home
Shri Datta Swami

Bhakti Ganga (Devotional Songs) — English  Telugu  Hindi

శ్రీ మహాలక్ష్మి స్తుతి


 (భృగుమహర్షి నారాయణుని హృదయంపై పాదఘాతము చేయుటతో కోపగించిన, దుఃఖితురాలైన శ్రీ మహాలక్ష్మి వైకుంఠం వీడి భూలోకంలోకి దిగివచ్చి కొల్హాపురం చేరుట.)

దిగివచ్చినదే మంగళ దేవత - వైకుంఠము వీడి వసుధకు రుసరుస
తన తండ్రి భృగువు తన్నగ నల్లుని - ఉరమున, ఉడికిన ఉద్రేకముతో (పల్లవి)

1.  చెంపల చారెడు కన్నులు నిండిన - అశ్రువులొలకగ పెద్ద ముత్తెములు |
పద్మా పద్మా యను పద్మాక్షుడు - వెంటబడి వెనుక ఆహ్వానించిన ||

2.  ఘల్లు ఘల్లుమని కాలి అందెలును - మధురధ్వనులను పలుకుచుండగా |
హంసయానమున దిగిదిగి వచ్చెను - మేఘ మార్గమున తారలు చెదరగ ||

3.  విడివడిన కురుల విదలింపులతో - వడి వడి నడకల వేడి వేడిగను |
నిశ్వాసములకు వాడిపోవగా - అధర పల్లవము పన్నుల నొక్కుచు ||

4.  ముఖమున ఎర్రని తళతళకాంతుల - స్వేద బిందువులు జాలువారగా |
బాల భాస్కరుని కిరణములొప్పగ - సంధ్య కాంతివలె శోభిల్లె పద్మ ||

5.  బంగారుగాజులెగురగ గలగల - చేతుల నూపుచు బంగారుబొమ్మ |
ఆ పద్మ నడవ అరవిందాక్షుడు - అల్లాడె వెనుక పరుగుల నెత్తుచు ||

6.  కనక హారములు కులుకుల నడకల - గలగలలాడుచు గంతులేయగా |
కమలా దేవత కదలి వచ్చెగా - కమలలోచనుడు కమిలి పోయెనే ||

7.  ఆగు ఆగు మని అర్ధించుచున్న - అంతకంతకును వేగము హెచ్చగ |
పద్మ నడచెనే పురుషోత్తముడదె - పరుగునవచ్చును వనమాల యెగుర ||

8.  సాత్త్విక గుణవతి శాంతరూపిణివి - ఇంత ఆగ్రహము నీకేల దేవి ! |
నీ తండ్రి భృగువు నా తండ్రి సముడె - చరణ స్పర్శయు ఆశీర్వచనమె ||

9.  ఇట్లు మాధవుడు వచించుచున్నను - పద్మకు దుఃఖము పొంగుచు పొరలెను |
భర్తమాత్రమే కాదు  హరితనకు - భగవంతుండును పాద దాసిగా ||

10.  మణిపూర చక్ర మతిక్రమించిన - శ్రీ మహాలక్ష్మి తండ్రి బంధమును |
లెక్కసేయకే పరమాత్ముడినే - సర్వాధికునిగ తలచిన ధన్యయె ||

11.  వినదాయె పద్మ వేయి చెప్పినను - పరమాత్మ పరాభవమును సహింప |
ఓర్వగ లేకయె ఏడుపు కోపము - మిశ్రమమై మది కల్లోలమయ్యె ||

12.  అదిగోవచ్చును అరవిందాసన - అందాల  రాశి ఆవేశముతో |
అంబర వీధిని సప్త మహర్షులు - ప్రణమిల్లుచున్న అవలోకించదు ||

13.  హరిపద సంభవ ఆకాశగంగ - హరి పదముల బడి సవ్వడి పొందుచు |
అలలతో జెప్పు ఆగుమమ్మయని - అలివేణి పద్మ ఆగదు క్షణమును ||

