home
Shri Datta Swami

Jump to Bhakti Ganga contents in — English  Telugu  Hindi

కృష్ణ కీర్తన (ఋషివరాణాం)


 

శ్రీ దత్త భగవానుని షోడశ కళలతో అవతరించిన పరబ్రహ్మమే శ్రీ కృష్ణ పరబ్రహ్మము.  అందులకే శ్రీ కృష్ణ భగవానుల అవతారమును పరిపూర్ణ తమావతారముగా వర్ణించుట జరిగినది.

శ్రీ వేణు గోపాల కృష్ణాయ వందనమ్ । శ్రీ వేణు గోపాల కృష్ణాయ వందనమ్ । (పల్లవి)
శ్రీ వేణు గోపాల కృష్ణమూర్తికి వినమ్ర నమస్కారము.

1. ఋషివరాణాం మానసాఽలోల హంసాయ। మకుటాన్త మాయూర పిఞ్ఛాఽవతంసాయ।
ఏకప్రహారేణ విధ్వస్త కంసాయ। శ్రీ వేణు గోపాల కృష్ణాయ వందనమ్‌ ॥౧॥

ఋషి శ్రేష్ఠుల మానస సరోవరాలలో హంస వలె విహరిస్తున్న, కిరీటమందు నెమలి పింఛమును అలంకారముగా ధరించిన, తన మేనమామ యైన  కంసుడనే  రాక్షసుడిని ఒకే ఒక్క పిడికిలి గుద్దుతో సంహరించిన శ్రీ వేణు గోపాల కృష్ణమూర్తికి వినమ్ర నమస్కారము.

2. వ్యత్యస్త విన్యస్త పాదాఽరవిందాయ । మధురాఽమృతాసార మురళీ నినాదాయ ।
జాజ్వల్యమానాంఽశు పీతామ్బరాఽఙ్గాయ । శ్రీ వేణు గోపాల కృష్ణాయ వందనమ్‌ ॥౨॥

పద్మముల వంటి పాదములను ఒకదానిపై మరొకటి ఒంపుగా ఆన్చి, తన మురళీ గానంతో మధురామృతములను వర్షిస్తూ, ధగద్ధగాయమానంగా ప్రకాశించే పట్టు పీతాంబరములను ధరించిన శ్రీ వేణు గోపాల కృష్ణమూర్తికి వినమ్ర నమస్కారము.

3. ఆకర్ణ తేజస్వి మీనాయతాఽక్షాయ। ప్రత్యూష పద్మాంఽశు నేత్రచ్ఛద యుగాయ।
కమల లోచన కాన్తి సంమోహనాఽస్త్రాయ। శ్రీ వేణు గోపాల కృష్ణాయ వందనమ్‌ ॥౩॥

చెవుల వరకు వ్యాపించి మెరిసే చేపల వంటి చక్కటి తేజస్సుతో కూడిన నేత్రములు కలిగి, ప్రభాత కాలంలో విచ్చుకునే ఎఱ్ఱ తామర రేకుల వంటి కనురెప్పలు కలిగి, పద్మ బాణముల వంటి చూపులతో సమస్త జీవులకు సంమోహనము కలిగించే శ్రీ వేణు గోపాల కృష్ణమూర్తికి వినమ్ర నమస్కారము.

4. ఆముక్త ముక్తావళీ జాలహారాయ। గోపీ దధి క్షీర నవనీత చోరాయ।
బృందావనే వల్లవీ బృంద జారాయ। శ్రీ వేణు గోపాల కృష్ణాయ వందనమ్‌॥౪॥

శరీరమందు అనేక ముత్యాల హారములు ధరించినట్టి, గోపికల ఇండ్ల నుండి పాలు, పెరుగు, వెన్నలను దొంగలించినట్టి, బృందావనం లోని గోపికలకు అత్యంత ప్రియుడైనట్టి శ్రీ వేణు గోపాల కృష్ణమూర్తికి వినమ్ర నమస్కారము.

5. సాయంతనే ధేను బృందాఽనుగమనాయ। మార్గమధ్యే వల్లవీ కుంచితాక్షాయ।
రాధా జగన్మోహినీ మోహనాయ। శ్రీ వేణు గోపాల కృష్ణాయ వందనమ్‌॥౫॥

సాయం సమయమందు ఆవుల మందలను అనుసరిస్తూ, మధ్యలో కనిపించిన గోపికలకు ఎడమ కన్ను కొడుతూ, జగన్మోహిని యైన రాధకే సంమోహనాన్ని కలిగిస్తున్న శ్రీ వేణు గోపాల కృష్ణమూర్తికి వినమ్ర నమస్కారము.

6. కాళీయ ఫణి ఫణా సంక్షోభ నటనాయ। కాంచీ క్వణత్కింకిణీ నిస్వనాయ।
గోవర్ధనోద్ధరణ లీలా స్మితాఽస్యాయ। శ్రీ వేణు గోపాల కృష్ణాయ వందనమ్‌॥౬॥

అత్యంత విషపూరితమైన కాళీయుడనే మహా సర్పము యొక్క పడగలపై నాట్యం చేసి, ఝల ఝల ఝలమనే అందమైన శబ్దము చేసే మువ్వలను బంగారు కటిసూత్రమందు ధరించి, గోవర్ధనమనే మహా పర్వతమును తన చిన్ని చిటికెన వేలుపై మ్రోస్తూ కూడ చిరునవ్వులు చిందించే శ్రీ వేణు గోపాల కృష్ణమూర్తికి వినమ్ర నమస్కారము.

 7. కస్తూరికా తిలక రేఖా లలాటాయ। తులసీ స్రగామోద వక్షః కవాటాయ।
పార్థాయ విశ్వ రూపాలోల ఖేటాయ। శ్రీ వేణు గోపాల కృష్ణాయ వందనమ్‌॥౭॥

నుదుటిపై కస్తూరి పుండ్రమును నిలువుగా ధరించినట్టియు, శృంగారమునకు ద్వారమా అనెడి తన వక్షః స్స్థలమందు సుగంధంతో కూడిన తులసిమాలలు ధరించినట్టియు, తన యందే సమస్త భువన భాండములు అర్జునునకు ప్రదర్శించినట్టి శ్రీ వేణు గోపాల కృష్ణమూర్తికి వినమ్ర నమస్కారము.

8. శ్రీ రుక్మిణీ సత్యభామా సమేతాయ। గోపీ సహస్రేణ సంవేష్టితాఽఙ్గాయ।
రాసే రసే సర్వదా సద్వినోదాయ। శ్రీ వేణు గోపాల కృష్ణాయ వందనమ్‌॥౮॥

తన రెండు ప్రక్కల రుక్మిణి, సత్యభామలను కలిగినట్టి, ఐక్య బుద్ధితో ఆశ్రయించిన వేయి మంది గోపికలను తన చుట్టూ కలిగినట్టి, బృందావనంలో రహస్యంగా చేసే రాసకేళి యందు ఎల్లపుడు ప్రీతిని కలిగినట్టి శ్రీ వేణు గోపాల కృష్ణమూర్తికి వినమ్ర నమస్కారము.

 
 whatsnewContactSearch