20 Oct 2024
ఉపవాసము అనగా ఉప=స్వామి సమీపము నందు, వాసః=నివసించుట. అనగా స్వామి యొక్క గొప్పదనమును తెలుసుకొను సత్సంగములలోను, స్వామిపైనున్న ప్రేమను వ్యక్తము చేయు భజనలలోను నిమగ్నమై ఆహారమును అప్రయత్నముగా తీసుకొనకపోవుట. ఇందులో ఆకలి కూడా స్ఫురణకు రాకపోవుట. అంతే కాని ఆకలి వేయుచుండగా జీవుని బాధించుకొనుట కానే కాదు. కొందరు అన్నమునకు బదులుగా అప్పచ్చులను తిని ఉపవాసమనుచున్నారు. ఇదే నిజమైనచో కేవలము గోధుమరొట్టెలనే తిను ఉత్తరదేశీయులు నిత్యోపవాసులగుదురు. అన్నము అనగా నోటితో స్వీకరింపబడునది అని అర్థము. అసలు ఉపవాసమునకును అన్నమునకును ఎట్టి సంబంధము లేదు.
ఏ రోజు స్వామి యొక్క సత్సంగములో నిమగ్నమైపోయి వంట చేయుటకు కూడా సమయము లేక భోజనమును అప్రయత్నముగా వదలివేయుదురో అదే ఉపవాసము. భగవంతునిలో లీనమయేంత ఉన్నతస్థాయికి పోలేక మధ్యలో అకలి అగుచో క్షీరఫలాదులను స్వీకరింతురు. "పయో బ్రాహ్మణస్య వ్రతమ్" అని శ్రుతి. అనగా బ్రహ్మజ్ఞాన సత్సంగములను చేయువారు మధ్య మధ్యలో క్షీరపానము చేయవలయునని అర్థము. దీనిచే శక్తి లభించును. మరియు పాలు సులభముగా జీర్ణమగుట వలన తమోగుణమైన మత్తు రాదు. ఫలములు కూడా పాలవంటివే. ఆ విధముగా ఎవరు రోజంతయును సత్సంగములతో, భజనలతో గడుపుదురో వారికి అట్టి రోజే "దత్త జయంతి".
ఆరాధనయందు దేశ-కాల భ్రమలు
దత్తజయంతి అనగా దత్తుడు పుట్టినరోజు కాదు. ఆయనకు పుట్టుటయే లేదు. అత్రి అనసూయల భక్తికి మెచ్చి సాక్షాత్కరించిన రోజే దత్తజయంతి. అట్లే నీకును నీ భక్తికి మెచ్చి దత్తుడు సాక్షాత్కరించిన రోజే నీకు దత్తజయంతి. కేవలము అత్రి అనసూయలకే మార్గశీర్షపూర్ణిమ దత్తజయంతి. అది వారికి సాక్షాత్కరించిన దినము. ఆ రోజుతో నీకేమి సంబంధము? మార్గశీర్షపూర్ణిమ వచ్చినది కావున వారికి దత్తుడు సాక్షాత్కరించినాడా? లేక వారి తపస్సుకు మెచ్చి సాక్షాత్కరించినాడా?
యజమాని ఒక సేవకుని సేవలకు మెచ్చి సోమవారమునాడు వానికి ముత్యాలహారమును బహుమతిగా ఇచ్చినాడు. దానిని చూచి ముత్యాలహారమును ఇచ్చుటకు సోమవారము కారణమని యజమానికి ఎట్టి సేవలు చేయక ప్రతి సోమవారమునాడు యజమాని ఎదుట నిలచినాడు. కాని ఏ సోమవారమునాడును వానికి ముత్యాలహారము లభించలేదు. ఇది కాలభ్రమ. ఏలననగా ముత్యాలహార దానమునకు కారణము సేవకుడు చేసిన సేవలు కాని సోమవారము కానే కాదు. నీవును సేవలు చేసినచో యజమాని ప్రసన్నుడై నీకు ముత్యాలహారము నీయవచ్చును. నీకు ఇచ్చు రోజు సోమవారము కాకపోవచ్చును. అది మంగళవారము కావచ్చును. కావున నీ సేవలకు ప్రసన్నుడై దత్తుడు నీకు సాక్షాత్కరించిన రోజే నీకు దత్తజయంతి. కావున కాలములో ఎట్టి విశేషము లేదు.
