13 Dec 2024
త్రిమూర్తులే స్వయముగ మతత్రయాచార్యులుగా అవతరించినారు. శంకర, రామానుజ, మధ్వాచార్యులు ఆయా కాలముల పరిస్థితులలో ప్రచారము చేసిన మతములను సమన్వయ పరచుటకే ఈ “దత్తమత సమన్వయయోగము” అనుగ్రహించబడినది. పరమార్థదశ స్వామి యొక్క స్థితి. వ్యయహార దశ జీవుని స్థితి. వ్యవహార స్థితి లోని జీవుడు పరమార్థ స్థితిలోని వాక్యములను విన్నచో భ్రష్టుడగును. అనగా జీవుడు నా స్థితివాక్యములను తన స్థితిలో సమన్వయించుకొన్నచో పతితుడౌతాడు. ఈ విధముగా జీవులు నిజముగానే భ్రష్టమైనందునే శంకరులు మరల రామానుజ, మధ్వ రూపాలలో అవతరించినారు. త్రిమతముల ఆచార్యుల సమన్వయమే నా భాష్యము, అత్యంత పావనము. ఆయా సమయములలోనున్న సాధకజీవుల యొక్క సాధనదశలలోని గుణ, కర్మల ననుసరించి త్రిమతాచార్యులును భిన్నులు కావలసి వచ్చినది. శిష్యుల గుణకర్మ దశలననుసరించి భిన్నముగా బోధించవలసివచ్చినది. ఎవడు త్రిమూర్తులలోను, త్రిమతాచార్యులలోను బేధమును చూచునో అట్టివాడు ఈ సృష్టి యున్నంతవరకును నరకలోకమునందు ఉండును. జీవుని యొక్క పరమార్థదశ స్వామికి వ్యవహారదశ మాత్రమే. నా పరమార్థదశ అతి విచిత్రముగాన జీవుని బుద్ధికి అందదు. నా విచిత్రతత్త్వమైన మాయ దేవతలకే అందలేదు. మనుజుల కందునా?
అత్యల్పమైన వస్తువు లేదని శంకరులు, అత్యల్పమైన వస్తువు ఉన్నదని రామానుజ, మధ్వులు, అత్యల్పమైన వస్తువులోని ధర్మము ఉన్నదని శంకరులు, అత్యల్పమైన వస్తువు యొక్క ధర్మము లేదని రామానుజ, మధ్వులు అన్నారు. ఒక చోట అత్యల్పమున్నదని సిద్ధాంతము. అదే సిద్ధాంతము మరియొక చోట అత్యల్పము లేదని చెప్పుచున్నది. ఇదే పనిని రెండో సిద్ధాంతము చేస్తున్నది. అంటే తాత్త్వికముగా రెండు సిద్ధాంతాలు ఒక్కటే అని తాత్పర్యము. ఆయా సమయములలో జీవుల సాధనదశ ననుసరించి అపార్థములను తొలగించుటకు ఇట్లు చెప్పవలసి వచ్చినది. ఇది సమన్వయము. విశిష్టాద్వైతమున, ద్వైతమున కూడ సమానమైన అంశము ఇది. మహాగ్ని (బ్రహ్మము) కన్న భిన్నముగా నిప్పురవ్వ (జీవుడు) ఉన్నది. కాని మహాగ్ని ముందు నిప్పురవ్వ లోని దాహకత్వము (బ్రహ్మత్వము) చాల చాల తక్కువ కాన లేనట్లే కావున నిప్పురవ్వ అతి చిన్న బూడిద కణమే. అద్వైత - విశిష్టాద్వైత - ద్వైతములలో సమానాంశము ఇది. మహాగ్నియును నిప్పురవ్వయును తాత్త్వికముగా ఒకే అగ్ని పదార్థములు. అలానే బ్రహ్మము, జీవుడూ చైతన్యమను పదార్థములే. ఇక విశిష్టాద్వైత – ద్వైతములలో భేదమేమనగా, మహాగ్ని చుట్టును ఉన్న బూడిదరాశి మహాగ్నికి శరీరము వంటిది అని విశిష్టాద్వైతము చెప్పగా బూడిదరాశి మహాగ్నికి శరీరము కాదు, మహాగ్ని చుట్టూ వున్న వేరు పదార్థము అని ద్వైతము చెప్పినది. జగత్తు యొక్క దోషములు బ్రహ్మమునకు అంటకుండుటకై (జీవుడూ జగద్భాగమే కాన) జగత్తు, బ్రహ్మము భిన్న భిన్నములన్నారు రామానుజులు.
