియైన శబ్దార్థజ్ఞానము చేతనే సేవ, త్యాగములతో కూడిన సాధన కలుగును.}
స్ఫటికే భిన్నే శబ్ద మాత్రాత్,
విజ్ఞాన మతం వివృణోతి ఖలు ॥
ఒక ప్రత్యేకమైన శబ్దమును ఉచ్చరించగా పుట్టే ధ్వని వలన స్ఫటికము పగిలిపోతే, అట్టి సంఘటన కంటితో తెలుసుకొనగలిగే, ఒక వైజ్ఞానికమైన విషయమవుతోంది తప్ప స్ఫటికమును పగులగొట్టే ఆ శబ్ధధ్వనిలో ఎటువంటి దైవశక్తీ లేదు. వైజ్ఞానికముగా, ఒక ప్రత్యేకమైన పౌనఃపున్యములో ఏర్పడే శబ్దశక్తియే అటువంటి ఏ క్రియలనైనా చేయగలదు.
అనన్య భిన్నే భావ భక్తిః,
కేవల నిష్ఠా జ్ఞాన జన్యా ॥
ఒకవేళ, ఓ మహా భక్తుడు ఉచ్చరించగా ఏర్పడిన శబ్దధ్వని వలన స్ఫటికము పగిలితే, దానికి ఆ భక్తుని యొక్క భక్తితో కూడిన వైదిక శబ్దార్థ జ్ఞానము కారణమవుతుంది. అనగా, ఆ భక్తునికి భగవంతుని పట్ల ఏర్పడిన భక్తిభావము, అట్టి భక్తిభావమునకు కారణమైన ఆ శబ్దార్థజ్ఞానమే స్ఫటికము పగలడానికి కారణమవుతోంది. కావున, ఆ విధముగ కొన్ని ప్రత్యేకమైన సందర్భములలో మాత్రమే జరుగుతుంది.
అంధ పఠితం వేదం త్యజంతు,
జ్ఞాన బోధం విచారయంతు ॥
అందుచేత, దయచేసి పవిత్ర వేదము యొక్క గుడ్డి పారాయణాన్ని వదలివేయండి. పవిత్ర వేదము బోధించిన జ్ఞానము (జ్ఞానయోగము), ఆ జ్ఞానము ద్వారా కలిగే భక్తి (భక్తియోగము), ఈ రెండింటి ద్వారా కలిగే సేవలను (కర్మయోగము) గూర్చి విచారణ చేయండి. కేవలం సేవ మాత్రమే దైవికమైన ఫలాలను అందించి నరావతారంలో వచ్చిన పరమాత్మ దగ్గరకు చేరుస్తుంది.
{మహర్షులు ‘సాంగో వేదోఽధ్యేయో జ్ఞేయశ్చ’ అని ఆరు అంగములతో కూడిన పవిత్ర వేదమును అధ్యయనము చేసి చక్కగా తెలుసుకోవాలని చెప్తారు. వేద శబ్దానికి ‘జ్ఞానము’ అని అర్థము (విదుల్ - జ్ఞానే). అధ్యయనమన్నా (అధి+అయనమ్) జ్ఞానమనే అర్థము. పైన ఉదహరించిన వేదవాక్యములోనున్న ‘జ్ఞేయ’ శబ్దము తెలుసుకోవలసిన విషయమును స్పష్టము చేస్తోంది. కాబట్టి, తెలుసుకొని ఆచరణలో పెట్టగలిగే జ్ఞానమే పరమ ప్రధానము తప్ప మీమాంసకులచే ప్రచారము చేయబడిన, జడమైన, ఒట్టి శబ్దశక్తి కానే కాదు. శబ్దమే దేవత – ‘శబ్ద మాత్ర దేవతా,’ అని పూర్వ మీమాంసకులు ప్రచారం చేసారు.}