కాశీవాసా ! కాలభైరవా !
కరుణించవేల? కాలకంధరా (పల్లవి)
1. విషయవాసనలు విషసర్పములై - కాటువేయగా నేనేమి చేతు |
హాలాహలమునె మధురామృతముగ - త్రాగిన దేవా ! కాపాడరావా? ||
2. కామాది గుణములు కలి రాక్షసులు - క్రమ్ముకొనిరి నను నేనేమి చేతు |
కాముని త్రిపురుల చూచి బూడిదగ - చేసిన దేవా ! చేదుకొనరావా ||
3. చింతల పలుగుల పోటుల చిత్తము - చూర్ణమయ్యెనుగ నేనేమి చేతు |
అట్టహాసమున జగముల చూర్ణము - కావించుదేవా ! కరుణించలేవా ||
4. ఏకాగ్రతతో ఏక దృష్టితో - నినుఁ జూడలేను నేనేమి సేతు |
ఏకాద్వితీయ హేదత్త దేవ ! - మదన దాహక! మాంపాహి పాహి ||