బ్రహ్మోత్సవాల ఊరేగు పరబ్రహ్మమును చూడగ రారండి
చతుర్దశ భువన వాసులారా ! (పల్లవి)
1. ఏడు కొండలవె ఎంతో ఎత్తుగ - నీల గగనమును చుంబించునెపుడు |
నీలమేఘరుచి సంభ్రమ మతులై - నీలవర్ణుడగు స్వామియనిఁ దలచి ||
2. కనక తోరణములుజ్జ్వల దీపము - లుత్తుంగ రధము భక్తార్ణవమదె |
అడుగో రధమున గరుడుడు మూపున - అడుగో అడుగో అరవిందాక్షుడు ||
3. రాజాధిరాజ పదవులున్నను - కోట్ల కోట్లకును పడగ లెత్తినను |
పగ్గముల బట్టి రధమును లాగుచు - స్వామి బండి పశు పదవికి పరుగులు ||
4. అదృశ్య రూపులు ఇంద్రాది సురలె - రధమును లాగుచు స్వామి సేవలకు |
తోసుకతోసుక పరుగులెత్తుదురు - ఈ నర చీమలు స్వామి ముందెంత? ||
5. సప్తమహర్షులు కనక కమలముల - పదములనుంచుచు అర్చించుచుండ |
అర్చకులారా ! ఓ నరులారా ! - మీరెంత తెలిసి వినయమునుండుడు ||
6. కసరబోకుడీ భక్తుల నెవరో - ప్రహ్లాదుడో మరి తిన్నడో ఉండును |
స్వామి మనమునకు ఖేదము కలుగును - తనకన్న భక్తులెక్కువ స్వామికి ||