కర్మఫలస్య త్యాగో గీతః,
కర్మయోగ ఇతి భవతా దత్త ॥ (పల్లవి)
ఓ దత్తప్రభో! కర్మలు చేయగా పొందే ఫలముల యొక్క త్యాగమే సంపూర్ణ కర్మయోగమని నీవు భగవద్గీతలో చెప్పావు కద.
అయితే, ఇక్కడొక చిన్న సందేహము. కర్మలను సాధించడం కోసం శ్రమించడము (కర్మ సంన్యాసము), సాధించిన కర్మల ద్వారా పొందిన ఫలముల యొక్క త్యాగము (కర్మ ఫలత్యాగము) అనే ఈ రెండూ కలిపి కర్మయోగమైతే, మరి భగవంతుడు కర్మ ఫలత్యాగమే కర్మయోగమని ఎందుకు చెప్పాడు?
అంధాభ్యాస జ్ఞానభక్తేః
గేహీ ద్వివిధ త్యాగీ భవతి ॥
ఆలోచన లేని గ్రుడ్డి ఆచరణ కంటె జ్ఞానము (జ్ఞానయోగము) గొప్పదని భగవంతుడు పలికాడు. భక్తియోగముగా తెలియబడిన ధ్యానము (సైద్ధాంతికమైన భక్తి), ముందు చెప్పిన జ్ఞానము కన్న గొప్పది. చివరగా, ఆచరణాత్మకమైన కర్మ (కర్మయోగము) సైద్ధాంతికమైన భక్తియోగము కన్న మరింత గొప్పది, శ్రేష్ఠతమము కూడ. కాని, కర్మయోగమునకు బదులుగా కర్మ ఫలత్యాగ యోగము శ్రేష్ఠతమమని భగవానుడు పలికాడు. ఇక్కడ ఎట్టి సందేహానికి తావు లేదు, ఇది సబబే. ఎందుకంటే, కర్మ సంన్యాసము చేయకుండ కర్మఫలత్యాగమును గృహస్థుడు చేయలేడు. కాబట్టి ఎపుడైతే కర్మ ఫలత్యాగము అని పేర్కొంటామో, దానిలో భాగమైన కర్మసంన్యాసమును చేసే గృహస్థుడినే ఆ శబ్దము పేర్కొంటుంది కాని అన్యులను కాదు. కావున, కర్మ ఫలత్యాగము అని పేర్కొన్నపుడు అది సంపూర్ణమైన కర్మయోగమునకు ప్రతీకయై నిలుస్తుంది. కర్మ ఫలత్యాగము గూర్చి చెప్పి తదంగమైన కర్మసంన్యాసమును గూర్చి గీతలో స్పష్టముగా చెప్పకపోయినా, కర్మ ఫలత్యాగమునకు ఆధారమైన, దానికి పూర్వం నియతమయిన, కర్మ సంన్యాసమును కలుపుకునే కర్మఫలత్యాగ శబ్దము సంపూర్ణమైన, కర్మయోగ రూపమైన అర్థాన్ని వ్యక్తీకరిస్తుంది. అంతేకాక, కర్మ ఫలత్యాగము చేసే భక్తుడు త్యాగం చేస్తున్న ఆ ఫలాన్ని ఓ కర్మను చేసే పొందాడు కనుక, కర్మఫలత్యాగము అనే క్రియ కర్మ సంన్యాసమును కూడ అంగముగా కలిగి ఉంటుంది. ఈ విధంగా కూడ సహజంగానే కర్మ ఫలత్యాగము కర్మ సంన్యాసముతో కూడి సంపూర్ణ కర్మయోగమునకు ప్రతినిధిగా నిలుస్తుంది.
