(సతీదేవి అగ్నికి ఆహుతి కాగా శివ భగవానుడు తాండవము చేసి క్రోధాగ్ని ఉట్టిపడ వీరభద్రుని సృజించి యజ్ఞమును ధ్వంసము చేయనియోగించగా శ్రీ వీరభద్రుని విజృంభణ).
జయ జయ రుద్రావతార హే వీరభద్ర నీ కెదురివ్వరిలన్ (పల్లవి)||
1. ఉగ్రుని ఉగ్రమె వీరభద్రునిగ ఆకృతి దాల్చగ నృత్యములో |
రంకెలు వేయుచు గంతుల నెగురుచు ఖడ్గము త్రిప్పుచు హస్తముతో |
బయటకు వచ్చెను పింగళజటలవె ప్రళయాగ్ని శిఖలు తోచెడిగా |
జయ జయ రుద్రావతార హే వీరభద్ర! నీ కెదురివ్వరిలన్ ||
2. ప్రళయపయోధర కులములు నొకపరిచేరుచు నురిమిన శబ్దముతో |
పటుతర గర్జనలోప్పగ 'దక్ష పిపీలికమా! ఎటనుంటివిరా ' ? |
అనుచుచు కేకల వేయుచు గగన పధంబున ప్రస్థితుడైతివిగా |
జయ జయ రుద్రావతార హే వీరభద్ర! నీ కెదురివ్వరిలన్ ||
3. పదపద ఘాతమునందున మేఘము లెగురగ నక్షత్రంబులవే |
ధూళి కణంబులుగా పైకెగురుచు తారాథూమములుప్పతిలన్ |
భగ భగ మండెడి విస్ఫులింగములు కన్నుల వర్షముగా కురియన్ |
జయ జయ రుద్రావతార హే వీరభద్ర! నీ కెదురివ్వరిలన్ ||
4. నిను తిలకించిన దేవగణంబులు మునులును పరుగులు తీసిరిగా |
అదియె మహా ప్రళయంబదె వచ్చె నటంచుచు కేకలతో దిశలన్ |
మెలిదిరిగిన మీసములె కత్తులుగా ముఖమందున భీకరముల్ |
జయ జయ రుద్రావతార హే వీరభద్ర! నీ కెదురివ్వరిలన్ ||
5. ఋషులను సురలను పాదఘాతములఁ దన్నుచు వచ్చిన పాపముకై |
శివరహితంబగు క్రతువును చేయగ ఎంత పొగరనుచు గర్జనతో |
క్రతువున వెలిగెడి అగ్ని గుండమున ఉమ్మి వేసియట నార్పితివే |
జయ జయ రుద్రావతార హే వీరభద్ర! నీ కెదురివ్వరిలన్ ||
6. దక్షుని శిరమును తెంచితివచ్చట ఖడ్గముతో నావేశముతో |
ఛీ ఛీ తుచ్ఛాయని గాండ్రించుచు వ్యాఘ్రమురీతిగ దూకులతో |
ఉగ్ర విహారము చేయగ బ్రహ్మయు, హరియు నుతింప నిలచితివే |
జయ జయ రుద్రావతార హే వీరభద్ర! నీ కెదురివ్వరిలన్ ||
7. హే! కరుణార్ణవ ! దక్షుని జీవము నిచ్చితివప్పుడు శాంతుడవై |
విధి హరి యాచన మన్నించితివే దయతో నీ పదమందు పడన్ |
మేషముఖుండగు దక్షుడు నిన్ను నుతించగ వీరేశ్వర శరభా ! |
జయ జయ రుద్రావతార హే వీరభద్ర! నీ కెదురివ్వరిలన్ ||
8. హే! కరిమర్దన ! హే క్రతుఖండన ! హే విషకంధర! నందిపతే |
హే! శశిశేఖర! హే ఫణిభూషణ ! హే కాలాంతక! స్కందగురో |
హే ! వీరేశ్వర ! హే పరమేశ్వర ! హే లయ తాండవ ! ప్రమధపతే! |
త్వాం ప్రణమామి మహేశ్వర ! శంకర ! పాలయ కింకర మీశ్వరమామ్ ||
వీరంభజే - వీరభద్రం భజే
వీరంభజే - వీరభద్రం భజే - రౌద్ర వికటాట్టహాసంభజే
కాళీపతే - భద్రకాళీపతే - రౌద్ర వికటాట్టహసంభజే
శ్రీ భద్రకాళీ సహితం వీరభద్రం నమామ్యహమ్ |
కులదేవం ప్రసూతాత రూపాన్తర మివస్ధితమ్ ||