(మహిషుని చంపిన కనకదుర్గా కీర్తన )
విజయపురాచల కాంచన దుర్గా
తాండవ మందలి చిందులవే || (పల్లవి)
1. మహిషునిఁ జంపిన రోషము శాంతించని కారణమున గంతులతో |
కరముల శూలముఁ దిప్పుచు చుట్టును విద్యుద్దీధితులుప్పతిలన్ |
కనకాభరణములెగురగ, గాజులు గలగల మోతల వెల్లువలో |
విజయపురాచల కాంచన దుర్గా తాండవ మందలి చిందులవే ||
2. గిరగిరఁ దిరుగుచు, ముందుకు దూకుచు, పక్కలకెగురుచు నృత్యములో |
భగభగ మండెడి నిప్పుల కణికెలు రాలగ త్రిణయన దృష్టులతో |
వైశాఖ దివస మధ్యాహ్నపు వడగాలులవడి ఉచ్ఛ్వాసములన్ |
విజయపురాచల కాంచన దుర్గా తాండవ మందలి చిందులవే ||
3. క్రోధ విలఙ్ఘన తాడిత నాగ కులంబుల మెలికల దూకులతో |
అవయవ వీచికలాడగ రక్తము పొంగగ ఎర్రని వెలుగులతో |
కుంకుమ తిలకము స్వేదజలంబుల రేఖలుగానగు ఫాలముతో |
విజయపురాచల కాంచన దుర్గా తాండవ మందలి చిందులవే ||
4. ముడి విదిలింపులు సడలగ, విరబోసిన కేశములవె పాయలుగా |
ఎగిరెడి నల్లని త్రాచులు, మహిషుని అసు పవనంబుల మ్రింగెడిగా |
ముఖమున రొప్పులు శ్వాసలు కస్సుమటంచును బుసబుసలైచెలగన్ |
విజయపురాచల కాంచన దుర్గా తాండవ మందలి చిందులవే ||
5. పదములనందెలు వెండివి మెండుగ ఘల్లు ఘల్లుమని శబ్ధములన్ |
పదపదమందున చేయగ నసురుల బండల గుండెలు ఖండములై |
దితిసుత రక్తము ఎగురుచు చిందుచు బిందువులై ముఖమందు పడన్ |
విజయపురాచల కాంచన దుర్గా తాండవ మందలి చిందులవే ||
6. కులుకుచు శూలము నాడించుచు, కుచపర్వత కంపము లింపులుగా |
పరవశమొందిన దత్తుడు చూదగ ప్రణయము పొంగగ సన్నిధిలో |
నిలువగ చూచెను మధురస్మితయై శాంతించెను శాంతించెనుగా |
విజయపురాచల కాంచన దుర్గా తాండవ మందలి చిందులవే ||