{పై చరణము ‘శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్’ అనే శ్రీమద్భగవద్గీత శ్లోకాన్ని అనుసరిస్తుంది. జ్ఞానయోగము, భక్తియోగము మరియు కర్మయోగములను ఈ శ్లోకంలో ఆరోహణా క్రమంలో భగవంతుడు చెప్తే బావుండేదని మనకనిపిస్తుంది. కారణమేమంటే, ఈ మూడు యోగములు ఆధ్యాత్మిక మార్గములోని మూడు క్రమబద్ధమైన సోపాన క్రమములను సూచిస్తాయి. ప్రత్యేకమైన ఈ మూడు సోపాన క్రమములను అవతార స్వరూపులైన శంకర, రామానుజ, మధ్వాచార్యులు ముగ్గురూ నొక్కి వక్కాణించారు.
ఈ ముగ్గురు అవతార స్వరూపులైన ఆచార్యులు జ్ఞాన యోగము, భక్తి యోగము, కర్మ యోగముల వరుస క్రమాన్ని అనుసరించి అవతరించి అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత సిద్ధాంత దర్శనములను వ్యవస్థాపించారు. కర్మ యోగమునకు బదులుగా కర్మ ఫలత్యాగమే భగవంతుని చేరుకొనడానికి చివరి మెట్టు అని మనం ఊహించిన దానికన్న విరుద్ధంగా భగవంతుడు పలికాడు – ఇది ముందు మనకు కలిగిన సందేహానికి మూలము. అందుకే, పై శ్లోకం ద్వారా ఆ సందేహానికి సమాధానము ఇచ్చి అర్థమును సమన్వయము చేయడం జరిగింది.}
దృష్టాన్తాభ్యాం త్యాగశాన్తిః ,
పూర్ణ త్యాగాత్ అధిక సుదామా ॥
రెండు ప్రాపంచికమైన దృష్టాంతముల ఆధారంగా, భక్తుని యొక్క కర్మ ఫలత్యాగమే అతని ఆధ్యాత్మిక ప్రయత్నములో పూర్ణ విరామమని చెప్పగలము. సక్తుప్రస్థుడు తను కర్మ చేసి పొందిన ఫలమును (ధనమును) భగవంతుని కొరకు సంపూర్ణ త్యాగము చేశాడు. కుచేలుడనబడే సుదాముడు సక్తుప్రస్థుడి కన్నా ఇంకా గొప్పవాడు. ఎందుచేతనంటే, తన వద్ద చిల్లిగవ్వ లేకున్నా, ప్రక్కింటివారి నుండి కొన్ని అటుకులు అప్పు తెచ్చి మరీ భగవంతుని కొరకు త్యాగం చేసాడు.
పైన ఉదాహరించిన మొదటి దృష్టాంతము, బొంబాయి వెళ్ళే ప్రయాణికుడి ప్రాపంచిక దృష్టాంతము వంటిది. ఆ వ్యక్తి బొంబాయి గురించి విని తెలుసుకోవడమే జ్ఞానయోగము. ఎలాగైనా ఆ నగరాన్ని చూడాలి అనే బలమైన మానసికమైన ఆకర్షణను పెంపొందించుకోవడమే భక్తియోగము. రైల్వే స్టేషనుకు చేరుకోవడం కర్మ సంన్యాస యోగమైతే, చివరగా, తన జేబులోని డబ్బు ఖర్చు పెట్టి బొంబాయికి టికెట్టు కొనడం కర్మ ఫల త్యాగ యోగము అవుతుంది. ఇక రెండవ ప్రాపంచిక దృష్టాంతము రుక్మిణి దృష్టాంతము వంటిది. ఆవిడ నారద మహర్షినుండి శ్రీకృష్ణుని యొక్క దైవికమైన గుణాలను తెలుసుకోవడమే జ్ఞానయోగము. తరువాత, శ్రీకృష్ణుని పట్ల రుక్మిణి తీవ్రమైన మానసిక ఆకర్షణను పెంచుకోవడమే భక్తియోగము. ఆ తరువాత, ఆవిడ శ్రీకృష్ణునికి ప్రేమలేఖ వ్రాసి ఒక బ్రాహ్మణునికి ఇచ్చి పంపడమేదైతే జరిగిందో, ఆ ప్రయత్నమే కర్మ సంన్యాస యోగము. అప్పగించిన పని పూర్తి చేసి బ్రాహ్మణుడు తిరిగి వచ్చిన తరువాత, అతనికి తన మెడలోని బంగారు హారమును రుక్మిణి బహుకరించడమే కర్మ ఫలత్యాగ యోగము. ఆధ్యాత్మిక మార్గములోని మూడు ప్రధాన సోపానములను అర్థం చేసుకోవడానికి ఈ రెండూ కూడ చక్కటి దృష్టాంతాలు. కర్మ ఫల త్యాగములోని చివరి దశను సక్తుప్రస్థుడు 100% మార్కులతో ఉత్తీర్ణుడైతే, సుదాముడు 100% కన్నా ఎక్కువ మార్కులు సంపాదించి ఉత్తీర్ణుడయ్యాడు.
