శివుని లింగము - భవుని లింగము | హరుని లింగము - ఆత్మలింగము
అదిగో చూడుడు - అనుభవించుడు | అమర దుర్లభా - నంద ముక్తిని | (పల్లవి)
1. సృష్టిపాలన ప్రళయమూలము - ఆదిదేవుని ఆత్మలింగము |
అద్భుతంబగు శుద్ధతేజము - దేవదేవుని ఆత్మలింగము ||
2. ఆ మృకండుజ ప్రాణదానము - అమరనాధుని ఆత్మలింగము |
మృత్యుదేవుని ప్రాణఘాతము - కాలకాలుని ఆత్మలింగము ||
3. చంద్రరేఖను కల్గినట్టిది - పార్వతీపతి ఆత్మలింగము |
మూడు అడ్డపు భస్మరేఖల - నీలకంఠుని ఆత్మలింగము ||
4. గంగ జలముల సదభిషిక్తము - గరళ కంఠుని ఆత్మలింగము |
మధ్య కుంకుమ భ్రాజమానము - వామదేవుని ఆత్మలింగము ||
5. సృష్టి చేయగ ప్రధమకామము - సుందరేశ్వరు ఆత్మలింగము |
శక్తి రూపము సత్తరంగము - సంగమేశ్వరు ఆత్మలింగము ||
6. వేద జలధుల మధన దక్షము- కాశికాపతి ఆత్మలింగము |
ఖలులఁ ద్రుంచును సురల బ్రోచును - కాల భైరవు ఆత్మలింగము ||
7. కామదేవుని కాల్చివేసిన - సోమనాధుని ఆత్మలింగము |
ఆ గజాసురు కుక్షిజీల్చిన - భీమశంకరు ఆత్మలింగము ||
8. కాలపాశము నడ్డుపెట్టిన - మహాకాలుని ఆత్మలింగము |
సాయమందున నాట్యమాడెడి - నాగేశ్వరుని ఆత్మలింగము ||
9. అర్ధరాత్రిని ఉద్భవించెడి - శ్రీ గిరీశ్వరు ఆత్మలింగము |
అన్ని అఘముల కాల్చివేసెడి - రామేశ్వరుని ఆత్మలింగము ||
10. భ్రాంతినంతయు రూపుమాపెడి - వైద్యనాధుని ఆత్మలింగము |
త్రికరణార్పణ సేవ్యమానము - త్రియంబకేశు ఆత్మలింగము ||
11. కేళితాండవా నంద లోలము - కేదారపతి ఆత్మలింగము |
కృష్ణుడెప్పుడు పూజఁ జేసెడి - ఘృష్ణీశ్వరుని ఆత్మలింగము ||
12. పాశుపతమును పార్ధునకొసగు - పరమేశ్వరుని ఆత్మలింగము |
తిన్నడొసగిన కన్ను గలిగిన - వ్యోమకేశుని ఆత్మలింగము ||
13. పాలధారల స్నానమాడెడి - పశుపతీశుని ఆత్మలింగము |
పెరుగు ముద్దలు జాలువారెడి - శర్వదేవుని ఆత్మలింగము ||
14. గోఘృతంబుల తడిసినట్టిది - గోకర్ణపతి ఆత్మలింగము |
ఫలరసంబుల తీర్ధమాడిన - చంద్రశేఖరు ఆత్మలింగము ||
15. మహిషవాహుని మట్టుఁబెట్టిన - కాళికాపతి ఆత్మలింగము |
నారసింహుని నిలువరించిన - శరభేశ్వరుని ఆత్మలింగము ||
16. దక్షశిరమును తుంచివేసిన - వీరేశ్వరుని ఆత్మలింగము |
త్రిపురాసురుల మట్టి కలిపిన - త్రిలోక శాసి ఆత్మలింగము ||
17. ఆంజనేయుడు మోసితెచ్చిన - కైలాసపతి ఆత్మలింగము |
గణేశుడెత్తి జార విడిచిన - నందివాహుని ఆత్మలింగము ||
18. క్షీరజలధిని శిసువుకొసగిన - స్కందజనకుని ఆత్మలింగము |
హాలహలమునె ఆరగించిన - కాలకంఠుని ఆత్మలింగము ||
19. గౌరి తపమును పరీక్షఁ జేయు - హాటకేశ్వరు ఆత్మలింగము |
ప్రమధ గణముల నృత్యలోలము - వృషభేశ్వరుని ఆత్మలింగము ||
20. నాదసాగర గాన మోదము - వేదవేద్యుని ఆత్మలింగము |
తాండవంబున చిందులేసెడి - చిన్మయేశుని ఆత్మలింగము ||
21. స్వప్రాకాశము స్ఫటిక విమలము - తారకేశుని ఆత్మలింగము |
మెరుపుచుక్కల రసోజ్వలమగు - పావకాక్షుని ఆత్మలింగము ||
22. ఙ్ఞాన నేత్రపు కంటి పాపయె - పరాత్పరుని ఆత్మలింగము |
పంచాక్షరిని పలుకఁ జేసెడి - పంచాననుని ఆత్మలింగము ||
23. గొల్లభామకు వెనుక నడచిన - కోటీశ్వరుని ఆత్మలింగము |
భక్తుల కర్మ ముడులు విప్పెడి - విశ్వేశ్వరుని ఆత్మలింగము ||
24. విశ్వమంతయు నాక్రమించిన - స్వయంభు విభుని ఆత్మలింగము |
అష్టసిద్ధుల నతిశయించెడి - ఓంకార శివు 'ఆత్మలింగము' ||
25. అష్టదరిద్ర మంతము జేయు - అగ్నిలోచను ఆత్మలింగము |
అష్టసిరులను అందించెడిది - హిరణ్యేశ్వరుని ఆత్మలింగము ||
26. ఆరోగ్యకర మాయుష్కరము - అమరేశ్వరుని ఆత్మలింగము |
భయమును బాపి ధైర్యమునిచ్చు - వజ్రేశ్వరుని ఆత్మలింగము ||
27. పాండిత్యమును ప్రసాదించెడి - నాసికేశ్వరు ఆత్మలింగము |
కవితాశక్తి ధారనిచ్చెడి - కాలాంతకుని ఆత్మలింగము ||
28. సంతానమును సుఖమునిచ్చెడి - గణేశ గురుని ఆత్మలింగము |
అపమృత్యువును ఆపివేసెడి - కాలాంతకుని ఆత్మలింగము ||
29. అర్జున రధము ముందు నడచెడి - విజయేశ్వరుని ఆత్మలింగము |
శిబి పరీక్షను చేసినట్టిది - కపోతేశ్వరు ఆత్మలింగము ||
30. వ్యాఘ్రమునెక్కి మహిషిఁజంపిన - మణికంఠ గురు ఆత్మలింగము |
విషయవిషమును విరుగుడుఁజేయు - శేషహారుని ఆత్మలింగము ||
31. అద్వైతమత భాష్య వాదము - ఆది శంకరు ఆత్మలింగము |
మండనమిశ్రు నోడించినది - వ్యుప్తకేశుని ఆత్మలింగము ||
32. సర్వఙ్ఞ పీఠమెక్కి వెలిగిన - శృంగ గిరీశు ఆత్మలింగము |
దత్తగురువే కౌగిలించిన - కేరళ శివుని ఆత్మలింగము ||
33. దత్త శివునికి హృదయమందున - సృష్టి చేయగ మొదట పుట్టిన |
సంకల్పమగు శక్తి వీచియె - అనఘాకృతియే ఆత్మలింగము ||