అట్లే దేశములో కూడా ఎట్టి విశేషము లేదు. సేవలు చేసిన సేవకునకు యజమాని ముత్యాలహారమును తన ఇంటిలో ఒక గదిలో ఇచ్చి ఉండవచ్చును. సేవలు చేయక ఆ గదిలోనే ఎప్పుడునూ నిలచినంత మాత్రమున ముత్యాలహారము లభించునా? కాళహస్తిలో తిన్నడిని స్వామి అనుగ్రహించెను. నీవు కాళహస్తికి పోయినంత మాత్రమున అచ్చట శివుడు నిన్ను అనుగ్రహించునా? ఇది దేశభ్రమ. ఇట్లు దేశకాల భ్రమలయందు అజ్ఞానులు, అమాయకులు అగు ఈ జీవులు చిక్కి, తత్త్వమును తెలియక గుడ్డివారిని పట్టుకొన్న గుడ్డివారివలె బావిలో పడుచున్నారు. "అన్ధేనైవ నీయమానా యథాన్ధాః" అని శ్రుతి.
ఈ సంప్రదాయములన్నియు మొట్టమొదట ఋషుల ఆచారములై యుండెను. అప్పుడు అవి ఎంతో పవిత్రమైన అర్థము కలిగియుండెను. కాని కాలక్రమమున మధ్యకాలము వారు మిడిమిడి జ్ఞానములో సంప్రదాయములను తప్పుదోవలు పట్టించి అపార్థము కావించినారు. ఏనాడు నిన్ను స్వామి అనుగ్రహించునో ఆనాడే నీకు ఏకాదశి పుణ్యతిధి. ఆనాడే శివరాత్రి. ఆనాడే దత్తజయంతి. ఏ ప్రదేశమున స్వామి నిన్ను అనుగ్రహించునో ఆ ప్రదేశమే భద్రాచలము-కాశీ-సహ్యాద్రి.
అసలైన ఉపవాసము – నిజమైన జాగరణము
పండుగ దినములందు స్వామియొక్క సత్సంగములతో, భజనలతో వంట చేయుటకు సమయము లేక ఉపవాసములు చేయుచు, నిద్రరాక జాగరణము చేయుచూ ఋషులు గడిపినారు. కాని ఈనాడు పగలంతయు పిండివంటలు చేయుచూ వాటిని భుజించుటలో, మత్తుతో నిద్రించుటతో పండుగలు ముగియుచున్నవి. జాగరణము అనగా సత్సంగములోబడి, అప్రయత్నముగ నిద్ర రాకుండుట. కాని ఈనాడు జాగరణము అనగా ఒక టికెట్టుపై మూడు సినిమాలు చూచుట లేక పేకాట ఆడుట.
కావున సంప్రదాయములు, పుణ్యకర్మలు అసలు అర్థము కోల్పోయి భ్రష్టములై నీచస్థాయికి దిగజారినవి. వీటి యొక్క అసలు అంతరార్థమును బోధించి, వీటి యొక్క పునరుద్ధరణమునకే శ్రీదత్తసద్గురువు మాటిమాటికి అవతరించుచున్నాడు.
అరుంధతి నిత్యము భోజనము పెట్టగ భుజించుచున్న దుర్వాసుడు తాను ‘నిత్యోపవాసి’ అన్నాడు. నిత్యోపవాసియైన దుర్వాసుడు దారినిమ్మన్నాడని అరుంధతి గంగానదిని అర్థించగా గంగ దారిని ఇచ్చినది. దుర్వాసుడు నిత్యోపవాసి ఎట్లైనాడు? ఆయన నిత్యము తపస్సు చేసుకొనుచు దైవమునందు లగ్నమైయున్నాడు. కావున ఉపవాసమనగా ఆహారమును గ్రహించక నకనకలాడుటయా? అరుంధతి దుర్వాసునకు ప్రతిరోజు పాలు, కందమూలములను తెచ్చెడిది. ఎందులకు?
ఇంటిలో అరుంధతి వశిష్ఠులు, ఋషులతో కూడా ఉపనిషత్తులను చర్చించెడివారు. వంట చేయుటకు సమయము లేదు. కావున ఋషుల ఆశ్రమములలో ఏనాడు వంటలు ఉండెడివి కావు. కేవలము పాలు, పండ్లు, కందమూలములే యుండెడివి. ఈ స్థితి ఈనాడు వచ్చుటకు కారణమేమి? ఒక్కటే కారణము. భగవంతుని యందు స్వార్థరహితమైన, సత్యమైనప్రేమ లేకుండుటయే. నీ కుమారునిపైన ఉన్నంత ప్రేమ మాత్రము నీకు భగవంతునియందు లేదు.
★ ★ ★ ★ ★