జగత్తు యొక్క దోషములు బ్రహ్మము యొక్క శరీరానికి అంటకుండా ఉండుటకై జగత్తు బ్రహ్మము యొక్క శరీరము కాదు అన్నారు మధ్వులు. అయినా, వారి ముగ్గురి మతముల హృదయమొక్కటే. నవీనవిజ్ఞాన మతము ఏమనుచున్నది? మహాగ్నియును, బూడిదయును ఒకే శక్తియొక్క రూపాంతరములని నిరూపించుచున్నది. కాన తాత్త్వికముగా బ్రహ్మభిన్నమైన జగత్తు అంతయును బ్రహ్మమేనని చెప్పిన అద్వైతము కూడ సత్యమే. విపరీతబుద్ధులు చేసిన వక్రార్థాలను నివారించుటకై రామానుజ, మధ్వులు, నాస్తికులైన బౌద్ధులను మార్చుటకై శంకరులు అట్లు పలికినారని తెలియవలయును. అనగా అగ్ని – బూడిదలు ఒకే శక్తి పదార్థము అయినా, నా విచిత్రమాయ వలన వేరు వేరు పదార్థములుగా గోచరించుట అనుభవములో కనబడుచున్నది. తాత్త్వికముగా సర్వము బ్రహ్మమే, కాన జీవుడు బ్రహ్మమే కాన, అద్వైతము సత్యమే. అభివ్యక్తమైన శక్తిభేదము వలన బ్రహ్మము ముందు హస్తిమశకాంతర భేదము కలిగిన వాడు జీవుడు కావున విశిష్టాద్వైత – ద్వైతములూ సత్యములే. జగత్తు బ్రహ్మమునకు శరీరము వలె విడదీయుటకు వీలు కానిదైననూ, లేక వేరుగా కుండవలె ఉన్ననూ, జీవుడు, శరీరము, కుండ – ఈ మూడును ఒకే చిచ్ఛక్తి పదార్థనిర్మితములని నవీనవిజ్ఞాన మతము. ఈ విధముగా అద్వైతము తాత్త్వికముగా సత్యము.
జీవుడు – శరీరము – ఘటము విభిన్నములుగా ఉన్నదనుట సత్యమే. ఏలననగా ఒక పదార్థము మరియొక పదార్థము కాదు కావున వేరుగా ఉన్నట్లే గదా. పదార్థముల మధ్యనున్న ఆకాశమూ చిచ్ఛక్తిస్వరూపమే కాన, పదార్థములు విడదీయుటకు వీలు లేక అవినాభావ సంబంధము కలిగియుండుట నిజమే. ఈ విధముగా అద్వైత – ద్వైత – విశిష్టాద్వైత మతములు సత్యములై అన్యోన్యవిరోధము లేకయే ఉన్నవి. జీవుడు-దేవుడు వేరు కాన ద్వైతము, దేవుని శరీరమునుండి జీవుని విడదీయుటకు వీలు లేనిదిగా ఉన్నందున విశిష్టాద్వైతము అని తెలియవలెను. అద్వైతకైవల్యమునందు నేను నన్నుపాసించువాడు ఎవడో, వాడు నా శరీరములో అవయవము అనగా శేషముగా నన్ను ఉపాసించునో వాడు, ఇరువురము కేవలము సమానము అగుటయే కాన అద్వైత కైవల్యము కన్ననూ విశిష్టాద్వైత కైవల్యము ఇంకా గొప్పది.
నాకు దాసుడగు వాడు ఇంకను గొప్పవాడు. ఏలననగా వానికి నేను సదా దాసుడనగుదును. కాన ద్వైతముక్తి ఇంకనూ గొప్పది. అందు వలననే ముందు శంకరులు తరువాత రామానుజులు తర్వాత మధ్వులు క్రమముగా ఒకదాని కన్న ఒకటి గొప్పది యగు ముక్తిని కాలక్రమమున చెప్పిరి. సూర్యుడు స్వయంప్రకాశము. స్ఫటికము – సూర్యదీప్తమైనది. అట్లే బ్రహ్మము స్వతంత్రజీవుడు. జీవుడు బ్రహ్మాధీనము. బుద్ధిలో నున్న బ్రహ్మమును జీవుడు అన్నారు శంకరులు. జీవశబ్దాన్ని, సమానార్థములో ప్రవర్తించిన బుద్ధిగా తీసుకున్నారు రామానుజ, మధ్వులు. అంటే బుద్ధిలోని బ్రహ్మము జీవుడు అని శంకరులు అనగా బుద్ధియే బ్రహ్మమని రామానుజ మధ్వులు అనిరి.
