21 Oct 2024
పూజలలో చేయు సంకల్పములు ఎంత సబబు?
కుమారుని ముద్దుచేసి అన్నము తినిపించుచున్నప్పుడు ఓ కుమారా! నాకు వృద్ధాప్యములో సేవలు చేయుదువా? అలా చేస్తావనే నీకు ఇప్పుడు గోరుముద్దలు పెడుతున్నాను అనుచున్నావా? వాడు నిన్ను వృద్ధాప్యములో దూషించుచున్నాడు. అప్పుడు కూడా వానిని ఆశీర్వదించుచునే ఉన్నావు. ఇట్టి ప్రేమతో నీవు ఒక్కరోజు అయినా భగవంతునికి సేవ చేసినావా? నీవు పూజ చేయుచున్నప్పుడు సంకల్పములోనే ఫలానా పనికోసము ఈ పూజ చేయుచున్నాను అని చెప్పుచున్నావు. నీవు నీ తండ్రికి అన్నము పెట్టునప్పుడు తండ్రీ! నీవు ఈ ఇంటిని నాకు వ్రాసి ఇచ్చెదవని అన్నము పెట్టుచున్నాను అన్నచో ఆ తండ్రికి ఎంత ఖేదము కలుగును?
అట్లే మన సంకల్పములలో సర్వకార్య విజయార్థం, ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం, వ్యాపారాభివృద్ధ్యర్థం అని చెప్పుచూ పూజలను చేయుచున్నాము. ఈ కారణము చేతనే స్వామికి జీవులపై అసహ్యము, రోత ఏర్పడినవి. అందుకే కనీసము సాక్షాత్కరించుట కూడా లేదు. వీరికి నా ముఖము చూపరాదు. వీరి ముఖములను నేను చూడను అని నిశ్చయించుకున్నాడు.
మోక్షము కూడా పెద్దకోరికే. అది చిన్న చిన్న జేబు దొంగతనముల కన్ననూ ఒకసారే బందిపోటు వలె బ్యాంకులను కొల్లగొట్టుట. ఇల్లు, ఉద్యోగము, సంతానము మొదలగునవి ఆనందదాయకములు కదా. ఇక మోక్షమన్నచో సర్వదుఃఖ నివృత్తిరూపమైన నిత్యానందమైన స్వామి స్థానము. స్వామి కైవల్యమును కోరుటయనగా ప్రతిరోజూ వంద, వేయి కోరుట కన్ననూ స్వామి యొక్క మొత్తము అస్తి మన పేరున వ్రాయించుకొనుట. అందుకే శంకరులు నాకు మోక్షమునందు కోరిక లేదు, "న మోక్షస్యాకాంక్షా" అన్నారు.
భగవంతునికి మ్రొక్కే మ్రొక్కులలో నిజమెంత?
ఇక ఈనాడు స్వామి యందు ఎంత విశ్వాసమున్నది అనగా "నీవీ పనిని ముందు నాకు చేసినచో నేను నీకు కళ్యాణమును చేయింతును" అని మ్రొక్కుచున్నారు. అనగా ధనమును ఖర్చుపెట్టి ముందుగా కళ్యాణమును చేయించినప్పుడు, మన పని కాకున్నచో ఆ ఖర్చు వృథా, అనవసర ఖర్చు అగును గదా. దుకాణములోనికి పోయి ఫలానా వస్తువు ఇమ్మని, తీసుకున్న తర్వాతనే మూల్యము చెల్లించుట. మరికొందరు ఈ పనిని చేసినచో నీకు తలనీలాలు ఇచ్చెదమని మొక్కుకొనుచున్నారు. ఆ కేశములు ఇచ్చుట కూడా ఎండాకాలములో ఇచ్చినచో, తలకు చెమట పోయక హాయిగా ఉండుట చేత ఆ పనిని ఎండాకాలములో ఎక్కువగా చేయుచున్నారు. ఇది దేవుని ఆరాధించుటయా? లేక అవమానించుటయా?
సత్యమైనప్రేమ ఎచ్చటనూ లేదు. కుమారునికి సైతము ఆస్తిని ఎవరును ముందుగా వ్రాయుట లేదు. నాతదనంతరమే అని వీలునామా వ్రాయుచున్నారు. అనగా ఆ భయముతో కుమారుడు వృద్ధాప్యములో వారిని సరిగా చూడవలయుననియే కదా! ఇట్లు లౌకిక బంధములందును సత్యమైనప్రేమ లేదు. "ఆత్మనః కామాయ సర్వం ప్రియం భవతి" అని బృహదారణ్యక శ్రుతి చెప్పుచున్నది. అనగా లోకబంధములన్నియు స్వార్థపూరితములే అని అర్థము.
తనకు సుఖమునిచ్చు భర్తను, భార్య ప్రేమించుచున్నది. అట్లే తనకు సుఖమునిచ్చు భార్యను, భర్త ప్రేమించుచున్నాడు. అట్లే వృద్ధాప్యమున తమను సేవించునను స్వార్థ అపేక్షతో తల్లితండ్రులు సంతానమును ప్రేమించుచున్నారు. సంతానము కూడా సుఖకారణమైన ధనము తల్లితండ్రుల నుంచి లభించును అను ఆశతో తల్లితండ్రులను ప్రేమించుచున్నారు. ఆశించినవి లభించనిచో ఒకరినొకరు తిట్టుకొనుచున్నారు. కాని, దౌర్భాగ్యము ఏమి అనగా, ఈ లోకబంధములలో ఉన్నంత మాత్రపు ప్రేమ స్వామిపై లేదు గదా!
★ ★ ★ ★ ★