ఈర్ష్యాఽహంతా భంజక దత్త!
యజ్ఞోపనయౌ స్త్రీణామేవ! (పల్లవి)
జీవులలోని అసూయ, అహంకారాలను విచ్ఛిన్నం చేసే ఓ దత్తప్రభో! ఆశ్చర్యమేమంటే, నిజమైన యజ్ఞము మరియు నిజమైన గాయత్రీ ఉపనయన సంస్కారములను స్త్రీలే ఆచరిస్తున్నారు, పురుషులు కాదు.
పుంసాం నోభౌ స్వగర్త పతనాత్,
పాక యజ్ఞాత్ మధుర గానాత్ ॥
లింగ వివక్షతో కూడిన పురుషాధిక్యము మరియు అసూయ, అహంకారములతో పురుషులు, యజ్ఞ కర్మలు మరియు గాయత్రీ ఉపనయనముల నుండి స్త్రీలను బహిష్కరించి, తాము స్వయంగా యజ్ఞకర్మ-గాయత్రీ ఉపనయనములను చేసే యోగ్యత కోల్పోయారు. చివరకు పురుషులు తాము తీసుకున్న గోతిలో తామే పడ్డారు! నిజమైన యజ్ఞకర్మల అనుష్ఠానాన్ని వారు కోల్పోయిన కారణమేమంటే, ఆ యజ్ఞకర్మలలో ప్రధానంగా వినియోగం చేసే ఆహారాన్ని వారు వండరు, ఆ వండిన ఆహారమును ఆకలి గొన్నవారికీ పెట్టరు. నిజమైన గాయత్రీ ఉపనయనాన్ని వారు కోల్పోయిన కారణమేమనగా, భగవంతుని గుణగణములను కీర్తించే, భగవంతునికి దగ్గరగా చేర్చే మధురమైన గీతములను పురుషులు పాడరు. స్త్రీలు మాత్రమే ఈ రెండు కర్మలను నిష్ఠతో చేస్తారు కనుక వారే యజ్ఞకర్మలకు, గాయత్రీ ఉపనయనమునకు నిజమైన అనుష్ఠాతలు.
వేదో జ్ఞానం సర్వే జీవాః,
తదధికృతా నహి శబ్దో హ్యర్థః ॥
వేద శబ్దమునకు జ్ఞానమని అర్థము. కావున, కుల, లింగ, మత భేదం లేకుండ జీవులందరూ వేదజ్ఞానము తెలుసుకొనుటకు అర్హులు. వేదమంటే కేవలం శబ్దములు లేక శబ్ద ధ్వనులు అని అర్థము కాదు. విదుల్ (- జ్ఞానే) అనే మూల ధాతువుగల వేద శబ్దమునకు జ్ఞానమని అర్థము కనుక వైదిక శబ్దముల ద్వారా జ్ఞానమే వ్యక్తీకరించబడుతుందని పండితులు తెలుసుకోవాలి.
అవతార సత్య బోధ హననే,
ప్రాగపి సమా మూఢ గురూణామ్ ॥
తూర్పున ఉన్న మనకు, పశ్చిమ దేశాల వారికి మతపరమైన, సంస్కృతి పరమైన భేదాలు చాలా ఉన్నా కూడ ప్రాచ్యులమైన మనము పాశ్చాత్త్యదేశాల వారికంటె ఏమీ తీసిపోము. తూర్పు-పాశ్చాత్త్య దేశాలలో మూఢులైన, అజ్ఞానులైన పూజారులు, సత్యమైన ఆధ్యాత్మిక జ్ఞానమును బోధించడానికి వచ్చిన భగవంతుని నరావతారములను వధించాలని కుట్రలు పన్నారు.
పాశ్చాత్త్యములో (పశ్చిమమున), తమకు అమితమైన ఇబ్బందిని కలిగించే సత్యమైన ఆధ్యాత్మిక జ్ఞానమును పవిత్ర మత గ్రంథమునుండి నరావతారమైన ఏసుక్రీస్తు బోధించారని మూఢులైన పూజారులు ఆయనను హింసించి చంపినారు. అలానే, మన ప్రాచ్యములో (తూర్పున) వేదములోని సత్యమైన ఆధ్యాత్మిక జ్ఞానమును స్వామి దయానంద సరస్వతి బోధించి జీవుల అజ్ఞానమును దూరం చేస్తున్నారని ఆయనను మూఢులైన పూజారులు చంపివేసినారు.