వేదవాక్య ప్రమాణముననుసరించి, ప్రత్యక్ష ప్రమాణముపై ఆధారపడిన తర్కశాస్త్రముననుసరించి, తపస్సు చేత నా ఈ పరబ్రహ్మ స్వరూపమును దర్శించి విశ్వసించిన వాడికే, నాపై శ్రద్ధ పెరిగిన కొలదీ వానిలోనికి ప్రవేశించి నేను వానిని పూర్తిగా ఆక్రమిస్తాను. వాడే నేను అవుతాను. ఇదే అద్వైతకైవల్యము. శంకర, రామానుజ, మధ్వుల మతము ఒక్కటే అని నిరూపించుటకు ఇది ఒక ఉదాహరణము.
1. నీ ఊహను నీనుండి వేరుచేయలేవు కాన నీ ఊహ నీ శరీరము వంటిదే. ఇది రామానుజమతము.
2. అయితే నీ ఊహాత్మకమైన కుండ నీ కన్నా బాహ్యముగా ఉన్నది గదా. కనుక రెండు వేరు వేరుగా ఉన్నవి. ఇది మధ్వమతము.
3. అయితే ఊహాత్మకమైన కుండ కేవలము నీ ఊహయే. అత్యల్పము కాన దాదాపు లేని వంటిదే కాన మిథ్యయే. ఇది శంకరమతము. కాన ముగ్గురి మతమూ ఒక్కటియే.
శంకరులు జగత్తును మిథ్య అన్నారే కాని అభావము అనలేదు. సాధకుడు జగత్తును మిథ్యగా భావించి జగత్తు వైపు కాక, తన బుద్ధిని బ్రహ్మముపై కేంద్రీకరించునని సత్సంకల్పముతో ఈ అంశమును ప్రతిపాదించారు. కాని జీవులు దీనికి వక్రార్థమును కల్పించి, జగత్తు అసత్యము కాన, వారు చేయు పాపములు కూడ అసత్యములేనని పాపములు చేయనారంభించిరి. ఈ అపార్థమును పరిహరించుటకై, శంకరులే రామానుజులుగా అవతరించెను. జగత్తు మిథ్య అనగా అసత్యము కాదు సత్యమేననియు, పరిణామము చెందుట వలన అనిత్యమనియు చెప్పినారు. ఐతే ఈ పరిణామ వికారములు అన్నియు శరీరము వంటి జగత్తు లోనే తప్ప, ఆత్మ వంటి బ్రహ్మకు అంటవని చెప్పినారు. శంకరులు ఎటూ జగత్తును దాదాపు అసత్యముగా పరిగణించినారు. కావున, జగత్తులోని వికారములు బ్రహ్మమునకు అంటవు అన్నారు. కావున అద్వైత – విశిష్టాద్వైత మతములలో భేదము రాదు.
ఇట్లుండగా జగత్తు బ్రహ్మము యొక్క అవయవము వంటిది అన్నారు కావున అవయవము యొక్క వికారములు బ్రహ్మమునకు వచ్చునని కొందరు పండితులు ఆక్షేపించినారు. అందువలన రామానుజులే బ్రహ్మ రూపమున మధ్వులుగా వచ్చి – బ్రహ్మము కన్నా జగత్తు భిన్నమైనదనియు కావున శరీరము కాదనియు కుమ్మరి వాని కన్న వేరుగ కుండవలె యున్నదని చెప్పిరి. నేను ఒక మానవశరీరమును ఆశ్రయించినపుడు అవతారపురుషుడు అగుచున్నాను. అప్పుడు నేనే బ్రహ్మమని చెప్పుచున్నాను. నేను ప్రతిదానిలోను సంపూర్ణముగనే ఉన్నాను గదా కాన అది సత్యమే.
కాని జీవుడు (బుద్ధి) అట్లు చెప్పరాదు. జీవుడు తాత్త్వికముగా బ్రహ్మమే కాని, పరిపూర్ణుడు కాడు. జీవుడు జలబిందువే గాని, సమద్రము కాదు. శంకరులు జీవశబ్దమును బ్రహ్మపరముగా తీసుకున్నారు. రామానుజ, మధ్వులు జీవశబ్దాన్ని రూఢముగాను, యౌగికము గాను తీసుకొని దేహాన్ని నేరుగా జీవింపచేసే తన బుద్ధి– క్షేత్రము – పరాప్రకృతి – పురుషుడు మొ|| శబ్దాలలో చెప్పబడే పరమాత్మాధీనమైన జడశక్తిని శబ్దార్థముగా తీసుకున్నారు. విచారిస్తే, ఈ రెండు మతాలలో అసలు పరస్పర విరోధము ఏమీలేదు.