14.  తెల్లని గంగా జలముల నడచెడి - ఎర్రని పద్మా సతి ఖేచరులకు |
ముత్యాలసరము మధ్యమాణిక్య - మొకటి చలించెడి రీతి జూపట్టె ||

15.  వడివడి హరిపద వేగముతనలో - నవనవ వీచికలుప్పతిలఁజేయ |
పద్మాపదముల తాకుచు పలికెను - హరి అభ్యర్ధన నందించు గంగ ||

16.  కానీ పద్మా పదముల వేగము - తాకిడితో తన అలలు వెనుదిరిగి |
పద్మ నిశ్చయము నందించ హరికి - మధ్యదూతివలె మందాకినియగు ||

17.  భూలోక జనుల దరిద్రమంతము - చేయగ సమయము ఆసన్నమయ్యె |
పద్మా చరణము లవనిని తగిలెను - సకల సౌభాగ్య సంపత్కరములు ||

18.  భూదేవి సవితియైనను పదముల - సవితి తాకినను ఆనందించెను |
అష్టైశ్వర్యములవనిని పొందగ - పద్మను నమస్కరించె భక్తితో ||

19.  నడుచుచున్నదే నారాయణియదె - కొల్హాపురమున తపమును చేయగ |
దైవావమాన తాపముతనలో - కోపకారణము అరుణ రూపమై ||

20.  మంగళ దేవత చరణమార్గమున - పూలను రాల్చెను వనములతరువులు |
తల్లి పాదములు కందిపోవునని - ముందుగ పవనుడు ఊడ్చి వేయగా ||

21.  బంగారురంగు తామ్రాంచలమగు - హరికిష్టమైన చీరను కట్టిన |
మంగళ దేవత పసుపు కుంకుమము - మేళవించినటు తోచుచున్నదే ||

22.  మధుసూదనసతి మానవతీమణి - ఆత్మావమాన  హేతువు కాదది |
తండ్రిపాదమును బిడ్డ ఒప్పదా - స్వామి పరాభవమోర్వలేదాయె ||

23.  ఎంతటి భక్తియొ ఆలోచింపుము - తండ్రికి తనకును మించి దైవమట |
పరమ భాగవత భక్తాగ్రేసర - స్వామి పదసేవ నెప్పుడు విడువదు ||

24.  ఆభక్తిమెచ్చి సర్వసృష్టికే - తన సంపదకే అధిదేవతగా |
హరియుచేసెనే ఆ సతీమణిని - హృదయ దేవతగ ధరించె పద్మను ||

25.  పద్మ పోవగా నారాయణుడదె - నళిన నేత్రముల భాష్పధారలను |
కురియుచు పరుగిడు పద్మనామమును - ఎలుగెత్తి పిలుచు ఏడ్చుచు పెద్దగ ||

26.  తండ్రి కన్నను స్వామియె ఎక్కువ - భక్తులకన్నది దక్షయాగమున |
నిరూపించెనే ఆ సతీదేవి - సతియన పద్మయె శివుడన హరియె ||

27.  కొల్హాపురమున పద్మాసనమున - యోగనిష్ఠలో కుర్చుండె పద్మ |
అగ్నిగఁదోచును క్రోధ కాంతియదె - యోగాగ్ని మధ్య సతివలె పద్మయు ||

28.  అశ్రుధారలను ఆపగ లేనివి - కన్నుల మూసెను ధ్యానించు హరిని |
పద్మను పోలిన భక్తులెవ్వరే - భువనములందున సర్వోత్తమయే ||

29.  మంగళ దేవత ! వందనమమ్మా - నారాయణి ! యివె నమస్కారములు |
స్వార్ధ దరిద్రము పోగొట్టుమమ్మా - భక్తి సంపదను మాకిమ్ముతల్లీ ! ||

 
 whatsnewContactSearch