బ్రహ్మవిష్ణుశివాఖ్యానాం మూర్తీనాం మూలహేతవే ।
త్రిమూర్తిముఖపద్మాయ దత్తాత్రేయాయ తే నమః ।।1।।
సమస్త జగత్తుల సృష్టి, స్థితి మరియు లయములను చేసే త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు మహేశ్వర మూర్తులకు మూలమూర్తియైనట్టి, మూడు ముఖ పద్మములతో విరాజిల్లేటటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామికి భక్తితో కూడిన నమస్కారములు.
అరుణశ్యామధావళ్య – వర్ణమిశ్రమవర్ణినే ।
అనసూయైక భాగ్యాయ – దత్తాత్రేయాయ తే నమః ।।2।।
ఎరుపు, నీలము మరియు తెలుపు రంగుల కలయికలో ఏర్పడే ఒక అతి సుందరమైన శరీరకాంతితో ప్రకాశించేటటువంటి తన తపస్సు ఫలమైన అదృష్టంగా అనసూయా మాతకు మాత్రమే దక్కినటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామికి భక్తితో కూడిన నమస్కారములు.
శంఖం చక్రం త్రిశూలం చ ఢక్కామపి కమండలుమ్ ।
బిభ్రతే ఽక్ష స్రజం హస్తైః దత్తాత్రేయాయ తే నమః ।।3।।
తన ఆరు చేతులలో శంఖము, చక్రము, త్రిశూలము, ఢక్కా, కమండలము, జపమాలలను చక్కగా ధరించి దర్శనమిచ్చేటటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామికి భక్తితో కూడిన నమస్కారములు.
కుర్వతే భావమాత్రేణ సృష్టి స్థితి లయానపి ।
సర్వదేవ స్వరూపాయ దత్తాత్రేయాయ తే నమః ।।4।।
కేవలం సంకల్పమాత్రం చేతనే సమస్త జగత్తుల సృష్టిని, స్థితిని మరియు వాటి లయములను చేయగలిగినటువంటి, సమస్త దేవతా మూర్తుల స్వరూపమైనటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామికి భక్తితో కూడిన నమస్కారములు.
గురూణాం గురురాజాయ శ్రుతీనాం శ్రుతయేఽపి చ ।
శాస్త్త్రాణామపి శాస్త్రాయ దత్తాత్రేయాయ తే నమః ।।5।।
లోకంలో మహా మహా గురువులకే గురువైనటువంటి, అత్యంత ప్రామాణికమైన వేదములకే వేదమైనటువంటి, సమస్త శాస్త్రములకే శాస్త్రమైనట్టి శ్రీ దత్తాత్రేయ స్వామికి భక్తితో కూడిన నమస్కారములు.
బాలోన్మత్తవదీక్ష్యాయ సర్వలీలా విహారిణే ।
అవధూతైక లక్ష్యాయ దత్తాత్రేయాయ తే నమః ।।6।।
శ్రీ దత్తాత్రేయ స్వామి కొన్నిసార్లు కుర్రవానిలాగ, కొన్నిసార్లు పిచ్చివానిలాగ కనపడతారు. స్వామి తనచే అవలీలగా చేయగలిగే లీలా ప్రపంచములో ఎల్లపుడూ విహరిస్తూ ఉంటారు. అవధూతగా ఉంటూ లోకంలోని జీవులకు కుల, మతాది భేదములు లేకుండ, ధార్మికమైన ప్రవృత్తి మార్గముతో పాటు నివృత్తి ధర్మమును కూడ బోధించే శ్రీ దత్తస్వామికి భక్తితో కూడిన నమస్కారములు.
కరుణావాహినీమూల – వాత్సల్యార్ణవ చక్షుషే ।
ఆహ్వానాదేవ దృష్టాయ దత్తాత్రేయాయ తే నమః ।।7।।
శ్రీ దత్తస్వామి యొక్క అందమైన కన్నులనుండి భక్తులపై వాత్సల్యముతో దయ ధారలుగా వర్షింపబడుతూ ఉంటుంది. నిజానికి స్వామియే కరుణకు సముద్రము వంటివాడు. ప్రతిఫలాపేక్ష లేక అత్యంత భక్తితో తలచినంతనే భక్తులకు అనువైన రూపంలో దర్శనమిచ్చే శ్రీ దత్తస్వామికి భక్తితో కూడిన నమస్కారములు.
శ్రితానుద్ధర్తుకామాయ కలౌ సర్వగతాయ చ ।
సాధ్యాసాధ్యాని దదతే దత్తాత్రేయాయ తే నమః ।।8।।
తన పాదములను భక్తితో ఆశ్రయించిన భక్తులను కాపాడి, వారిని ఉద్దరించేటటువంటి, తన సర్వశక్తిమత్వ సామర్థ్యము వలన ఈ కలియుగములో కూడ ఏ రూపమైనా ధరించి ఎక్కడికైనా వెళ్ళగలిగేటటువంటి, నిజమైన భక్తులు కోరెడి సాధ్యములైన కోరికలనే గాక తీర్చడానికి సాధ్యము కానటువంటి కోరికలను కూడ తీర్చేటటువంటి శ్రీ దత్తస్వామికి భక్తితో కూడిన నమస్కారములు.
ఫలశ్రుతిః
శ్రీ దత్తాత్రేయ దేవస్య పుణ్యం కృష్ణ కృతాష్టకమ్ ।
పఠతాం స్యాదిహాముత్ర ఫలమీప్సిత మక్షయమ్ ।।
ఎవరైతే కృష్ణుడు (శ్రీశ్రీశ్రీ జన్నాభట్ల వేణుగోపాల కృష్ణమూర్తి) వ్రాసిన ఈ శ్రీ దత్తాత్రేయ స్వామి అష్టకాన్ని భక్తితో చదువుతారో వారికి స్వామి పుణ్యాన్ని ప్రసాదించడమే గాక శరీరంతో ఉన్నపుడు ఈ లోకంలోను, శరీరం వదలిన తరువాత పై లోకాలలోనూ ఎన్నటికీ నశించనటువంటి అక్షయమైన గొప్ప ఫలాన్ని అనుగ్రహిస్తారు.