ఒక ప్రాణిలో పరిపూర్ణముగా ఉన్న నన్నే అనగా బ్రహ్మమునే పరాప్రకృతి, జీవుడు, పురుషుడు, క్షేత్రజ్ఞుడు అన్నారు శంకరులు. నామీద ఆధారపడి నా ఆధీనములో యున్న దేహమును అపరాప్రకృతి, బుద్ధి, క్షేత్రము, చేతన అన్నారు శంకరులు. విశ్వగతుడగు “నేను” కు ఒక ప్రాణిగతుడగు – ‘‘నేను’’ కు ఏ బేధము లేదు కావున ప్రాణిగతుడైన “నన్నే” బ్రహ్మమంటూ జీవుడే బ్రహ్మము అన్నారు శంకరులు. విశ్వము – దేహము – అత్యల్పము కావున అభావముగా పరిగణించి మిథ్య అన్నారు శంకరులు. రామానుజులు, మధ్వులు కూడా ఇదే చెప్పినారు. అయితే శంకరవాదము వల్ల వచ్చిన అపార్థములను తొలగించినారు. రామానుజుల సవరణ ఇలా ఉన్నది – నన్ను కేవలం విశ్వగతుడైన పరిపూర్ణబ్రహ్మమునే పరమాత్మగా తీసుకున్నారు. అప్పుడు బ్రహ్మముపై ఆధారపడిన విశ్వంలోని ఒక భాగము జీవుడైనాడు. పరమాత్మపరముగా ఈశ్వరశబ్దాన్ని వాడినారు. జీవశబ్దాన్ని పరమాత్మపరముగా వాడలేదు. ఈశ్వరశరీరమైన ప్రకృతిక్షేత్రము అను జగత్తులోని అవయవము మాత్రమే అయినాడు జీవుడు. ఇది రామానుజుల వివరణ. దీని వలన కూడా అపార్థము వచ్చినది. దోషారోపణ చేసేవారు – ఈశ్వరశరీరములో జరిగే జగద్వికారాలన్నీ ఈశ్వరునికి అంటవని వాదించినారు. అప్పుడు మధ్వులు ఈ విధముగా వివరించినారు. అసలు జగత్తు ఒక రోమము వలె, వ్యక్తి కన్నా భిన్నమైనది. జగత్తులో భాగమగు జీవుడు కూడా పూర్తిగా భిన్నుడేనని స్థాపించి ఈ అపార్థమును తొలగించినారు. శంకరులే రామానుజులు, మధ్వులు.
నేను ముందుగా శంకరాచార్య రూపములో వచ్చి జ్ఞానమును బోధించాను, ఆ తరువాత రామానుజాచార్యుల రూపములో వచ్చి భక్తిని బోధించాను. వస్తువు దొరికిన తరువాత ప్రతిఫలాపేక్ష రహితముగా సేవించుటయే చివరిదశ. ఈ సేవయే ప్రాప్తి యొక్క ఫలము. దీని తరువాత ఫలము లేదు. అందుకే చివరకు మధ్వాచార్య రూపములో వచ్చి సేవను బోధించాను. సర్వపాత్రలధారియు, సర్వవేషముల వస్తువులను సృష్టించిన వాడును ఒక్కడే శ్రీదత్తుడు. ఈ పాత్రలు, వేషముల వస్తువులు ఈ పాత్రధారి దృష్ట్యా అత్యల్పములు కాన అసత్యములే. ఇట్లు తెలియుటయే అద్వైతము. నిజ స్వరూపము శ్రీదత్తుడు అని, వేషములను వేసినది వేషధారి దత్తుడే అని, ఇట్లు తెలియుట ఆధార – ఆధేయ సంబంధము. దత్తుడు ఆధారము. మిగిలినవి ఆధేయములు. ఇట్లు తెలియుటయే విశిష్టాద్వైతము. ఆధారస్వరూపుని ఆజ్ఞ ప్రకారముగా నడచుకొని, ఆధేయములు సేవించుకొనవలయునని తెలియుటయే ద్వైతము. ఈ మూడును త్రిమతములు.
Also Read:
శ్రీశంకరాచార్యుల వారు - అద్వైతసిద్ధాంతము
★ ★ ★ ★ ★