నమో నమో రాహు కేతుభ్యామ్ ।
రవి శశి గ్రాహకాభ్యామ్ ।
రాక్షస శరీరార్ధ భాగాభ్యామ్ ।। (పల్లవి)
అతి ప్రచండమైన తేజస్సుతో వెలిగే సూర్యుడిని, అతి ఆహ్లాదకరుడైనటువంటి చంద్రుడిని కూడ పట్టుకోగలిగే సామర్థం కలవారైనట్టి, ఒకే ఒక రాక్షస శరీరం - తల, మొండెమనే రెండు భాగములుగా ఖండింపబడి రాహువు, కేతువు అనే పేర్లతో వ్యవహరింపబడేటటువంటి వీరిద్దరికీ మరల మరల నమస్కారములు.
మహా సర్ప మస్తక కాయాభ్యామ్ ।
మహీవలయచ్ఛాయా గ్రహాభ్యామ్ ।
మహా మహా పరాక్రమాభ్యామ్ ।।1।।
ఖండించబడిన శరీరంలో మొండెము వేరై తలభాగం మాత్రం ఉన్న శరీరాన్ని రాహువు అని, మొండెము మాత్రము మిగిలిన శరీరాన్ని కేతువు అని పిలుస్తారు. గుండ్రంగా ఉన్న భూమి నీడ కూడ గుండ్రంగానే ఉండడం వలన ఆ భూమి నీడ చుట్టూ రాహు, కేతువులు పరిభ్రమణం చేయడం వలన ‘ఛాయా గ్రహములు’ అని పిలువబడతారు. అతి గొప్ప పరాక్రమం కలవారైన రాహు, కేతువులకు మరల మరల నమస్కారములు.
దుష్కర్మ ఫలదాన దూతాభ్యామ్ ।
దుర్జన గుణపరివర్తన దక్షాభ్యామ్ ।
దీన జనార్తి భక్తి దాయకాభ్యామ్ ।।2।।
జీవులు చేసే దుష్కర్మలకు వాటికి తగిన దుష్టమైన ఫలములనే ప్రసాదిస్తూ భగవంతుని దూతలుగా రాహు, కేతువులు వ్యవహరిస్తారు. దుర్మార్గ మార్గములో వెళ్తున్న జీవుల మనస్సులలోని దుర్భావనలను సద్భావనలుగా మార్చే శక్తిమంతులు రాహు, కేతువులు. దుష్కర్మ కారణంగా కష్టములు పొంది, ఆ కష్టం వలన దుఃఖము – ఆ దుఃఖము వలన కలిగే ఆర్తి ద్వారా మనస్సులో భక్తిని ఉత్పన్నం చేసే రాహు, కేతువులకు మరల మరల నమస్కారములు.
అపసవ్య జీవార్థమపసవ్య చరాభ్యామ్
తమో గుణ నాశాయ తమో గ్రహాభ్యామ్
అసురరూప జనార్థమసురాయితాభ్యామ్ ।।3।।
ప్రవృత్తిలో ధార్మిక మార్గములో వెళ్ళకుండా అపసవ్య మార్గములో వెళ్ళే జీవులను లొంగదీసుకునేందుకై తాము కూడ అపసవ్యంగానే రాహు, కేతువులు వెళ్తారు. జీవులలోని తమో గుణాన్ని నిర్మూలించడానికై వారు చేసే ప్రయత్నం వలన తమో గ్రహాలు అని కూడ వారు పిలువబడుతారు. రాక్షస ప్రవృత్తి కల జీవులను దండించి, ఉద్ధరించడానికై తాము కూడ రాక్షస వేషాన్ని ధరించిన రాహు, కేతువులకు మరల మరల నమస్కారము.
కయా నశ్చిత్రకేతుం కృణ్వన్మంత్ర మందిరాభ్యామ్ ।
మాషపూప-కుళుత్థపాక దాన ప్రశమితాభ్యామ్ ।
భానువాసర నాగరూప స్కంద పూజాప్రియాభ్యామ్ ।।4।।
‘కయా నశ్చిత్ర ఆభువదూతీ సదావృధః సఖా । కయా శచిష్ఠయా వృతా’ అనే వైదిక మంత్రంతో రాహువును, ‘కేతుం కృణ్వన్న కేతవే పేసో మర్యా అపేశసే । సముషద్భిరజాయత’ అనే వైదిక మంత్రంతో కేతువును పూజిస్తారు. దుష్కర్మ ఫలముల చేత తీవ్రంగా బాధపడే జీవులు నూనెలో చక్కగా వేయించిన మినప గారెలను (లేదా మినపలడ్లను) రాహువు కొరకు, అలాగే ఉలవలతో చేసిన వంటకమును కేతువు కొరకు బీదవారికి దానం చేసినట్లయితే వారిద్దరూ ప్రసన్నులౌతారు. ప్రత్యేకంగా ఆదివారం నాడు నాగరూపంలో వెలసి ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వలన అతి ప్రీతిని పొందే రాహు, కేతువులకు మరల మరల నమస్కారము.
పరమపద సోపానమార్గ పరీక్షా పన్నగాభ్యామ్ ।
కుటిల కుండలినీ వృత్తి భుజగీశాసకోరగాభ్యామ్ ।
కష్టప్రదాన పరిణతి పరిణామ మోక్షప్రదాభ్యామ్ ।।5।।
వైకుంఠపాళి లేక పరమ పద సోపాన పటము అనబడే ఆటలో ఆట ఆడే వారి అదృష్టమును (యోగ్యతను) మరల మరల రాహు, కేతువులు పరీక్షిస్తారు. కుటిలమైన కుండలిని అనబడే మనస్సు యొక్క వృత్తియే సర్పముగా భావించినట్లయితే, అటువంటి సర్పరూప కుండలినికి శాసకులైనటువంటి వారు రాహు, కేతువులు. కర్మ ఫలములను అనుసరించి జీవులకు కష్టములనిచ్చి తద్ద్వారా వారి ఆధ్యాత్మిక మార్గములో మానసిక పరిణతి కలిగించి చివరకు జీవులకు మోక్షాన్నే అనుగ్రహించే రాహు, కేతువులకు మరల, మరల నమస్కారము.
దుర్గుణ శమన ధర్మమార్గ ప్రవృత్తి కారకాభ్యామ్ ।
మహార్తి భవ పరమ భక్తి నివృత్తి దాయకాభ్యామ్ ।
దుష్ట భూయిష్ఠ కలియుగ సర్వజన గురువరాభ్యామ్ ।।6।।
రాహు, కేతువులిద్దరూ జీవులలోని దుర్గుణములను నిర్మూలించి ప్రవృత్తిలో ధార్మిక మార్గమును అనుసరించే విధంగా ప్రేరేపిస్తారు. కష్టములచే కలిగిన అతి గొప్ప ఆర్తి చేత భక్తి మార్గమున ప్రవేశింపచేసి, జీవులకు దుర్లభమైన ఆధ్యాత్మిక నివృత్తి మార్గమును ప్రసాదిస్తారు. కలియుగంలో మోసము, దుర్మార్గము, స్వార్థము వంటి గుణములతో కూడిన జీవులతో నిండిన భూమిపై సర్వ జనులకు సత్యబోధ చేసేటటువంటి గురువులైన రాహు, కేతువులకు మరల మరల నమస్కారము.