సృజంతం శాసంతం సంహరంతం
జగంతి సంతతం చింతయే శ్రీదత్తం తమ్ ।। (పల్లవి)
సమస్త లోకములను సృష్టించి, పరిపాలించి, విలయము చేసే శ్రీదత్తాత్రేయమూర్తిని నేనెల్లప్పుడూ ధ్యానిస్తాను.
యోగవిద్యా సత్య సారం బోధయంతం,
సత్య దర్శన లాలసానాకర్షయంతమ్ ।।1 ।।
యోగమనే శబ్దమునకు నిజమైన అర్థమును, యోగశాస్త్రము యొక్క సారమును బోధించినట్టి, పరమాత్మ యొక్క నిజమైన తత్త్వమును తెలుసుకోవాలనుకునే జీవులను తన అద్భుతమైన జ్ఞానముతో ఆకర్షించేటటువంటి సద్గురువైన శ్రీదత్తాత్రేయమూర్తిని నేనెల్లప్పుడూ ధ్యానిస్తాను.
మానవేభ్యో మానవాకృతిరవతరంతం,
అష్టసిద్ధిభి రాస్తికత్వం స్థాపయంతమ్ ।।2 ।।
మానవులు ఉద్ధరింపబడుటకు దయాసముద్రుడైన పరమాత్మ మానవులకు అతి అనుకూలమైన పాంచభౌతికమైన మానవ శరీరమునే ధరించి క్రిందకు దిగి వచ్చేటటువంటి, అష్టసిద్ధులు, అద్భుతమైన మహిమలను చేయడం ద్వారా లోకమునందు నాస్తికత్వమును పారద్రోలి మానవాతీతమైన పరమాత్మ తత్త్వమును తెలియచేసే ఆస్తికత్వమును వ్యవస్థాపింటేటటువంటి శ్రీదత్తాత్రేయమూర్తిని నేనెల్లప్పుడూ ధ్యానిస్తాను.