శక్తిద్రవ్య భేదో బోధ్యః,
సర్వస్యాంఽశే న ధనాధిక్యమ్ ॥
తను ఏదో కర్మ చేసి, ఆ కర్మను భగవంతునికి సమర్పించి సేవించడమో లేక భగవంతుని కొరకై ఎంతో కొంత శక్తిని వినియోగించి సేవించడమో కర్మ సంన్యాసము అనబడుతుంది. E=mc2 అనే ప్రసిద్ధమైన భౌతిక శాస్త్ర సమీకరణం ఆధారంగా శక్తి మరియు ద్రవ్యములకు అంతః పరివర్తనీయత (inter-convertibility) కలుగుతుంది. చాలా శక్తి వినిమయమైతే అది అతి కొద్ది ద్రవ్యముగా రూపాంతరం చెందుతుందని ఈ సమీకరణము నిరూపిస్తుంది. కాబట్టి, ఆధునిక విజ్ఞానం ప్రకారం చూసినా, కర్మ సంన్యాసము కన్నా కర్మ ఫలత్యాగమే గొప్పది. అయితే, ఈ సిద్ధాంతములో, త్యాగం చేసిన ధనము యొక్క పరిమాణమే కర్మ ఫలత్యాగమనబడుతుందని పొరపాటు పడకూడదు. త్యాగం చేసిన ధనము యొక్క పరిమాణము అప్రధానము. తను కలిగియున్న పూర్తి ధనంలో ఎంత శాతం ధనాన్ని ఆ వ్యక్తి త్యాగం చేశాడన్నదే ప్రధానము.
ఒక బిచ్చగాడు తన సంపాదించుకున్న ఒకే ఒక్క రూపాయిని భగవంతునికై త్యాగము చేస్తే, అది 100% శాతం త్యాగం చేసినట్లవడం వలన అత్యంత గొప్ప త్యాగము అవుతుంది. వంద రూపాయలు కలిగిన ఒక ధనవంతుడు భగవంతునికి పది రూపాయలు త్యాగం చేస్తే అది తన కలిగిన డబ్బులో 10% శాతం మాత్రమే త్యాగం చేసినట్లవడం చేత చాలా చిన్నదైన కర్మ ఫలత్యాగమవుతుంది. అందువలన, భగవంతునికి ధనాన్ని సమర్పించడము (కర్మ ఫల త్యాగము చేయడం) చాలా గొప్ప త్యాగమైనా, బాగా డబ్బున్న ధనవంతుడినే భగవంతుడు అనుగ్రహిస్తాడని అపోహ పడరాదు. ఎందుకంటే, ఈ సిద్ధాంతమును మనకు ఉపదేశించి మన నుండి డబ్బు సంపాదించాలనుకోవడం భగవంతుని ప్రయత్నం కాదు. భగవంతుని పట్ల మన ప్రేమను నిరూపించకోవడానికి ఆధ్యాత్మికంగా ఇంతకన్న మరియొక గొప్ప మార్గం లేనే లేదు. కర్మ ఫలత్యాగం చేయగలిగితేనే భగవంతుని పట్ల ఎవరి ప్రేమైనా అంతిమ పరీక్షకు నిలబడుతుంది.