home
Shri Datta Swami

Jump to Bhakti Ganga contents in — English  Telugu  Hindi

స్వమతం రాష్ట్రం సకృచ్చ దత్త!


స్వమతం రాష్ట్రం సకృచ్చ దత్త!
కేంద్ర ప్రభుతా విశ్వ మతం త్వమ్ ॥ (పల్లవి)

హే దత్తస్వామీ! ఎవరైనా తమ తమ మతములలో భక్తులుగా ఉంటూ అదే సమయంలో మీ బోధనలకు ప్రతీక అయిన “విశ్వ ఆధ్యాత్మికత” అనే మతంలో భక్తులుగా ఉండవచ్చు. ఒక దేశపౌరుడు ఒక ప్రత్యేకమైన రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో నివసిస్తూ అదే సమయంలో సార్వభౌమాధికారంతో కూడిన కేంద్ర ప్రభుత్వ పరిధిలో కూడా భారతీయునిగా పరిగణింపబడినట్లు, భక్తులు ఎవరికి వారు తమ తమ మతములలో ఉంటూనే విశ్వ ఆధ్యాత్మికతను అనుసరించవచ్చు. అందువలన రెండింటికీ విరోధమేమీ లేదు.

స్వమత ధ్యేయ ప్రేమ శ్లాఘ్యమ్ ।
నిందాఽన్యస్య స్వమతస్యైవ  ॥

భక్తుడు తన మతానికి చెందిన ఇష్టదైవాన్ని ప్రేమించవచ్చు, అది ప్రశంసనీయం కూడ. కాని, వేరే మతాల యొక్క భగవంతునికి చెందిన భిన్న రూపాలను నిందించరాదు. ఎందుకనగా, అటువంటి నింద తను అనుసరించే మతములోని భగవంతుడినే నిందించినట్లవుతుంది.

ఏకానూహ్యః సర్వ మతానామ్ ।
నానోపాధిః భిన్న వేషీ ॥

ముందు అలాగ చెప్పడానికి కారణమేమనగా, ఒకే నటుడు విభిన్న పాత్రలను పోషించినట్లుగా, ఒకే ఒక అనూహ్య పరబ్రహ్మతత్త్వము విభిన్న మతములలో విభిన్న అవతారములను ధరించి వచ్చును. కాబట్టి, నీవు ఒక పాత్రను దూషించి, వేరొక పాత్రను ప్రశంసించినట్లయితే నీకిష్టమైన పాత్రనే కాక నీకిష్టం కాని పాత్రను కూడ పోషించిన అదే నటుడి మనస్సును కష్టపెట్టినవాడవవుతావు.

చత్వర గమ్యే స్వగృహాత్ మార్గే ।
తిర్యక్ గమనం నోన్మాదః కిమ్ ॥

నాలుగు దిక్కులనుండి నాలుగు రోడ్లు వచ్చి కలవడం చేత ఏర్పడే నాలుగు రోడ్ల కూడలికి చేరుకోవడం నీ లక్ష్యమైనపుడు నేరుగా నీ ఇంటినుండి ఆ కూడలికి నడచి చేరుకోవడం శ్రేయస్కరము. కాని, వంకరగా నడచి వేరొకదిక్కున ఉన్న వేరే ఇంటికి చేరుకొని మరల అక్కడనుండి నీకు లక్ష్యమైన నాలుగురోడ్ల కూడలికి చేరే ప్రయత్నం చేయడం పిచ్చితనం కాదా?

గుణోఽవతారాత్ దోషో భక్తాత్ ।
సమానమేవ సర్వ మతేషు ॥

ఒక మతము పూర్తిగా మంచిది అని, మరియొక మతము పూర్తిగా చెడ్డదని నీవు పొరపాడు పడరాదు. అన్ని మతాలూ సమానమే, అలాగే, అన్ని మతాలలోనూ మంచీ-చెడులు ఉన్నాయి. నరావతారములో వచ్చిన భగవంతుడు ఒక మతమును స్థాపించి ఆ మతములో మంచి అనే గుణాన్ని కూడ స్థాపించగా తరువాత వచ్చి ఆ మతాన్ని అనుసరించిన కొంతమంది మానవులైన భక్తులు ఆ మతములో చెడుని ప్రవేశపెట్టారు.

కాబట్టి, ఒక మతము మంచిది, వేరొక మతము చెడ్డదని భావించి తన స్వమతమును మారే అవసరమే లేదు (స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః – శ్రీమద్భగవద్గీత). ఒక విషయముయొక్క దృష్టికోణంలో చూచినపుడు ఒక మతం చెడ్డదిగా  వేరొక విషయముయొక్క దృష్టికోణంలో చూచినపుడు వేరొక మతం చెడ్డదిగా కనిపించవచ్చు. పరమపూజ్య శ్రీ దత్తస్వామిచే స్థాపింపబడిన విశ్వ ఆధ్యాత్మిక మతము అన్ని మతములలోని గుణములను మాత్రమే కలిగియున్నది. కాబట్టి ఎవరు ఏ మతంలోనున్నా వారు తప్పక విశ్వ ఆధ్యాత్మిక మతంలో భాగమై నమోదు చేసుకోవాలి.

 
 whatsnewContactSearch