బ్రహ్మ దత్త కీర్తనలు
బ్రహ్మ గాయత్రి (స్వామి వాణి)
గాయత్రి అనగా గానాత్మకమైనది. మంత్రము అనగా మననమునకు అప్రయత్నముగా ఆకర్షించి పదే పదే ఉచ్ఛరింపచేయునది. "గాయత్రీ ఛన్దః" అన్నాము. అనగా గాయత్రి అను పేరు ఛందస్సు పేరు. ఉత్పలమాల, చంపకమాలయను ఛందోనామములవంటిదే. ఈ ఛందస్సులో పాడబడిన దేవత ఎవరు? సవితా దేవతా అన్నాము. సవితయే దేవత. సవిత అనగా చరాచర జగత్తును ప్రసవించు (సృష్టించు) వాడని అర్ధము.అనగా బ్రహ్మదేవుడని అర్ధము. గాయత్రి, సావిత్రి, సరస్వతి అను మూడు సంధ్యాకాల దేవతలే బ్రహ్మదేవుని భార్యలని బ్రహ్మ పురాణము. బ్రహ్మగాయత్రి అనగా-దేవతయగు బ్రహ్మదేవుడు గాయత్రి ఛందస్సులో గానము చేయబడిన వాడని అర్ధము. చంపకమాల ఛందస్సులో కృష్ణుడు కీర్తింప బడినచో ఆ పద్యార్ధము కృష్ణుడా? లేక చంపకమాలయను దేవతయా? అట్లే గాయత్రి ఛందస్సులో కీర్తింపబడిన బ్రహ్మదత్తుడే దేవతకాని, గాయత్రి యను దేవత కాదు. దేవతను విస్మరించిన మంత్రము వ్యర్ధము కావున బ్రహ్మతేజస్సు అంతరించినది. మనస్సు-బుద్ధి-వాక్కులకు, పూజలకు బ్రహ్మము అందదు. అనగా పూజ లేనిది అని కాదు. జగత్తు యొక్క సృష్టి, స్ధితి, లయములను చేయు దత్తుడే బ్రహ్మము. ఆదత్త బ్రహ్మమే త్రిమూర్తి వేషములలోనున్నది.
పరబ్రహ్మపరమై, గానాత్మకమై, మనస్సును ఎట్టి ప్రయత్నము లేక ఆకర్షించి పదే పదే ఉచ్ఛరింపచేయునది ఏదియైనను గాయత్రీ మంత్రమేనని శ్రీదత్త మతము.